Thursday, January 16, 2025

సెలవు పెట్టని మోడీ.. విహార యాత్రల్లో రాహుల్: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికలలో ఎన్‌డిఎ కూటమికి 400కు పైగా సీట్లు దక్కుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డిఎ కూటమికి, ప్రతిపక్ష ఇండియా కూటమికి మధ్య ఎటువంటి పోలిక లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిని కుటుంబవాదులు(పరివార్‌వాదీస్), అవినీతిపరులు(భ్రష్టాచారీస్)గా ఆయన అభివర్ణించారు. కర్నాటకలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాలను ఎన్‌డిఎ గెలుచుకుంటుందని తాను నమ్ముతున్నానని ఆయన చెప్పారు. మంగళవారం నాడిక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ అవినీతి, కుంభకోణాలలో మునిగిపోయాయని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీకి, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి పోలికే లేదని, ప్రధాని మోడీ ఎన్నడూ సెలవు తీసుకోరని, కాని రాహుల్ గాంధీ వేసవి రాగానే విదేశాలకు వెళ్లిపోతారని ఆయన చెప్పారు.

రానున్న లోక్‌సభ ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బిజెపి, ఎన్‌డిఎ ఒక వైపు, ఇండియా కూటమికి చెందిన కుటుంబవాదులు, అవినీతిపరులు మరోవైపు ఉన్నారని తామంతా మోడీ నాయకత్వంలో ఎన్నికల బరిలో తలపడుతున్నామని అమిత్ షా తెలిపారు. తాను దేశవ్యాప్తంగా దాదాపు 60 శాతం రాష్ట్రాలను పర్యటించానని, ఎక్కడ చూసినా ప్రజలు మోడీ, మోడీ అంటూ మోడీ నామస్మరణ చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈసారి బిజెపి కార్యకర్తలకు ప్రధాని మోడీ 400కు పైగా సీట్ల టార్గెట్ విధించారని, 2014 ఎన్నికలలో కర్నాటక ప్రజలు తమకు 43 శాతం ఓట్లతో 17 లోక్‌సభ సీట్లు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. 2019 ఎన్నికలలో 51 శాతం ఓట్లతో 25 సీట్లు ఇచ్చారని, ఈసారి 60 శాతం ఓట్లతో మొత్తం 28 సీట్లు బిజెపి కూటమికి దక్కేలా కార్యకర్తలు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌కు ఒక్క స్థానం కూడా దక్కకుండా చూడాలని ఆయన కార్యకర్తలను కోరారు. 23 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి, పదేళ్లుగా ప్రధాన మంత్రిగా కొనసాగుతున్న మోడీ ఒక పక్కన ఉన్నారని, ఆయనపైన పావలా అవినీతి ఆరోపణ కూడా ప్రతిపక్షం చేయలేకపోయిందని షా వ్యాఖ్యానించారు. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ నాయకత్వంలో పదేళ్లపాటు అహంకారులు, అవినీతిపరుల కూటమి అధికారంలో ఉందని ఆయన ఆరోపించారు. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ను అవినీతిపరునిగా ఆయన అభివర్ణిస్తూ కర్నాటక ప్రజలు అవినీతిని సహించరని షా చెప్పారు. పదేళ్ల యుపిఎ పాలనలో మీడియా ద్వారా బయటపడిన కుంభకోణాలను ఆయన ఏకరవుపెడుతూ బుఒగ్గు బ్లాకులు, కామన్‌వెల్త్, 2జి, ఐఎన్‌ఎక్స్ మీడియా, ఎయిర్‌సెల్, భూమికి ఉద్యోగం, జమ్మూ కశ్మీరు క్రికెట్ అసోసియేషన్ వంటివి ప్రస్తావించారు.

దాదాపు రూ.12 లక్షల కోట్ల కుంభకోణాలతో సంబంధం ఉన్న కాంగ్రెస్ మోడీతో పోటీపడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. 23 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా, ప్రధానిగా పనిచేసి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోని ప్రపంచంలోనే ఏకైక నాయకుడు మోడీయేనని ఆయన తెలిపారు. ఆయన భారత్ కోసం పనిచేశారని, ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని షా చెప్పారు. కాని మరోపక్క వేసవి వచ్చిదంటే చాలు విదేశాలకు పారిపోయే రాహుల్ గాంధీ ఉన్నారని, ఆయన కోసం ప్రతి ఆరునెలల కోసం కాంగ్రెస్ గాలిస్తుంటుందని షా ఎద్దేవా చేశారు. దేశమంతా సమైక్యంగా మోడీ వైపు నిలబడిందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News