మంత్రులతో అమిత్ షా భేటీ
క్షేత్రస్థాయి అంశాలపై దృష్టి
అధికారులు, ఎన్‌టిపిసి హాజరు
న్యూఢిల్లీ : కేంద్ర బొగ్గు, విద్యుత్ శాఖల మంత్రులతో హోం మంత్రి అమిత్ షా సోమవారం కీలక భేటీ నిర్వహించారు. దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడా బొగ్గు నిల్వలు అందకపోవడం, దీనితో తలెత్తుతున్న విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.విద్యుత్ మంత్రి ఆర్‌కె సింగ్, బొగ్గు గనుల మంత్రి ప్రహ్లాద్ జోషీలతో దాదాపుగా గంట పాటు ప్రధానంగా పలు కీలక అంశాలపై చర్చ జరిగిందని వెల్లడైంది. బొగ్గు గనులలో దండిగానే నిల్వలు ఉన్నాయని, సరఫరాలో జాప్యాన్ని నివారించడం జరుగుతుందని ఒక్కరోజు క్రితమే కేంద్రం తరఫున బొగ్గు, విద్యుత్ మంత్రిత్వశాఖలు ప్రకటనలు వెలువరించాయి. అయితే వాస్తవికంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న లోపాలను ఆరాతీసేందుకు ఈ ఇద్దరు మంత్రులతో అమిత్ షా భేటీ జరిపినట్లు స్పష్టం అయింది. వీరి సమావేశంలో పలువురు సీనియర్ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఆధీనంలోని అధికారిక ఇంధన సంస్థ ఎన్‌టిపిసి లిమిటెడ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
తమ రాష్ట్రాలలోని పలు బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలకు సరైన విధంగా బొగ్గు కోటా అందకపోతే బ్లాకౌట్ తప్పదని ఇప్పటికే పలు రాష్ట్రాలు హెచ్చరించాయి. అయితే ఎటువంటి ఆందోళన అవసరం లేదని, విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గు సరఫరా జరుగుతుందని ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలకు భరోసా ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవల్సిన తక్షణ చర్యలను బేరీజు వేసుకునేందుకు ఉన్నత స్థాయి భేటీని అమిత్ షా నిర్వహించారు. అధికారుల నుంచి సూచనలు తీసుకున్నారు. బొగ్గు కొరత లేదని, సరఫరాలో జాప్యం తలెత్తకుండా చేయాలని, బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం తలెత్తుతుందనే వాదన దుష్ప్రచారం అవుతోందని దీనిని అరికట్టాల్సి ఉందని షా అభిప్రాయపడ్డారు. కోటా సక్రమ సరఫరాతోనే పరిస్థితి మెరుగుపడుతుందని పేర్కొన్నారు.