నిండుసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాజీ గవర్నర్, తమిళనాడు బిజెపి నేత తమిళిసైను తిట్టారా? ఓ వైపు బుధవారం చంద్రబాబు నాయుడు కేబినెట్ ప్రమాణం జరుగుతున్న దశలో అమిత్ షా తీవ్రస్వరంతోనే తమిళిసైని మందలిస్తున్నప్పటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అయింది. అసలు ఏం జరిగింది? ఎందుకు అమిత్ షా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు? అనే అంశం ఇప్పుడు దుమారానికి దారితీసింది. సామాజిక మాధ్యమాలలో దీనిపై ఇప్పుడు పలు రకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తెలంగాణ గవర్న్ పదవికి రాజీనామా తరువాత స్వరాష్ట్రం వెళ్లిన తమిళిసై అక్కడ ఎన్నికలలో పోటీచేసి ఓడారు. తమిళనాడులో ఈసారి బిజెపికి పెద్దగా ఫలితం దక్కలేదు. అక్కడి బిజెపిలో అంతర్గత తగదాలు, ప్రత్యేకించి రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కె అన్నామలైకి వ్యతిరేకంగా తమిళిసై జట్టు కట్టారని, దీనిపై గ్రౌండ్‌రిపోర్టు తెప్పించుకున్న అమిత్ షా ఇప్పుడు ఆమెను చూడగానే కోపంతో అరిచాడని ప్రచారం జరుగుతోంది. అమిత్ షా వద్దకు తమిళిసై వచ్చి నమస్కరించి వెళ్లుతుండగా ఆయన ఆమెను వెనకకు పిలిపించి రుసరుసలాడటం వీడియోలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె వైపు వేలెత్తి చూపుతూ షా మాట్లాడారు.
ఈ అంశంపై తమిళనాడులో అధికార పక్షం అయిన డిఎంకె వర్గాలు స్పందించాయి. ఇదేం తీరు? ఇదేం రాజకీయం, తమిళ మహిళా నేత పట్ల సభావేదికపై ఇంతటి అవమానకర ప్రవర్తనా? అని ప్రశ్నించిన డిఎంకె వర్గాలు, దీనిని ప్రతి ఒక్కరూ గమనిస్తారనే ఆలోచన కూడా అమిత్ షాకు లేదా? ఇది చాలా తప్పుడు లక్షణం అని విమర్శించారు. చాలా కాలంగా తమిళనాడులో అన్నామలై, తమిళిసై సౌందరరాజన్ మధ్య వైరం ఉందనే ప్రచారం జరుగుతోంది. బిజెపి కేంద్ర నాయకత్వానికి అన్నామలై ఆప్తుడు కావడం పట్ల తమిళిసై ఆగ్రహంతో ఉన్నారని, ఈ క్రమంలోనే ఇప్పటి ఎన్నికలలో ఆమె వర్గం ప్రచారంలో పెద్దగా పాల్గొనలేదనే వార్తలు వెలువడ్డాయి. రాష్ట్రంలో అన్నాడిఎంకెతో సంబంధాలు బెడిసికొట్టేలా అన్నామలై వ్యవహరించాడని, దీని వల్లనే ఈసారి బిజెపి దెబ్బతిందని తమిళిసై ఆరోపిస్తోంది. అన్నామలై వైఖరి సరిగ్గా లేదని మాజీ మంత్రి , అన్నాడిఎంకె నేత ఎస్‌పి వేలుమణి బాహాటంగా ప్రకటన చేశాడు. దీనిని చైన్నై సౌత్ నుంచి పోటీ చేసి ఓడిన తమిళిసై కూడా అవునని నిర్థారించారు.
బిజెపి అన్నాడిఎంకె కలసి పనిచేసి ఉంటే ఓట్లు చీలి ఉండేవి కావని, కనీసం 35 సీట్లు వచ్చేవని తమిళిసై అన్నామలై తప్పు చేశారని నిందించారు. ఈ పరిణామాలన్నింటిని సీరియస్‌గా తీసుకునే ఇప్పుడు అమిత్ షా తమిళిసైపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు భావిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకూ ఆమె స్పందన వెలువడలేదు. ఏది ఏమైనా ఇవన్నీ పార్టీల అంతర్గత వ్యహారాలు, వీటిని ఇప్పుడు సభలో చూపెడుతారా? ఓ మహిళపై దురుసుగా వ్యవహరిస్తారా? ఇదేం తీరు అని జనం ప్రశ్నిస్తున్నారు.