ప్రపంచం లోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. సాధారణ ప్రజలోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కేంద్ర మంత్రి అమిత్‌షా సోమవారం మధ్యాహ్నం 1 గంటకు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమిత్‌షా కుమారుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (సిసిఐ) చైర్మన్ జయషా, అమిత్‌షా భార్య సొనాల్, కోడలు రిషితా, మనుమలు త్రివేణి సంగమం వద్ద సంప్రదాయ సనాతన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. షా కుటుంబం తరువాత హిందువులు పవిత్రంగా పూజించే ప్రాచీన అక్షయ్‌వాత వృక్షం వద్ద పూజలు చేశారు. పవిత్ర స్నానం ఆచరించే ముందు అమిత్‌షా అవదేషానంద్‌గురూజీ మహరాజ్, తదితర స్వాములను కలుసుకుని వారి ఆశీర్వాదాలు పొందారు. ఆయనతోపాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యోగా గురు బాబా రామ్‌దేవ్ తదితరులు పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ సనాతన సంప్రదాయ ఆధ్యాత్మికతకు మహాకుంభమేళా అపూర్వమైన చిహ్నమని అభివర్ణించారు.
అంతరిక్షం నుంచి కుంభమేళా దృశ్యాలు
కుంభమేళాకు సంబంధించిన దృశ్యాలను నాసా వ్యోమగామి డోనాల్డ్ పెటిట్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న నాసా వ్యోమగామి డోనాల్డ్ పెటిట్ అక్కడి నుంచి కనిపిస్తున్న కుంభమేళా దృశ్యాలను క్లిక్‌మని పించారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మహాకుంభమేలా సందర్భంగా గంగానది వద్ద జరుగుతున్న ప్రపంచం లోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం వెలుగులీనుతోంది అంటూ రాసుకొచ్చారు. ఈ చిత్రాలను చూసిన నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. “ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా అంతరిక్ష కేంద్రం నుంచి చాలా అద్భుతంగా కనిపిస్తోంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం తన అపారమైన స్థాయిని ఈ విధంగా ప్రపంచానికి చాటి చెబుతోంది ” అని ఓ నెటిజన్ పేర్కొన్నారు.