రేపు సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన శనివారం(సెప్టెంబర్ 3) కేరళలోని తిరువనంతపురంలో సదరన్ జోనల్ కౌన్సిల్(దక్షిణ ప్రాంతీయ మండలి) సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో నదీ జలాల పంపకం, తీరప్రాంత భద్రత, కనెక్టివిటి, విద్యుత్ తదితర ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు చర్చకు రానున్నాయని శుక్రవారం అధికారులు తెలిపారు. సదరన్ జోనల్ కౌన్సిల్‌లో ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ఉన్నాయి. సభ్య దేశాలకు చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు, చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సీనియర్ అధికారులతోపాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు పాల్గొంటారని హోం మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. సమావేశానికి సంబంధించినంతవరకు గతం నుంచి పాటిస్తున్న సాంప్రదాయం ప్రకారం జోనల్ కౌన్సిల్ సమావేశానికి ముందుగా కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ సమావేశమై కౌన్సిల్‌లో చర్చించవలసిన అజెండాను ఖరారుచేస్తుంది.