ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ శుక్రవారం తన అనారోగ్యంపై వచ్చిన వార్తలను “ఫేక్ న్యూస్” అని తోసిపుచ్చారు. తన ఆసుపత్రిపై పుకార్లకు ముగింపు పలికారు. అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురయ్యారని నిన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో బచ్చన్ చేరినట్లు సామాజిక మాద్యమాల్లో వార్తలు వెలువడ్డాయి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో క్లాట్ రావడంతో ఆయన యాంజియోప్లాస్టీ చేయించుకున్నారని అనేక నివేదికలు పేర్కొన్న తర్వాత బచ్చన్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందారు.
అమితాబ్ ఆరోగ్యంపై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అతని ఆసుపత్రి వార్తల తర్వాత వెలువడిన కొన్ని గంటల తర్వాత అమితాబ్ బచ్చన్, అతని కుమారుడు అభిషేక్ బచ్చన్ తో కలిసి థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో మాఝీ ముంబై వర్సెస్ టైగర్స్ ఆఫ్ కోల్‌కతా మధ్య జరిగిన ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) ఫైనల్ మ్యాచ్‌కు హాజరయ్యారు. అక్కడ క్రికెట్ దిగ్గజ ఆటగాడు సచిన్ తో కలిసి బచ్చన్ కనిపించాడు. మ్యాచ్ తిలకించేదుకు వచ్చిన అమితాబ్ ను తన ఆరోగ్యంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తన ఆరోగ్యం పై వస్తున్న వార్తలన్నీ నిజం కాదని, ఆ వార్తలు ఫేక్ అని తెలిపారు. అమితా బచ్చన్ ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా “కల్కి 2898 ఏడీ”లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.