హైదరాబాద్ : కర్నాటక శాసనసభకు మే 10వ తేదీన జరిగే ఎన్నికలలో సంపూర్ణ మెజారిటీ సాధిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం న్యూస్ 18 రైజింగ్ ఇండియా సమ్మిట్‌లో ఆయన పలు విషయాలను వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రమైన కర్నాటకలో రెండో సారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే విశ్వాసం ఉందన్నారు. కర్నాటకలో ఎన్నికలకు ముందు, తరువాత ఎలాంటి భాగస్వామ్యాలనూ బిజెపి చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. ‘కర్నాటకలో తొమ్మిది రోజుల పాటు ఐదు ప్రాంతాలనూ సందర్శించానని, ప్రజల ఆదరణ చూసి రాష్ట్రంలో పూర్తి మెజారిటీ సాధించగలమని ధీమా కలిగిందన్నారు.
జెడిఎస్‌తో ఎలాంటి పొత్తులూ ఉండవని తేల్చి చెప్పిన షా, కర్నాటకలో 224 సీట్లకూ బిజెపి సొంతంగా పోటీ పడి అధికారంలోకి వస్తుందన్నారు. గత ఎన్నికలలో సాధించిన 104 సీట్ల మార్కును మరింత మెరుగుపరుచుకోగలమనే నమ్మకంతో ఉన్నామన్నారు. లక్షలాది మంది కార్యకర్తలతో చర్చించిన అనంతరమే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని షా వెల్లడించారు. ఎన్నికలల్లో మోదీ వర్సెస్ గాంధీ పోటీగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నా మాకు అభ్యంతరం లేదన్నారు. లోకసభ అనర్హతపై రాహుల్ గాంధీ కంటే ముందు లాలూ ప్రసాద్, జె జయలలిత, రషీద్ అల్వీ వంటి 17 మంది నాయకులు తమ సభ్యత్వాలను కోల్పోయారు. వారెవరూ కూడా ఈ తరహా గోల చేయలేదు” అని కాంగ్రెస్‌కు ఆయన చురకలు వేశారు.