కెసిఆర్ కృషితోనే గిరిజన యూనివర్సిటీ
పదేళ్ళుగా తెలంగాణ గిరిజనులకు కేంద్రం ఏమి చేసిందో చెప్పాలి
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆదిలాబాద్‌లో సభలో కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఖండించారు. ఆదిలాబాద్ గడ్డపై అమిత్ షా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కెసిఆర్ ప్రభుత్వం స్థలం చూపించలేదనడం మూర్ఖత్వమేనని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ 2014 నుండి యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అనేక పర్యాయాలు ప్రధాని మోదీని కలిసి డిమాండ్ చేసిన విషయం నిజం కాదా అని ఆమె ప్రశ్నించారు. గిరిజన వర్సిటీ కోసం ములుగు జిల్లా జాకారంలో రాష్ట్ర ప్రభుత్వం 335 ఎకరాల స్థలాన్ని కేటాయించిన ఫైళ్లను ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రానికి నివేదించిన విషయం నిజం కాదా అని నిలదీశారు. 2016లో స్థలాన్ని పరిశీలించి కేంద్రానికి నివేదిక పంపినా కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేసింది మీరు కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంట భూమి కూడా కేటాయించని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ నిచ్చిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ గిరిజన యూనివర్సిటీని ఇవ్వకుండా వివక్ష చూపిందని విమర్శించారు. గిరిజనుల రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింతే ఇన్నేళ్లు ఆమోదించకుండా తొక్కిపెడుతుంది ఎవరని నిలదీశారు.
అమిత్ షా మాట్లాడిన దాంట్లో ఒక్క మాట కూడా నిజం లేదని అన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం 50 కోట్లతో జోడేఘాట్ నిర్మించిందని గుర్తు చేశారు. గిరిజన సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని, గిరిజనుల ఓట్లు దండుకునేందుకు బిజెపి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో గిరిజన యూనివర్సిటీ ప్రకటన బిజెపి కుట్రలో భాగమేనని అన్నారు. 10 ఏళ్లుగా తెలంగాణలోని గిరిజనులకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి దొంగ హామీలు, మోసపూరిత వాగ్దానాలు మా గిరిజన బిడ్డలు ఎట్టి పరిస్థితిలో నమ్మరని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బిజెపి ప్రభుత్వానికి గిరిజనుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గిరిజన రిజర్వేషన్ ఆమోదించి దేశవ్యాప్తంగా జనాభా దామాషా ప్రకారం గిరిజన రిజర్వేషన్ అమలు చేసి చూపించాలని సవాలు విసిరారు. బిజెపి ఎన్ని కుట్రలు చేసినా రాబోయే రోజుల్లో గెలుపు బిఆర్‌ఎస్ దేనని మంత్రి స్పష్టం చేశారు.