Wednesday, January 22, 2025

హిందీ పెత్తనం చెల్లదు

- Advertisement -
- Advertisement -

Amit Shah push to make Hindi compulsory

దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ హిందీ భాషపై బిజెపి తన మంకుపట్టు వీడటం లేదు. ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దాలన్న ప్రయత్నాన్ని విరమించుకోవడం లేదు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రజలు మాట్లాడుకునేటప్పుడు ఇంగ్లీష్, స్థానిక భాషల్లో కాకుండా హిందీలోనే విధిగా మాట్లాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ నెల ఏప్రిల్ 7న జరిగిన 37వ పార్లమెంటరీ అధికార భాషా కమిటీ సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఇంగ్లీష్ కి ప్రత్యామ్నాయంగా హిందీనే ఉపయోగించాలని, ఇంగ్లీష్ భాషలో మాట్లాడ వద్దని మరీ గట్టిగా చెప్పారు. దేశ ఐక్యత కోసం హిందీలోనే మాట్లాడాలని వివరణ ఇచ్చారు.

నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పరిపాలన 70 శాతం హిందీలోనే నడుస్తుందని, అది త్వరలోనే నూరు శాతం సాదిస్తుందని చెప్పుకొచ్చారు. ఈశాన్య రాష్ట్రాల్లో హిందీ భాషా బోధన కోసం ప్రత్యేకంగా 22 వేల మంది ఉపాధ్యాయులను నియమించబోతున్నట్లు చెప్పా రు. ఆ రాష్ట్రాలు పదో తరగతి వరకు హిందీని తప్పనిసరి భాషగా నేర్పడానికి అంగీకరించినట్లు చెప్పారు. ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాల భాషలను దేవనాగరి లిపిలో రాయాలని కూడా నిర్ణయించినట్లు తెలియజేశారు. విద్యా విధానం ముసాయిదా సమయంలో హిందీ దివస్ సందర్భంలో కూడా అమిత్ షా హిందీ భాషా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ శాఖలు నిర్వహించే సభల్లో, సమావేశాల్లో మంత్రులు, అధికారులు హిందీలోనే మాట్లాడుతున్నారు. ‘హిందీలో మాత్రమే మాట్లాడితే మాకు అర్ధం కాదు, ఇంగ్లీషులో కూడా మాట్లాడండి’ అని కొవిడ్ రోజుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన సమీక్షా సమావేశంలో తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి అడిగినా పట్టించుకోలేదు. ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో కేంద్రం హిందీలో అడిగిన ప్రశ్నకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తమిళంలో చెప్పిన సమాధానం దేశ ప్రజలను ఆకర్షించింది.

సిఆర్‌పిఎఫ్ పారా మెడికల్ రిక్రూట్‌మెంట్ కేంద్రాలను తమిళనాడు, పుదుచ్చేరిలలో ఏర్పాటు చేయాలని కోరుతూ మదురై పార్లమెంట్ సభ్యులు ఎస్.వెంకటేశన్ (సిపిఎం) కేంద్ర ప్రభుత్వానికి ఇంగ్లీషులో రాసిన లేఖకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హిందీలో సమాధానం ఇచ్చింది. ఇంగ్లీషులో అడిగితే హిందీలో జవాబు ఇవ్వడం ఏమిటని వెంకిటేషన్ దాఖలు చేసిన ‘ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని’ సమర్ధిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. అఫీషియల్ లాంగ్వేజస్ యాక్ట్, 1963 ని అమలు చేయాలని, పార్లమెంట్ సభ్యులు గానీ, పౌరులు గానీ ఏ విషయాన్ని అయినా ఇంగ్లీష్ భాషలో అడిగితే ఆ భాష (ఇంగ్లీష్) లోనే జవాబు చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని జస్టిస్ ఎం. కిరుబకరాన్, జస్టిస్ దురైస్వామి ధర్మాసనం తీర్పు చెప్పింది. అయినా సరే, కేంద్ర ప్రభుత్వం పదే పదే హిందీని రుద్దే పట్టుదలకే పోతుంది.

