Thursday, January 23, 2025

సరఫరాల భయంతోనే దిగొచ్చిన రష్యా, చైనా..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అంతులేకుండా సాగుతోన్న ఉక్రెయిన్ సంక్లిష్ట పరిస్థితితో తలెత్తే అంతర్జాతీయ పరిణామాలను సమగ్ర రీతిలో రష్యా, చైనాలకు తెలియచేయడం జరిగిందని జి20లో భారతీయ షెర్పా అమితాబ్ కాంత్ తెలిపారు. విస్తృత స్థాయి సంప్రదింపులు జరిగాయి. ఈ దశలో ఢిల్లీ డిక్లరేషన్ వెలువరించడం కీలకం అయింది. దీనికి ముందు అన్ని సభ్య దేశాల సమ్మతి అవసరం, అయితే తమ అస్థిత్వానికి ఇబ్బందికరంగా మారుతుందనే ఆలోచనతో రష్యా చైనాలు ఆది నుంచి ఉక్రెయిన్ అంశంపై డిక్లరేషన్‌లో ప్రస్తావనే ఉండరాదని పేర్కొన్నాయి.

ఈ దశలో శుక్రవారం రాత్రి వరకూ కూడా ఏకాభిప్రాయం కుదరదనే అనుకున్నామని కాంత్ తెలిపారు. అయితే చిరకాల యుద్ధంతో తిష్టవేసుకున్న పరస్పర అపనమ్మకాలతో ప్రపంచ దేశాల మధ్య సరఫరాల వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుందని, దీనితో దేశాలకు అతీతంగా నిత్యావసరాలు, ప్రత్యేకించి మార్కెట్లకు అందే రోజువారి సరుకులు, అత్యంత కీలకమైన ఎరువులు, ఔషధాల సరఫరాకు విఘాతం ఏర్పడుతుందనే విషయాన్ని చైనా, రష్యాలతో పాటు ఇతర దేశాలకు తెలియచేయడం జరిగిందని కాంత్ తెలిపారు.

పలు ప్రాంతాలలో ఇంతకు ముందు కోవిడ్, తరువాత లాక్‌డౌన్లు పరిణామాలతో సరఫరాల వ్యవస్థలకు దెబ్బతగిలింది. దీని ప్రభావం పలు దేశాలపై పడింది. దీని తరువాత నెలకొన్న ఉక్రెయిన్ సంక్షోభంతో ఆంక్షలు విధింపులు, రెండు కూటములుగా ప్రపంచం మారే పరిస్థితి తలెత్తుతున్న దశలో ఆహారధాన్యాలకు ఇతరత్రా వస్తువులకు గండిపడుతున్న వైనం అన్ని దేశాలకు అనుభవంలోకి రావడంతోనే ఇప్పుడు ఉక్రెయిన్ ప్రస్తావనతో, ఘర్షణ నివారణ పిలుపుతో డిక్లరేషన్‌కు వీలేర్పడింది. దీనికి చివరికి రష్యా చైనాలు కూడా శుక్రవారం రాత్రి సమ్మతి తెలిపినట్లు భారత ప్రతినిధి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News