లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఉన్నతస్థాయి సమీక్ష
ఉగ్రవాద కట్టడికి ప్రాధాన్యత
పోలీసు అధికారి కుటుంబానికి పరామర్శ
శ్రీనగర్ : కశ్మీర్ లోయలో భద్రతా పరిస్థితి గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం అధికారుల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ రోజు ఉదయమే అమిత్ షా ఇక్కడికి వచ్చారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తరువాత అమిత్ షా కశ్మీర్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఇక్కడికి రాగానే ముందుగా ఆయన ఇటీవల ఉగ్రవాదుల తూటాలకు బలి అయిన పోలీసు అధికారి కుటుంబాన్ని కలిసేందుకు వెళ్లారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అమిత్ షా ఇక్కడ మూడు రోజుల పర్యటనకు వచ్చారు. విమానాశ్రయంలో ఆయనకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆయన సలహాదారు ఫారూఖ్ ఖాన్ స్వాగతం పలికారు.
శనివారం లోయలో భారీ వర్షాలు, కొన్ని చోట్ల మంచుపడుతోంది. వాతావరణం అనుకూలిస్తే అమిత్ షా ఉన్నతాధికారులతో కలిసి ఆదివారం ఉదయం జమ్మూకు వెళ్లి అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని శ్రీనగర్‌కు వస్తారని అధికారులు తెలిపారు. శ్రీనగర్ శివార్లలోని నౌగామ్‌లో ఈ ఏడాది జూన్ 22వ తేదీన పోలీసు ఇన్స్పెక్టర్ పర్వయిజ్ అహ్మద్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. మసీదులో నమాజులు జరిపి వస్తుండగా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అహ్మద్ కుటుంబాన్ని పరామర్శించడం అమిత్ షా పర్యటన కార్యక్రమంలో అత్యంత ప్రధాన అంశంగా ఉంది. ఈ క్రమంలో ఆయన అహ్మద్ కుటుంబాన్ని కలుసుకున్నారు. అహ్మద్ భార్య వితంతువు అయిన ఫతీమా అక్తర్‌కు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను కారుణ్య ప్రాతిపదికపై అందించారని హోం మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. ఆ తరువాత అహ్మద్ కుటుంబాన్ని తాను పరామర్శించిన విషయాన్ని అమిత్ షా తమ ట్విట్టర్లో పొందుపర్చారు. సరికొత్త జమ్మూ కశ్మీర్ దిశలో ప్రధాని మోడీ విజన్‌ను సాకారం చేసే విధంగా జమ్మూ కశ్మీర్ పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని కితాబు ఇచ్చారు.
ఇటీవలి ఉగ్రవాద చర్యలపై సమీక్ష
ఉగ్రవాదులు ఇటీవలి రోజులలో సాధారణ పౌరులను, వలసకూలీలను ఎంచుకుని వారిని బలిగొంటున్న అంశం, దీనితో తలెత్తుతున్న తీవ్రస్థాయి భద్రతా విషయాల గురించి అమిత్ షా సమీక్ష జరిపారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాదం నిరోధానికి తీసుకుంటున్న చర్యలు, భద్రతా పరిస్థితి గురించి ఆరా తీశారు. మైనార్టీ వర్గాలలో భద్రతా భావాన్ని నెలకొనేలా చేయాల్సి ఉందని ఆదేశించారు. ఇక్కడి రాజ్‌భవన్‌లో ఈ కీలక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు తాము తీసుకుంటున్న చర్యల గురించి అమిత్ షాకు తెలిపారు. ఉగ్రవాద నిర్మూలన, చొరబాట్ల నిరోధానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో లెఫ్టినెంట్ గవర్నర్, పలువురు పౌర నిర్వహణాధికారులు, ఆర్మీ, సిఆర్పిఎఫ్, పోలీసు ఇతర సంస్థలకు చెందిన సీనియర్ భద్రతా అధికారులు పాల్గొన్నారు.