హైదరాబాద్ ః రాష్ట్రంలో ప్రధాన పార్టీలు రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు నిరంతరం ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు చేస్తోంది. ప్రస్తుతం బీజేపీ హైకమాండ్ ఫోకస్ అంతా తెలంగాణ వైపే ఉంది. తెలంగాణే లక్ష్యంగా తమ వ్యూహాలను రచిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మరోసారి రాష్ట్రానికి వస్తున్నారు. అమిత్‌షా రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మహాజన సంపర్క్ అభియాన్‌లో భాగంగా ఈనెల 15న ఖమ్మంలో బిజెపి నిర్వహించే బహిరంగ సభకు అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో 15వ తేదీ ఉదయం 11గంటలకు ఆయన శంషాబాద్ విమానశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి నేరుగా జెడి కన్వెన్షన్‌కు చేరుకుని 11.12 గంటలకు నుంచి 12.45 గంటల వరకు అల్పాహార సమావేశం అవుతారు.
సమావేశం అనంతరం మధ్యాహ్నం 1.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో భద్రాచలం పయనం అవుతారు. అక్కడకి 2.20 నుంచి 3.20 గంటల వరకు భద్రాద్రి రాముని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం 4.50గంటల నుంచి 5.50 గంటలవరకు ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలు ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సభ ముగించుకుని సాయంత్రం 6 గంటలకు శంషాబాద్‌కు బయలుదేరుతారు. రాత్రి 7 గంటలకు నోవాటెల్‌కు చేరుకుని పలువురు నేతలు, మేధావులతో వేర్వేరుగా సమావేశం జరుపుతారు. రాష్ట్ర పర్యటన ముగించుకుని రాత్రి 9.30 గంటలకు విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు. ఖమ్మం సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర బిజెపి నాయకులు పెద్ద ఎత్తున జనసమీకరణ ప్లాన్ చేస్తూ రాష్ట్రంలో బిజెపికి బలం ఉందనే సంకేతాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.