న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణలో బిజెపి తన ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆగస్టు 27న ఖమ్మంలో ఒక బహిరంగ సభలో పాల్గొననున్నారు.
అమిత్ షా పాల్గొనే బహిరంగ సభకు లక్షలాది మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్నట్లు బిజెపి వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణలో అమిత్ షా ప్రచారం పార్టీకి కొత్త ఊపును తేగలదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నిజానికి జూన్‌లోనే అమిత్ షా ఖమ్మం బహిరంగ సభలో పాల్గొనవలసి ఉండగా బిపర్‌జాయ్ తుపాను కారణంగా ఆయన పర్యటన వాయిదా పడింది. అమిత్ షా తన పర్యటనలో భాగంగా ఎన్నికల సన్నద్ధతకు సబంధించి పార్టీ సీనియర్ నాయకులతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.
పార్టీ పరిస్థితిపై రాష్ట్ర నాయకులతో చర్చలు జరపడంతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉన్నట్లు బిజెపి నాయకులు తెలిపారు. కెసిఆర్ సర్కార్‌పై ఉద్యోగులు, విద్యార్థులు, రైతులతోసహా అన్ని వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయని వారు చెప్పారు. తెలంగాణ ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని, తమ కలలు నెరవేరేది డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే అని వారు భావిస్తున్నారని నాయకులు తెలిపారు.