మన తెలంగాణ/హైదరాబాద్: మార్చి చివరి వారంలో బిజెపి నేత జెపి నడ్డా, యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్ తెలంగాణకు రానున్నారు. తెలంగాణపై బిజెపి నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. నెల చివరి వారంలోగాని, ఏప్రిల్ మొదటివారంలో గానీ జనగాంలో బిజెపి నేతలు భారీ బహిరంగ సభను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభకు జెపి నడ్డా, యోగి ఆదిత్యనాథ్‌లు హాజరయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఏప్రిల్ 14న అమిత్‌షా రాక
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14న జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభించనున్నారు. దీని ప్రారంభ సమావేశానికి అమిత్‌షా హాజరయ్యే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు తెలంగాణలో అమిత్‌షా మకాం వేయనున్నారు. బూత్ లెవెల్ కార్యకర్తలతో అమిత్‌షా సమావేశం కానున్నారు. అమిత్‌షా రానున్న నేపథ్యంలో చేరికలకు అవకాశం ఉంది. ఇప్పటికే బిజెపితో పలువురు ముఖ్యనేతలు టచ్‌లో వున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో రాష్ట్ర నాయకత్వానికి సంబంధం లేకుండా నియోజకవర్గాల్లో ప్రత్యేక టీంలు పర్యటిస్తున్నట్లు.. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై జాతీయ నాయత్వానికి సెంట్రల్ టీం నివేదిక ఇవ్వనుంది. తద్వారా గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.