Monday, November 25, 2024

అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అమిత్ షా 17న తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో 18 తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 18వ తేదీ సోమాజిగూడలోని బిజెపి మీడియా సెంటర్‌లో తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు. అనంతరం నల్గొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్రనగర్ సభల్లో అమిత్ షా పాల్గొంటారు. వాస్తవానికి తెలంగాణ బిజెపి ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు 17వ తేదీ ముహూర్తం ఫిక్స్ చేశారు. అమిత్ షా చేతుల మీదుగా విడుదల చేయాలని బిజెపి వర్గాలు భావించాయి. దీంతో బిజెపి మేనిఫెస్టోలో ఏయే అంశాలు ఉంటాయన్నదానిపై ఆసక్తి ఏర్పడింది.

తెలంగాణలో సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని ఇప్పటికే రాష్ట్ర బిజెపి చీఫ్ కిషన్‌రెడ్డి వెల్లడించారు. అలాగే విద్య, వైద్యం ఉచితంగా అందించే హామీ ఇవ్వనున్నట్లుగా సమాచారం. మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్, ఉపాధి అవకాశాలపై హామీలు ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో పలు నగరాల పేర్లు మారుస్తామని మేనిఫెస్టోలో బిజెపి పొందుపర్చినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర సహా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలే బిజెపి చేసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణాన్ని ఛత్రపతి శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్ పట్టణానికి ధరాశివ్ గా పేరు మార్చింది కేంద్రం. మహారాష్ట్రలో కూడా బిజెపి కూటమి ఉండటంతో అక్కడ ఆ పని సులువుగా జరిగింది.

ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు నవంబర్ 23వ తేదీతో ముగియనున్నాయి. ఆ తర్వాత బిజెపి జాతీయ నేతలంతా తెలంగాణలో మకాం వేయనున్నట్లు స్థానిక నేతలు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే తెలంగాణను చుట్టేశారు. మరోసారి నవంబర్ 25, 26, 27 తేదీల్లో వస్తారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రచారానికి చివరి వారం కీలకంగా మారనుంది. అలాగే, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల పార్టీ ముఖ్య నేతల తాకిడి రాష్ట్రానికి పెరుగుతుందని రాష్ట్ర బిజెపి నేతలు చెబుతున్నారు.
నెలకోసారి పర్యటించిన అమిత్ షా
ఈ ఏడాది ప్రారంభం నుంచి అమిత్ షా తెలంగాణపై ప్రత్యేక ద్‌ృష్టి సారించారు. ప్రతి నెలా తెలంగాణలో పర్యటిస్తున్నారు. వచ్చిన ప్రతి సారి నేతలతో సమావేశం అవుతున్నారు. పార్టీ బలోపేతం అంశాలపై చర్చిస్తున్నారు. బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టేవారు. తాజాగా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అమిత్‌షా దూకుడు పెంచారు. తెలంగాణలో వరుసగా పర్యటిస్తున్నారు.

వాస్తవానికి అమిత్‌షా ఇప్పటికే మరోసారి తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. గత అక్టోబర్‌లో సూర్యాపేట జిల్లాలో అమిత్ షా పర్యటించారు. సూర్యాపేటలో తలపెట్టిన జనగర్జన సభకు హాజరై ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలి కోరారు. బిజెపి గెలిస్తే బిసి వ్యక్తిని సిఎం చేస్తామని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News