న్యూఢిల్లీ: తన హక్కులను కాపాడాలంటూ ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నేడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరును, స్వరాన్ని, ఫొటోలను తన అనుమతి లేకుండా ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ పేరుతో నకిలీ లాటరీ స్కామ్, మరే ఇతర సంస్థ, వ్యక్తులు వాడుకోకుండా నిరోధించాలని, తన ప్రచార హక్కులను కాపాడాలని పిటిషన్ లో అమితాబ్ కోరారు. దీన్ని విచారించిన జస్టిస్ నవీన్ చావ్లా, అమితాబ్ వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు.
అమితాబ్ అనుమతి లేదా ధ్రువీకరణ లేకుండా ఆయనకున్న సెలబ్రిటీ హోదాను వినియోగించుకోవడాన్ని జస్టిస్ చావ్లా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ కేసులో అమితాబ్ చెబుతున్నట్టు ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొన్నారు. అమితాబ్ తరఫున ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. కెబిసి లాటరీ లక్కీ డ్రా, కెబిసిి లాటరీ రిజిస్ట్రేషన్, అమితాబచ్చన్ వీడియో కాల్ తదతర రూపంలో ప్రచారం కోసం వినియోగిస్తున్న ఆధారాలను కోర్టుకు సమర్పించారు.