‘As mother and children we are connected with one another.My mother is the bones of my spine, keeping me straight and true. She is my blood, making sure it runs rich and strong. She is the beating of my heart. I cannot now imagine a life without her’ Kristin Hannah, American Writer
మార్చి 8 మహిళలకు ప్రత్యేక దినమని, అంతర్జాతీయ మహిళా దినోత్సవమని మనందరికీ తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా మహిళల స్థితిగతులపై ఈ రోజున అనేక చోట్ల, అనేక వేదికలు, సంస్థలు నిశితంగా చర్చించి తీర్మానాలూ చేస్తాయి. కుటుంబం, సామాజికం, ఆర్థికం, రాజకీయాలు, సాంస్కృతిక రంగాల్లో స్త్రీల ప్రాతినిధ్యమే కాదు, నాయకత్వాన్ని మేధో చర్చలు వింగడిస్తాయి. దేశ దేశాల ఉద్యమశీల, ప్రగతిశీల మహిళామణులెందరో ఈ సందర్భంగా ప్రస్తావనకొస్తారు. ఐక్యరాజ్యసమితి మొదలు హైదరాబాదు దాకా భిన్న ప్రాంతాలు, ప్రసార, ప్రచార మాధ్యమాలు నారీ వర్తమానాన్ని స్ఫూర్తివంతంగా ముచ్చటిస్తాయి. పురుషాధిక్య వ్యవస్థలో స్త్రీల హక్కులను ప్రవచిస్తూ ‘పురుషుడిలాగే స్త్రీ వ్యక్తి. ఆమెకు శరీరం ఉంది. దానికి వ్యాయామం కావా లి.ఆమెకు మెదడు ఉంది. దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం ఉంది. దానికి అనుభూతి కావాలి’ అంటూ గుడిపాటి వెంకటాచలం చేసిన వ్యాఖ్యను అందరూ తలపోస్తారు. నేటి కార్పొరేట్ వ్యాపార విలువల్లో పతనం అంచున నిలబడి నిలువునా కాలిపోతున్న నారీజనతకు క్షేమం కాంక్షిస్తారు. పగ, ద్వేషం, వైరం ముప్పురిగా విరుచుకుపడుతున్న డిజిటల్ కాలుష్య యుగంలో ఆడపిల్లలు తమకు తాముగా విపత్తులను ధైర్యంగా ఎదుర్కొని నిలబడడానికి గల చోదక శక్తిపై అక్షరాక్షరం నినదిస్తారు’ ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం’ అనే వెనుకటి సినిమా పాట ప్రతిస్వరాన ధ్వజమెత్తుతుంది.
‘ముదితల్ నేర్వగ రాని విద్యగలదే’ అంటూ శాస్త్రసాంకేతిక రంగాల్లో అతివలు సాధిస్తున్న ప్రగతిని వినుతిస్తారు. ముఖ్యంగా పురాణ, చారిత్రక, ఆధునిక యుగయుగాల మహిళామూర్తుల గాథలను వల్లె వేస్తూ ఇవాళంతా మహిళాసాధికారత ఎజెండాగా ర్యాలీలు, సభలు, సమావేశాలు విజయవంతంగా ముగుస్తాయి. తప్పులేదు. అయితే మహిళా చైతన్యం కులీన (ఎలైట్), పట్టణ (అర్బన్) వర్గాల దగ్గరే ఆగిపోకూడదు. గెలుపు కథలు ఊళ్ళల్లోనూ మా వాడకట్టు (గేరి) ల్లోనూ ఉన్నాయి. బాహ్య ప్రపంచానికి తెలియకుండా సమున్నతమైన పోరాటం చేసిన, చేస్తున్న అమ్మలూ, అక్కలూ, చెల్లెమ్మలూ మన చుట్టూ ఎంతోమంది ఉంటారు. బతుకుతున్నది బతుకే అని తెలియకుండా, బతుకును మహోజ్వలంగా యుద్ధంలా గడిపిన, గడుపుతున్ప స్త్రీలెందరో అనామకంగా మారుమూలన ఉన్నారు. ఆదర్శాలివి అనేది తెలియకుండానే అమితాదర్శంగా ఉంటూ ఏ ప్రశంసకూ నోచుకోని ఉత్తమోత్తమ ఇల్లాండ్లు మన మధ్య అసంఖ్యాకంగా ఉన్నారు. వీళ్ల గురించి మనం మాట్లాడుకోవాలి. అడుగు వర్గపు, ఉత్పత్తి కులాల స్త్రీమూర్తుల చరితను లోకం ముందు పెట్టాలి. అప్పుడేమహిళా దినోత్సవానికి నిండైన గౌరవం, నిజమైన ప్రతి పత్తి.
ఈసందర్భంలో ఎవరి కథో ఎందుకని, మీరు అనుమతిస్తే, మీరు వింటానంటే ఈ పవిత్రమైన రోజున మా అమ్మ కథే మీకు చెప్పాలనుకుంటున్నాను.
