Monday, December 23, 2024

ఉచితాలు, బుజ్జగింపులు, శుష్క వాగ్దానాలను గుజరాతీలు తిరస్కరించారు: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గుజరాతీలు ఉచితాలు, బుజ్జగింపులు, శుష్కవాగ్దానాలను తిరస్కరించి తిరుగులేని తీర్పునిచ్చారని బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం అన్నారు. గుజరాత్ ప్రజలు ఇచ్చిన తీర్పును కొనియాడుతూ ఆయన అనేక ట్వీట్లు కూడా చేశారు. “నరేంద్ర మోడీ అభివృద్ధి మోడల్‌కు తిరుగులేని విశ్వాసంతో ప్రజలు పట్టంగట్టారు” అని పేర్కొన్నారు. “గత రెండు దశాబ్దాలలో, మోడీజీ నాయకత్వంలో బిజెపి అన్ని అభివృద్ధి రికార్డులను బద్ధలుకొట్టింది. నేడు గుజరాతీలు ఇది వరకటి రికార్డులను కూడా బద్ధలు కొట్టి బిజెపిని గెలిపించారు” అని తెలిపారు. ప్రతి వర్గం ప్రజలు అది మహిళలు, యువకులు, రైతులు…ఎవరైనా కానీ హృదయపూర్వకంగా బిజెపిని గెలిపించారన్నారు.

“ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బిజెపి ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి పాటుపడింది. గుజరాతీలు ఉచితాలు, బుజ్జగింపులు, శుష్క వాగ్దానాలు చేసే రాజకీయాలను తిరస్కరించారు” అని పేర్కొన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమిత్ షా ఈ చారిత్రాత్మక విజయాన్ని అందించిన గుజరాత్ ప్రజలకు శాల్యూట్ చేశారు. అంతేకాక ఆయన బిజెపి అధ్యక్షుడు జెపి. నడ్డా, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, పార్టీ రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడు సిఆర్ పాటిల్ విజయంపై వారిని అభినందించారు. గుజరాత్‌లోని మొత్తం 182 సీట్లలో బిజెపి 150 సీట్లు గెలుచుకుంటుందని మొదట అంచనా వేశారు. కానీ చివరికి బిజెపి 157 సీట్లు గెలుచుకుంది. అసలు మెజారిటీ మార్క్ 92 మాత్రమే. కానీ రికార్డు స్థాయిలో బిజెపి విజయం అందుకుంది. కాంగ్రెస్ 16, ఆప్ 5, ఇతరులు 4 సీట్లు గెలుచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News