కోల్‌కత: తన ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర పన్నిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బిజెపి 35 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తుందని, 2025లో టిఎంసి ప్రభుత్వం కూలిపోతుందని అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మమతా బెనర్జీ మండిపడ్డారు.
దేశ ఫెడరల్ వ్యవస్థను, రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడవలసిన హోం మంత్రి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడం విడ్డూరమని, ఇలాంటి వ్యాఖ్యలు చేసే హక్కు ఆయనకు లేదని సోమవారం రాష్ట్ర సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మమత చెప్పారు.
ప్రజలు ఎన్నుకున్న తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి అమిత్ షా కుట్రలు పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. అలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఏ చట్టం అమిత్ షాకు అనుమతి ఇచ్చిందని ఆమె ప్రశ్నించారు.
అలాంటి వ్యాఖ్యలు చేసే హక్కు ఆయనకు లేదని ఆమె స్పష్టం చేశారు. కేంద్ర హోం మంత్రిగా కొనసాగే హక్కు ఆయనకు లేదని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.