- Advertisement -
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్థానంలో జి-20 కొత్త షెర్పాగా నీతి ఆయోగ్ మాజీ సిఇఓ అమితాబ్ కాంత్ నియమితులు కానున్నారు. ఈ ఏడాది జి-20 అధ్యక్ష బాధ్యతలు భారత్ చేపట్టనున్నందున పూర్తి కాలం షెర్పా ఆవశ్యకత ఉందని, అందుకే ఆ పదవిలో అమితాబ్ కాంత్‌ను ప్రభుత్వం నియమించనున్నదని వర్గాలు తెలిపాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో జరిగే సమావేశాలలో షెర్పా పాల్గొనాల్సి ఉంటుందని, అందుకు పూర్తి సమయం వెచ్చించాల్సి ఉంటుందని వారు తెలిపారు. మోడీ క్యాబినెట్‌లో అనేక కీలక శాఖలను కేంద్ర మంత్రి పియూష్ గోయల్ నిర్వర్తిస్తున్నారని, అందుకోసం ఆయన తన పూర్తి సమయాన్ని వెచ్చించాల్సి వస్తోందని వారు వివరించారు. వీటితోపాటు రాజ్యసభలో పార్టీ నాయకుడిగా కూడా వ్యవహరిస్తున్నారని వర్గాలు తెలిపాయి. ఆరేళ్లపాటు నీతి ఆయోగ్ సిఇఓగా కొనసాగిన అమితాబ్ కాంత్ గత నెలలో పదవీ విరమణ చేశారు.
- Advertisement -