Saturday, February 22, 2025

బాబాసాహెబ్‌ను గౌరవించుకునే తీరు ఇదేనా?

- Advertisement -
- Advertisement -

ఆకాశం అంత ఎత్తు విగ్రహాలు నిర్మించి మహానగరాల ప్రధాన కూడళ్లలో వాటినిప్రతిష్ఠించడం, ఏడాదికోసారి ఆయన
విగ్రహాలకు పూలమాలలు వేసి భక్తిని చాటుకోవడంతో అంబేద్కర్‌ను గౌరవించినట్టు కాదు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తే, ఆయన కోరుకున్న విధంగా రాజ్యాంగాన్ని అమలు చేయగలిగితే, భారత సమాజాన్ని అటువైపు నడిపించగలిగితేనే బాబాసాహెబ్ అంబేద్కర్‌ను నిజంగా గౌరవించినట్టు.

రాజ్యసభలో అంబేద్కర్‌ను ఉద్దేశించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపట్ల నిరసన తెలిపే క్రమంలో అదుపుతప్పి మన సభ్యులు
వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరమైంది. పార్లమెంటు ఆవరణలో జరిగిన తోపులాటలో, కొంతమంది గాయపడినట్టు కూడా వార్తలు వచ్చాయి.దేశానికి నిలబడాల్సిన ప్రజాప్రతినిధులు పోటాపోటీ ప్రదర్శనలు నిర్వహించడం ఏమిటి? ఒకరినొకరు
తోసుకోవడం ఏమిటి? గాయాలపాలు కావడం ఏమిటి? అని దేశ ప్రజానీకం ఛీత్కరించుకుంటున్నది.

గత రెండు రోజులుగా తెలంగాణ శాసనసభలో జరుగుతున్న వ్యవహారం కూడా చట్టసభలకు వన్నె తెచ్చే విధంగా లేదు.
శుక్రవారంనాడు శాసనసభలో ప్రతిపక్షం వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు గురైంది. తొమ్మిది సంవత్సరాలకు పైగా ఉన్న ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి సభ్యులు సభలో వ్యవహరించిన తీరు ఆమోదయోగ్యంగా లేదు.

రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలుపరిచేవారు సరైనవారు కాకపోతే అది చెడు పరిణామాలకే దారితీస్తుంది అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగం ఎంత పనికిరానిదైనా దాన్ని అమలు చేసేవారు సరైనవారైతే సత్ఫలితాలే వస్తాయని కూడా ఆయనే చెప్పారు. భారత రాజ్యాంగ రచనలో ప్రధాన భూమిక పోషించిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం గురించి తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. ‘రాజ్యాంగం దుర్వినియోగం అయినట్టు నాకనిపిస్తే దాన్ని తగులబెట్టడానికి ముందుకు వచ్చే మొదటి వ్యక్తి నేనే అవుతాన’ని కూడా చెప్పారు. రాజ్యాంగం భారత సమాజాన్ని సమానత్వం, సమన్యాయం, ప్రజాస్వామ్యాల వైపు నడిపించే ఒక సజీవపత్రంగా ఉండాలని అంబేద్కర్ కోరుకున్నారు. ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ ప్రస్తావని ఎందుకు? రాజ్యాంగం గురించి మాట్లాడుకోవడం ఏమిటి? అని ఎవరైనా అనుకుంటే పొరపాటు. రాజ్యాంగాన్ని గౌరవిస్తేనే అంబేద్కర్‌ను గౌరవించినట్టు అనే విషయం మన ప్రజాప్రతినిధులు మర్చిపోతున్న సమయంలో ఈ ప్రస్తావన తీసుకురావడం అవసరం అనిపించింది.
ఆకాశం అంత ఎత్తు విగ్రహాలు నిర్మించి మహానగరాల ప్రధాన కూడళ్లలో వాటిని ప్రతిష్ఠించడం, ఏడాదికోసారి ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి భక్తిని చాటుకోవడంతో ఆయనను గౌరవించినట్టు కాదు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తే, ఆయన కోరుకున్న విధంగా రాజ్యాంగాన్ని అమలు చేయగలిగితే, భారత సమాజాన్ని అటువైపు నడిపించగలిగితేనే బాబాసాహెబ్ అంబేద్కర్‌ను నిజంగా గౌరవించినట్టు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయనను అవమానిస్తున్నాం. ఇవాళ దేశంలో చట్టసభలు.. అవి పార్లమెంటు కావచ్చు, శాసనసభలు కావచ్చు.. అవి నడుస్తున్న తీరును, ప్రజాప్రతినిధుల వ్యవహార శైలిని చూస్తుంటే- రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలుపరిచేవారు సరైనవారు కాకపోతే అది చెడు పరిణామాలకు దారితీస్తుందన్న అంబేద్కర్ మాటలు అక్షరాలా నిజమవుతున్నట్టు కనిపిస్తున్నది. చట్టసభల్లో ప్రజాసమస్యల గురించి చర్చ జరగాలి. ప్రజోపయోగమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పథకాల రూపకల్పన జరగాలి. అలా కాకుండా వ్యక్తిగత దూషణలు, పరస్పర నిందలు, భౌతికదాడులకు నిలయాలుగా మారిపోతున్నాయి మన చట్టసభలు ఇటీవల కాలంలో. అటు పార్లమెంట్లో రెండు రోజులపాటు జరిగిన విపరీత సంఘటనలు, ఇటు తెలంగాణ శాసనసభలో శుక్రవారంనాడు జరిగిన ఘటనలు ప్రజాస్వామ్యాన్ని పరిహసించే విధంగా ఉన్నాయి.
రెండు రోజుల క్రితం రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఆయన మాటల్లోనే ‘ఈ మధ్య విపక్షాలకు అంబేద్కర్ పేరు పదేపదే జపించడం ఫ్యాషన్‌గా మారిపోయింది. అన్నిసార్లు భగవంతుడు పేరు జపించి ఉంటే స్వర్గంలో స్థానం లభించి ఉండేది’ అని ప్రతిపక్షాల మీద వ్యంగ్యోక్తులు విసిరారు అమిత్ షా. పర్యవసానాన్ని ఆ యన ఊహించి ఉంటారో లేదో తెలియదుగానీ కేంద్ర హోం మంత్రి స్థాయి మ రిచి ఆయన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ కంటే దేవుడు గొప్పవాడే కావచ్చు కానీ చట్టాలను గురించి మాట్లాడుతున్నప్పుడు, చట్టసభల్లో మాట్లాడుతున్నప్పుడు అంబేద్కర్ ప్రస్తావన రావడానికి ఆయన గేలి చేయడం ఎంతవరకు సమంజసం? ఇది కచ్చితంగా ఆక్షేపణీయమైన విషయమే. రాజ్యసభలో ఈ వ్యాఖ్య లు చేసి అమిత్ షా అధికార పక్షాన్ని ఇరుకున పడేసారని చెప్పాలి. దీనినుండి ఎలా బయటపడదామా అని అధికారపక్షం మల్లగుల్లాలు పడుతూ ఉంటే గురువారంనాడు పార్లమెంట్ ఆవరణలో జరిగిన సంఘటనలు మొత్తంగా రాజకీయ పక్షాలపట్ల వెగటు పుట్టించే విధంగా ఉన్నాయి.రాజ్యసభలో అంబేద్కర్‌ను ఉద్దేశించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపట్ల నిరసన తెలిపే క్రమంలో అదుపుతప్పి మన పార్లమెంట్ సభ్యులు వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరమైంది. పార్లమెంటు ఆవరణలో జరిగిన తోపులాటలో,

బాహాబాహీలో కొంతమంది గాయపడినట్టు కూడా వార్తలు వచ్చాయి. దేశానికి ఆదర్శంగా నిలబడాల్సిన ప్రజాప్రతినిధులు పోటాపోటీ ప్రదర్శనలు నిర్వహించడం ఏమిటి? ఒకరినొకరు తోసుకోవడం ఏమిటి? గాయాలపాలు కావడం ఏమిటి? అని దేశ ప్రజానీకం ఛీత్కరించుకుంటున్నది. పోలీస్ స్టేషన్లో పరస్పర ఫిర్యాదులు చేసుకుని కేసులు కూడా పెట్టుకున్నారు. ప్రజలు గమనించాల్సింది, తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనం ఏ విత్తనం నాటితే ఆ చెట్టే మొలుస్తుంది అని. రాజ్యసభలో అమిత్ షా అంబేద్కర్‌ను అవమానించారని విపక్ష సభ్యులు, విపక్షాలే అంబేద్కర్ పట్ల అవమానకరంగా వ్య వహరిస్తున్నాయని అధికారపక్ష సభ్యులు చేసుకుంటున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇప్పుడు నిజంగా అంబేద్కర్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయి. ఆయన అన్న మాటలు మళ్ళీ ఒకసారి నిజం చేస్తున్నాయి.

