Wednesday, January 22, 2025

ఆయుధాలు త్యజించి లొంగిపోండి..నక్సల్స్‌కు హోమ్ మంత్రి హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

హింసాకాండకు స్వస్తి పలకాలని, ఆయుధాలు త్యజించి, లొంగిపోవాలని నక్సల్స్‌కు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం విజ్ఞప్తి చేశారు. లేకపోతే వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోగలమని మంత్రి హెచ్చరించారు. ఢిల్లీలోని తన నివాసంలో ఛత్తీస్‌గఢ్ నుంచి నక్సల్ హింసాకాండ బాధితులు 55 మందిని ఉద్దేశించి అమిత్ షా ప్రసంగిస్తూ, మావోయిస్టులు 2026 మార్చి 31 కల్లా తుది శ్వాస తీసుకుంటారని, అప్పటికి వారిని నిర్మూలిస్తామని చెప్పారు. దేశంలో నుంచి నక్సల్ హింసాకాండను, సిద్ధాంతాన్ని తుడిచిపెట్టేయాలని ప్రధాని నరేంద్ర మోడీ నిశ్చయించినట్లు ఆయన తెలియజేశారు. ‘ఈశాన్యంలో తీవ్రవాదులు చేసినట్లుగా హింసాకాండకు స్వస్తి పలికి, ఆయుధాలు విడనాడి, లొంగిపోవాలని నక్సల్స్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు వినకపోతే ఆ బెడద నిర్మూలనకు త్వరలోనే సకల విధ చర్యలు తీసుకోగలం’ అని అమిత్ షా చెప్పారు. నక్సలిజం మానవాళికి, దేశ అంతర్గత భద్రతకు ముప్పు అని హోమ్ శాఖ మంత్రి అన్నారు. భద్రత బలగాలు మావోయిస్టులపై తమ కార్యకలాపాల్లో గణనీయమైన విజయం సాధించారని, ఆ సమస్య ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లోని కేవలం కొన్ని జిల్లాలకు పరిమితం అయిందని మంత్రి చెప్పారు.

‘2026 మార్చి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిబద్ధమై ఉంది. మోడీ ప్రభుత్వ విధానాల కారణంగా వామపక్ష తీవ్రవాదం ఛత్తీస్‌గఢ్‌లో కొన్ని జిల్లాలకు పరిమితం అయింది’ అని అమిత్ షా తెలిపారు. మావోయిస్టులు ఒకప్పుడు పశుపతినాథ్ (నేపాల్) నుంచి తిరుపతి (ఆంధ్ర ప్రదేశ్) వరక ఒక కారిడార్ ఏర్పాటు చేయాలని సంకల్పించారని, కానీ మోడీ ప్రభుత్వం దానిని ధ్వంసం చేసిందని కేంద్ర మంత్రి చెప్పారు. నక్సలైట్ల మానవ హక్కుల గురించి ప్రవచించేవారు నక్సలిజం బాధితుల మానవ హక్కులను పరిగణనలోకి తీసుకోవాలని అమిత్ షా సూచించారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్ హింసాకాండ బాధత ప్రజల కోసం కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో వచ్చే మూడు నెలల్లో ఒక సమగ్ర సంక్షేహ పథకాన్ని రూపొందిస్తుందని ఆయన తెలియజేశారు. వధించే వారి కన్నా మానవ ప్రాణాలను కాపాడేవారే మహోన్నతులు అనే సందేశాన్ని వామపక్ష తీవ్రవాద బాధిత ప్రాంతాల్లో అభివృద్ధి పథకాల ద్వారా మోడీ ప్రభుత్వం మావోయిస్టులకు ఒక సందేశం పంపిందని అమిత్ షా చెప్పారు.

బస్తర్ శాంతి కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ వచ్చిన ఛత్తీస్‌గఢ్ నక్సల్ హింసాకాండ బాధితులు 55 మందితో అమిత్ షా ముఖాముఖి కూడా సాగించారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ బాధితుల దుస్థితిని వివరిస్తూ ఒక డాక్యుమెంటరీని కూడా బస్తర్ శాంతి కమిటీ ప్రదర్శించింది. బాధితులు కొందరు తమ గాథలను కేంద్ర హోమ్ శాఖ మంత్రికి తెలియజేశారు. ‘వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడంతో బస్తర్ మళ్లీ రమణీయమైన, ప్రశాంతమైన, అభివృద్ధి చెందిన ప్రాంతం కాగలదు’ అని అమిత్ షా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News