నిర్మల్ బహిరంగసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సంజయ్, డి.కె.అరుణ, ఈటల రాజేందర్ తదితరులు, టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బిజెపియే, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. నిర్మల్ సభలో అమిత్ షా
మన తెలంగాణ/ హైదరాబాద్: నిజాం రాక్షస పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిన రోజని బిజెపి అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. నిర్మల్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. సర్దార్ పటేల్ సైనిక చర్య వల్లే తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని, 2024లో తెలంగాణలో బిజెపిదే అధికారమని అమిత్‌షా జోస్యం చెప్పారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని అప్పట్లో కెసిఆర్ డిమాండ్ చేశారని ఆయన గుర్తు చేశారు. మరి ఇప్పుడు ఆ డిమాండ్ ఏమైందని అమిత్‌షా ప్రశ్నించారు. బిజెపి అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. మజ్లిస్ పార్టీకి బిజెపి భయపడదన్నారు.
తెలంగాణ ప్రజల్లో ఆలోచన మొదలైందని, తెలంగాణ సమస్యలు తెలుసుకునేందుకు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని అమిత్‌షా చెప్పారు. గత ఎన్నికల్లో 4 ఎంపి సీట్లు గెలిచామని, మూడు చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయామన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అన్ని ఎంపి సీట్లు గెలుస్తామని అమిత్‌షా స్పష్టం చేశారు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బిజెపియేనని, కాంగ్రెస్ కాదని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ పగ్గాలు చేపట్టే సామర్థం బిజెపికే ఉందని అమిత్‌షా అన్నారు. కారు స్టీరింగ్ ఇప్పుడు ఒవైసీ చేతిలో ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 119 స్థానాల్లో పోటీ చేస్తామని అమిత్‌షా తెలిపారు. ప్రధాని మోడీ పుట్టినరోజని అన్నారు.
ఇక్కడ సౌండ్ చేస్తే దారుస్సలెంలో రీసౌండ్ రావాలి : బండి
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ నిర్మల్ గడ్డమీద వెయ్యిమందిని ఉరితీశారని గుర్తు చేశారు. నిర్మల్‌లో ఉరితీసిన వెయ్యి మంది యోధుల చరిత్రను చెప్పడానికే ఇక్కడ సభ నిర్వహిస్తున్నామన్నారు. వాళ్లంతా ఇప్పుడు పైనుంచి మనల్నిచూస్తున్నారని, వాళ్లకోసం మనమంతా నినదించాలని పిలుపునిచ్చారు. ఇక్కడ సౌండ్ చేస్తే దారుస్సలెంలో రీసౌండ్ రావాలన్నారు. రజాకార్ల వారసులు హింసించిన హిందూ సమాజానికి మనం భరోసానివ్వాలన్నారు. రాబోయే కాలంలో తెలంగాణ గడ్డమీద ఎగిరేది బిజెపి జెండానేనని బండి తెలిపారు. మహారాష్ట్ర, కర్నాటకలో విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామన్నారు.
హుజురాబాద్‌లో ఏం జరుగుతుందో బిజెపి గమనిస్తోంది : ఈటల
హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా చూడాలని తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యోగులు, ప్రజలు అందరూ ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. తెలంగాణ ప్రజలందరూ కూడా హుజూరాబాద్‌లో ఏం జరగబోతోంది అని ఎదరుచూస్తున్నారన్నారు. బిజెపి దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ 303 ఎంపీలు ఉన్న 18 రాష్ట్రాల్లో అధికారంతో పరిపాలిస్తున్న పార్టీ హుజూరాబాద్‌లో జరుగుతున్నవన్నీ బిజెపి గమనిస్తోందని ఈటల హెచ్చరించారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని అసెంబ్లీ వేదికగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో సార్లు డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపకపోవడం దుర్దినమన్నారు. ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని మరోసారి డిమాండ్ చేస్తున్నానని ఆయన చెప్పారు. రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండానే అని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. 2023లో బిజెపి తెలంగాణలో విజయదుందుభి మోగించి సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతామని ఆయన చెప్పారు.
ఈటలను పలుకరించిన అమిత్‌షా
హుజూరాబాద్ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌ను అమిత్‌షా పలుకరించారు. బహిరంగ సభలో నాయకులను సభకు ఆయన పరిచయం చేశారు. ఈ సందర్భంగా తనకు దూరంగా ఉన్న ఈటల రాజేందర్‌ను ముందుకు రావలసిందిగా ఆయన కోరారు. దీంతో సభంతా మార్మోగింది. రాజేందర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని హుజూరాబాద్ ప్రజలను కోరారు.