అమరావతి: అమరావతికి హడ్కో ద్వారా రుణం అందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో ఆదివారం జరిగిన ఎన్డీఆర్‌ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఐడీఎం క్యాంపస్, ఎన్డీఆర్‌ఎఫ్ 10వ బెటాలియన్‌ను ఆయన ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు పాల్గొన్నారు.
అనంతరం అమిత్ షా మాట్లాడుతూ.. అమరావతి నిర్మాణాన్ని గత ప్రభుత్వం విస్మరించిందన్నారు. అమరావతికి హడ్కో ద్వారా రూ.27 వేల కోట్ల సహకారం అందిస్తున్నామాని చెప్పారు. రైల్వే జోన్‌ను కూడా పట్టాలెక్కించామని, 2028 లోపు ఏపీ మొత్తం పోలవరం నీరు పారుతుందని తెలిపారు. రూ.1600 కోట్లతో ఎయిమ్స్ ప్రారంభించామని.. విశాఖకు గ్రీన్, హైడ్రోజన్ రంగంలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. ప్రకృతి విపత్తులు వచ్చినపుడు ఎన్డీఆర్‌ఎఫ్ వస్తుంది.. వ్యక్తుల వలన వచ్చే విపత్తుల నుంచి కాపాడడం కోసం ఎన్డీఏ ఉంటుందని అమిత్ షా పేర్కొన్నారు. కాగా, ఎన్డీఆర్‌ఎఫ్, ఎన్‌ఐడీఎం క్యాంపస్‌లు రూ.160 కోట్లతో నిర్మించారు.