Monday, January 20, 2025

400 సీట్ల రేసులో ముందంజలో మోడీ

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అమిత్ షా భారత్ జోడో యాత్రతో తన పార్టీ ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ డూండో(వెదుకులాట) యాత్రతో దాన్ని ముగిస్తారంటూ ఎద్దేవా చేశారు. గురువారం నాడిక్కడ ఆయన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ తమ ఓటు బ్యాంకు పోతుందన్న భయంతోనే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అయోధ్యలో జరిగిన రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకాలేదని ఆరోపించారు. అహంకారపూరిత కూటమికి చెందిన యువరాజు(రాహుల్) తన ఎన్నికల ప్రచారాన్ని భారత్ జోడో యాత్రతో మొదలు పెట్టారని, జూన్ 4న(ఓట్ల లెక్కింపు రోజు) అది కాంగ్రెస్ వెదుకులాట యాత్రతో ముగుస్తుందని అమిత్ షా వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల మొదటి రెండు దశలలో కాంగ్రెస్ ఆచూకీ లేదని, సెంచరీని(100) సాధించిన ప్రధాని నరేంద్ర మోడీ 400 రేసులో(సీట్లు) ఆధిక్యంలో ఉన్నారని ఆయన జోస్యం చెప్పారు.

ఇది ఉగ్రవాదం, నక్సలిజం అంతానికి, భారత్‌ను తృతీయ ఆర్థిక శక్తిగా మార్చేందుకు జరుగుతున్న ఎన్నికలని ఆయన తెలిపారు. ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షమైన సమాజ్‌వాది పార్టీపై ఆయన విమర్శలు గుప్పించారు. వారసత్వ రాజకీయాలను ఆ పార్టీ పెంచిపోషిస్తున్నదంటూ ఆయన ఆరోపించారు. ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తన కుటుంబ సభ్యులు నలుగురికి ఈ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారని ఆయన తెలిపారు. కన్నౌజ్ నుంచి అఖిలేష్ పోటీ చేస్తుండగా ఆయన భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి నుంచి పోటీ చేస్తున్నారని, ఆయన కుటుంబ సభ్యులు అక్షయ్ యాదవ్, ఆదిత్య యాదవ్, ధర్మేంద్ర యాదవ్ ఫిరోజాబాద్, బుదౌన్, ఆజంగఢ్ నుంచి పోటీ చేస్తున్నారని అమిత్ షా తెలిపారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన వేరే యువకులకు టికెట్లు ఇచ్చి బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. గత 70 ఏళ్లు రామాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటుండగా బిజెపి ఆ లక్ష్యాన్ని సాధించిందని ఆయన చెప్పారు.

ప్రధాని మోడీని రెండవసారి ఎన్నుకున్న తర్వాత ఐదేళ్లలోనే అయోధ్య కేసు గెలవడం, ఆలయానికి భూమి పూజ, ఆలయ ప్రాణ ప్రతిష్ట పూర్తయిపోయాయని అమిత్ షా వివరించారు. ఆలయ ప్రాణప్రతిష్ట మహోత్సవానికి రావలసిందిగా ఆలయ ట్రస్టు అకిలేష్ యాదవ్, డింపుల్, రాహుల్, ప్రియాంకలను ఆహ్వానించినప్పటికీ ఓట్లు బ్యాంకు భయంతో వారు రాలేదని ఆయన ఆరోపించారు. వారి ఓటు బ్యాంకు ఎవరో మీ అందరికీ తెలుసని ఆయన చెప్పారు. జమ్మూ కశ్మీరులో 370వ అధికరణను రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ ప్రజలకు కశ్మీరుతో పనేమిటని కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశ్నిస్తున్నారని, బరేలికి చెందిన చిన్న పిల్లవాడు సైతం దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడతాడని ఆయన అన్నారు. కశ్మీరులో మన త్రివర్ణపతాకం ఎగురుతోందని ఆయన తెలిపారు. పుల్వామా దాడి అనంతరం జరిగిన సర్జికల్ స్ట్రైక్‌ను ప్రస్తావిస్తూ గత కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో అటువంటి చర్యలకు ప్రతీకార చర్యలు ఉండేవి కావని, ఎవరైనా దేశంలోకి చొరబడి బంబు పేలుళ్లు సృష్టించవచ్చని అమిత్ షా ఆరోపించారు.

ఉగ్రవాదులను ఏరివేయడానికి పాకిస్తాన్ లోపలే సర్జికల్ స్ట్రైక్ చేశామని ఆయన అన్నారు. 130 కోట్ల మంది ప్రజలకు కొవిడ్ వ్యాక్సినేషన్ నిర్వహించిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన చెప్పారు. 2017 వరకు ఉత్తర్ ప్రదేశ్ మత ఘర్షణలతో అట్టుడికిపోయేదని, యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఘర్షణల రహితంగా మార్చి పశ్చిమ యుపి నుంచి ప్రజల వలసలను ఆపారని ఆయన చెప్పారు. యోగి పాలనలో గూండాలు, రౌడీ మూకల వలసలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. సమాజ్‌వాది పార్టీ పాలనలో ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫ్యాక్టరీలు నాటు తుపాకులు తయారు చేసేవని, కాని ఇప్పుడు పాకిస్తాన్‌పై ప్రయోగించడానికి యుద్ధ ట్యాంకులు, క్షిపణులు తయారు చేస్తున్నాయని అమిత్ షా తెలిపారు. ప్రతిపక్ష ఇండియా కూటమి అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోందని, ముఖ్యమంత్రి పదవిని అఖిలేష్ యాదవ్ ఆశిస్తుంటే ప్రధానిగా రాహుల్‌ను చూడాలని సోనియా కోరుకుంటున్నారని,

తమ కుటుంబ సభ్యులను ప్రధానిగా, ముఖ్యమంత్రిగా చేయడం కోసం వారంతా బిజీగా ఉంటే పేద ప్రజల సంక్షేమాన్ని పట్టించుకునే తీరిక వారికి ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. మే 7న బరేలిలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News