హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్చి 12న తెలంగాణకు రాబోతున్నారు. తెలంగాణలో ఎన్నికల వ్యూహాన్ని సమీక్షించబోతున్నారు. హకీంపేట్‌లో ఓ కార్యక్రమానికి హాజరై, అదే రోజున కోర్ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించనున్నారు. సంగారెడ్డిలో ఆయన ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు, మేధావులు తదితరులతో కూడా సమావేశం కానున్నారు. తర్వాత ఆయన బీదర్ గుండా కర్నాటకలోకి ప్రవేశిస్తారు.
బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డా, కేంద్ర మంత్రులు, ఇతర ముఖ్య పార్టీ నేతలు కూడా తెలంగాణకు రానున్నారని సమాచారం. కాగా ప్రధాని మోడీ ఏప్రిల్‌లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో చేపట్టనున్న బహిరంగ సమావేశం సన్నద్ధతను కూడా అమిత్ షా సమీక్షించనున్నారని తెలిసింది. రాష్ట్రంలోని తాజా పరిస్థితిని సమీక్షించడమే కాకుండా, భవిష్యత్తు ప్రణాళిక రచనకు ఆయన పార్టీ నాయకులతో చర్చలు జరుపనున్నారని తెలిసింది. తెలంగాణలో అట్టడుగు స్థాయి నుంచి బిజెపిని ఎలా బలోపేతం చేయాలన్న ప్రణాళికపై ఆయన పనిచేయనున్నారట. ఉత్తర్‌ప్రదేశ్‌లో, గుజరాత్‌లో అనుసరించిన వ్యూహాలనే తెలంగాణలో అనుసరించనున్నారని తెలిసింది.