ఒక గొప్పదైన రాజ్యాంగం సరైన వాళ్ళ చేతుల్లో పడలేదా అనే అనుమానాల్ని కలిగిస్తున్నాయి. ‘రాజ్యాంగం దుర్వినియోగం అయినట్టు నాకు అనిపిస్తే దాన్ని తగలబెట్టడానికి ముందుకు వచ్చే మొదటి వ్యక్తి నేనే అవుతాను’ అన్న అంబేద్కర్ మాటలని మరి ఇప్పుడు ఎవరైనా ఆచరించడానికి ముందుకు వస్తారేమో చూడాలి. అటువంటి దుస్థితి రాకుండా ఉండాలంటే చట్టసభలకు మనం ఎన్నుకొని పంపించిన ప్రజాప్రతినిధులు వాటి గౌరవాన్ని పెంచే విధంగా వ్యవహరించడం నేర్చుకోవాలి. గత రెండు రోజులుగా తెలంగాణలో శాసనసభలో జరుగుతున్న వ్యవహారం కూడా చట్టసభలకు వన్నె తెచ్చే విధంగా లేదు. శుక్రవారంనాడు శాసనసభలో ప్రతిపక్షం వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు గురైంది.

తొమ్మిది సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి సభ్యులు సభలో వ్యవహరించిన తీరు ఆమోదయోగ్యంగా లేదు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉండగా నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసులకు సంబంధించి భారీయెత్తున ప్రజాధనం దుర్వినియోగం జరిగిందన్న విషయంలో ప్రభుత్వం పెట్టిన కేసుపై సభలో చర్చ జరగాలని పట్టుబట్టడం, సభా కార్యక్రమాలను స్తంభింపజేసే ప్రయత్నం చేయడం ప్రజల మెప్పుపొందే రీతిలో ఎంతమాత్రం లేదు. అధికార పక్షానికి సంబంధించిన ఒక శాసనసభ్యుడు కూడా తానేం తక్కువ తినలేదన్నట్టు సభలో కాలి చెప్పు తీసి చూపించారు ప్రతిపక్షాల వైపు.ఈ కేసు కొట్టి వేయాలని మాజీ మంత్రి కేటీ రామారావు ఒక వైపు కోర్టుకు వెళ్లిన తరుణంలోనే సభలో ఇంత రగడ చేయడాన్ని ప్రతిపక్షం ఎలా సమర్థించుకుంటుంది?

చట్టసభల దిగజారుడుతనం గురించి చర్చించుకున్న తర్వాత చివరగా ఒక మాట గుర్తు చేసుకోవాలి. ఫిలిప్స్ మాథ్యూ అని ఒక పెద్దాయన ఉన్నారు. కేరళ రాష్ట్రం నుంచి ప్రచురితమయ్యే ‘మలయాళ మనోరమ’ అనే పత్రికకు అధిపతి ఆయన. ప్రస్తుతం దేశంలో మీడియాకు ఆధిపత్యం వహిస్తున్న కొందరు యజమానుల్లా కాకుండా ఆయన ఆలోచించగల, మాట్లాడగల, రాయగల, నిజంపట్ల అభిరుచి, అభినివేశం కలిగిన వ్యక్తి. తన ఆధ్వర్యంలో ప్రచురితమయ్యే ‘ద వీక్’ ఆంగ్లవారపత్రికలో ఆయన ప్రతివారం సంపాదకీయ లేఖ రాస్తుంటారు. చాలా ఆసక్తిగా చదివించే ఈ లేఖలో ఒక సందర్భంలో ఆయన ‘ఓటర్ మాట్లాడినప్పుడు రాజకీయ నాయకులు, విశ్లేషకులు, జర్నలిస్టులు ఓపికగా ప్రశాంతంగా వినాలి’ అంటారు.

నిజమే, ఐదేళ్లు ఓటర్ మౌనంగా ఉంటాడు. ఉండటమే కాదు, రాజకీయ నాయకులు చేసే సుదీర్ఘ ఉపన్యాసాలు, ప్రకటనలు, వాగ్దానాలనూ నిశితంగా వింటాడు. రాజకీయ నాయకులు చేసే విశ్లేషణలు, జర్నలిస్టులు రాసే వార్తలు చదువుతాడు.ఐదేళ్లపాటు ఓటరు మౌన ప్రేక్షకుడే. నిజానికి ఎన్నికల అప్పుడు కూడా ఓటర్ మాట్లాడడు. ఓటు ద్వారా తన మాట వినిపిస్తాడు. తాను ఏం కోరుకుంటున్నాడో చెప్పకనే చెప్తాడు. పెద్దాయన ఫిలిప్స్ మాథ్యూ చెప్పినట్టుగా ఓటర్లు అంటే ఈ దేశ ప్రజలు అన్నీ మౌనంగా గమనిస్తూనే ఉన్నారు. ఈ విషయం మన రాజకీయ నాయకులు అర్థం చేసుకొని బుద్ధిగా మసులుకుంటారని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News