బెంగళూరు: జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు సిబిఐ సమన్లు జారీ చేయడంపై విమర్శలు రావడంతో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తొలిసారి స్పందించారు. కర్ణాటకలో జరిగిన ఓ మీడియా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. సత్యపాల్ మాలిక్ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే బీమా కుంభకోణం జరిగిందని, దీనిపై విచారణలో భాగంగానే ఆయనకు సమన్లు జారీ అయ్యాయని చెప్పారు.
ఈ వ్యవహారానికి, బీజేపీ ప్రభుత్వంపై ఆయన చేసిన విమర్శలకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. ఆయనకు సిబిఐ నోటీసులు ఇవ్వడం ఇది మూడోసారని చెప్పారు. ప్రజల దగ్గర దాచిపెట్టే పనులేవీ బిజెపి ప్రభుత్వం చేయదని పేర్కొన్నారు. సత్యపాల్‌మాలిక్ ఒక ఇంటర్వూలో అనేక విషయాలు వెల్లడించడం, ఆ వెంటనే సిబిఐ సమన్లు జారీ చేయడంపై అడిగినప్పుడు అమిత్ షా స్పందిస్తూ తాను అలా అనుకోవడం లేదన్నారు. తనకు తెలిసినంతవరకు ఆయనకు సిబిఐ సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి, మూడోసారో కావచ్చన్నారు. బీమా కుంభకోణంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని, కొత్త ఆధారాలు సిబిఐకి లభించి ఉండవచ్చని, అందుకే మాలిక్‌ను పిలిచి ఉంటారన్నారు.
ఎవరైనా వ్యక్తిగత రాజకీయ స్వప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారని, అలాంటప్పుడు దాని వెనుక ఉన్న లక్షమేమిటో ప్రజలు తెలుసుకోవాలని, ప్రజలు, పాత్రికేయులు ప్రశ్నించాలని సూచించారు. మాలిక్ తమతో ఉన్నప్పుడు, పదవిలో ఉన్నప్పుడు ఈ అంశాలను ఎందుకు లేవనెత్తలేదని ప్రశ్నించారు. అధికారానికి దూరం కాగానే విమర్శించడం సరైనది కాదని వ్యాఖ్యానించారు. మాలిక్ గవర్నర్ పదవిలో ఉన్నప్పుడు చాలా సందర్బాల్లో మోడీ ప్రభుత్వ పనితీరుపై ఎలాంటి దాపరికం లేకుండా విమర్శించేవారని పేర్కొన్నారు.మాకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే సిబిఐ నోటీసులు అందాయనడంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. సుదీర్ఘకాలం బీజేపీలో పనిచేసిన అనుభవం ఉన్నందునే బీహార్, జమ్ముకశ్మీర్, గోవా, మేఘాలయలకు గవర్నర్‌గా ఆయనను గవర్నర్‌గా ఎంపిక చేశామని చెప్పారు.