‘హిందీలోనే మాట్లాడాలి, ఇంగ్లిష్ వద్దు’ అనే కేంద్ర మంత్రి ప్రకటనను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగానే తిప్పి కొట్టింది. హిందీయేతర రాష్ట్రాలకు ఇంగ్లీష్ కావాలి, హిందీ అక్కర్లేదని ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి గట్టిగా చెప్పారు. ‘మేము హిందీ భాషకు వ్యతిరేకం కాదు, హిందీ భాషను నిర్బంధంగా రుద్దే వత్తిడిని మాత్రమే వ్యతిరేకిస్తున్నాం’ అని స్టాలిన్ వివరించారు. భారతదేశ బహుళ భాషల సంస్కృతిని కేంద్ర ప్రభుత్వం గౌరవించాలి, ఒక్క హిందీ భాషకే ప్రాధాన్యత ఇస్తే అది దేశ సమగ్రతకే గొడ్డలిపెట్టు కాగలదని హెచ్చరించారు. హిందీయేతర రాష్ట్రాలకు ప్రత్యామ్నాయ భాషగా ఇంగ్లీషే ఉంటుందని నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పార్లమెంటులో చేసిన ప్రకటనను గౌరవించాలని డిఎంకె పార్లమెంట్ సభ్యులు టికెఎస్ ఎలాంగోవన్ గుర్తు చేశారు.. హిందీయేతర రాష్ట్రాలపై హిందీ భాషను రుద్దడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వత్తిడి పెంచితే తీవ్రంగా ప్రతిఘటించాల్సి వస్తుందని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టిఎంసి) ప్రకటించింది.

త్రి భాషా సూత్రంలో భాగంగా హిందీని అప్షనల్ సబ్జెక్ట్‌గా కొనసాగించవచ్చు, అంతేగాని పదో తరగతి వరకు ‘కంపల్సరీ లాంగ్వేజ్’ గా నేర్పాలనే అమిత్ షా ఆదేశాన్ని అమలు చేసేది లేదని’ నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ శామ్యూల్ బి జిర్వా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని మరి కొన్ని సంఘాలు, సంస్థలు కూడా అమిత్ షా ప్రకటనను దుయ్యబట్టారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ కంపోజర్ ఎఆర్ రెహమాన్ ఒక తమిళ దేవతను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా హిందీ ఆధిపత్యాన్ని తిరస్కరించారు. భాషా ఉన్మాదం/ పెత్తనం తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుందనే విషయాన్ని గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.టి. రామారావు ట్విట్టర్ వేదిక ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాష హిందీయే అని, అది జాతీయ భాషగా దేశాన్ని ఐక్యంగా వుంచగలదని అమిత్ షా చెప్పడం అతిశయోక్తి మాత్రమే. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 35లో 12లోని ప్రజలు మాత్రమే వారి ప్రథమ భాష హిందీ అని 2011 సెన్సెస్‌లో చెప్పారు. దేశ జనాభాలో 43% మంది హిందీ మాట్లాడతారు గనుక అత్యధిక మంది భాష హిందీనే అని చెప్పడం సరైంది కాదు. ఎందుకంటే, అందులోని వారందరూ మాట్లాడే భాష ఒకే రకమైన హిందీ కాదు. భోజపురి, రాజస్థానీ వగైరా 56 రకాల విభిన్న భాషలు మాట్లాడతారు. అమిత్ షా చెప్పే హిందీ మాతృభాషగా మాట్లాడే వారు 26% మంది మాత్రమే. రెండో విషయం, హిందీ అధికార భాష తప్ప జాతీయ భాష కాదు. భారతీయులు అందరూ ఒక జాతి కాదు, అనేక జాతుల సమ్మేళనం.

అందువల్ల ఏదో ఒక భాషను జాతీయ భాష అంటే సరిపోదు. రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న 22 భారతీయ భాషలు సమాన హోదా కలిగినవే. రాజ్యాంగ అధికరణం 343 లో హిందీని అధికార భాషగా ప్రకటించబడింది. అయినా, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండి 15 సంవత్సరాల వరకు ఇంగ్లీషును కూడా అధికార భాషగా కొనసాగించాలని అని కూడా అదే అధికారణంలో చెప్పబడింది. అవసరమైతే 15 సంవత్సరాల తర్వాత కూడా కొనసాగించవచ్చని చెప్పింది. ఇక దేశ ఐక్యత కోసం హిందీ మాట్లాడాలని చెప్పడం మరీ విచిత్రంగా వుంది. హిందీని రుద్దితేనే అనైక్యత ఏర్పడుతుందని గత అనుభవాలను కేంద్ర ప్రభుత్వం అర్ధం చేసుకోవాలి.

నాగటి నారాయణ- 9490300577

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News