మొక్కవోని ధైర్యంతో ఏడుపదుల జీవితం నిండా విజ్ఞతకూ, విజేతకూ మారుపేరుగా ‘How A Woman is Building Sustainable Future for the Community’ The Family Maker అనే శీర్షికలకు ఉదాహరణగా నిలిచే మా అమ్మ కథను సువిశాల ప్రపంచం ముందుంచాల్సిన అవసరం నాకు ఎంతైనా వుంది. అమ్మ ఇప్పుడు గౌరవ వాచకం. ఒకప్పుడు బానిస వాచకం. దొరలు, దొరసానులు కటువుగా అమ్మను ‘ఒసే చెంద్రీ’ అనేది. అదే దొరసానులు దొరలిప్పుడు ‘చంద్రమ్మా’ అని, కొందరైతే ‘చంద్రమ్మ గారూ’ అంటున్నారు. ఒకప్పుడు నిరక్షర వేలిముద్ర. ఇప్పుడు ఏదైనా పత్రం చదివించుకొని విని, బి. చంద్రమ్మ అని తనదైన సంతకం పెట్టగల శక్తిమంతురాలు. సంతకం మేం నేర్పలేదు. అమ్మే మేం రాసే అక్షరాలను చూసి నేర్చుకుంది. ఒకప్పుడు పొలాల్లో సహకూలీలకు జానపదాలనందించి రాగాల్లో ఊయలూగించిన మట్టి పాట. ఇప్పుడు మైకందిస్తే తన వాణిని గట్టిగా వినిపించగల ఉద్విగ్నగళం. పెండ్లైన నెల రోజులకే జానమ్మ పెద్దమ్మ చనిపోతే దుఃఖిత కుటుంబంలోకి సాంత్వనం కూర్చడానికి నాన్నకు సహచరిగా జతకూడిన సారమతి. అప్పుడమ్మకు పద్నాలుగేండ్లు. ‘కోడలొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ’ అంటారు కదా. పేదరికంలో పెద్ద బలగాన్ని మెప్పించడం కష్టం మరి. నాన్న బండెడు కష్టాన్ని బంధువులందరికీ ఖుషీగా పంచేది. మోదాన్ని మించి ఆదాయమేముంది? ఆప్తులే సంపద.
ఆస్తులేం గొప్ప? అంటూ నాన్న పాటించిన జీవన సూత్రానికి అమ్మ సదా సంకలనమయ్యిందే తప్ప వ్యవకలనమెప్పుడూ కాలేదు. అరవై గజాల మిద్దె ఇల్లూ, అరెకరం వ్యవసాయ భూమితో బతుకు యజ్ఞం ఆరంభించిన నాన్నతో నందికొండకు కోతలకు నాట్లకు వెళ్లింది. దొరోల్ల భూమిని పాలుకు చేస్తున్నప్పుడు ఏండ్లకేండ్లు మైళ్ల దూరం మాడమీద నాలుగరకలకు సద్దులు మోసింది. మిరప కూళ్లకూ, జొన్న కూళ్లకూ చుట్టూ నాలుగు పొలిమేరల్లో చెమటను చల్లింది. దొరల గరిసెలకు పుట్లకు పుట్ల ధాన్యాన్ని చక్రం మోత మోసింది. కొత్తచీర అనే పదానికి తావేలేనప్పుడు ఆదివారం అంగట్లో దొరికిన పాత బట్టలకు ఆత్మగౌరవం ప్రసాదించింది.కట్టెలపొయ్యి మీద పూటకు మూడు మానికల వంట, రోకటి దంపుళ్లలో పొద్దుమాపు విసుగైనా ఆహ్లాదంగా తలదాల్చింది. ఎక్క దీపం వెలుగునే వేయి పున్నముల సంబరంగా భావించింది. ‘కాపిష్కంత ఉంది, గా ఎర్రటి సాయిలును గీ కర్రెపిల్లేం కలుపుకుపోతది? ఎంకమ్మా! ఇంకేడ సంబంధం దొరకలేదా మీకు’ అని నాయనమ్మను ఎత్తిపొడిచిన కొప్పు ఎల్లమ్మ నిరసనను అమ్మ పాజిటివ్ గా తీసుకుంది. ‘ఎక్కిరించిన ఎల్లమ్మతోనే ఇకమతి గల పిల్ల’ అని పేరు తెచ్చుకుంది.
నాన్నకు మేలిమితోడనిపించుకుంది. నాయనమ్మ ఊగే దేవుని శిగానికి దాపుండి గంగను ఇలవేల్పుగా భక్తితో కొలిచింది.
‘A house means income and livelihood. A house means safety. A house means her children have a future. A house gives her health. A house gives a voice in her city or village. A house is recognition’ అంటున్న ప్రముఖ మహిళా జీవిత విశ్లేషకులు రినాఝబ్వాలా, బిజల్ బ్రహంభట్ ద్వయంవలె అమ్మకు గృహ నిబంధన చెప్పినవారెవరూ అప్పుడు లేరు, ఇప్పుడూ లేరు. మహా అయితే అప్పగింతల్లో పుట్టినింటికీ మెట్టినింటికీ కీర్తి తెచ్చేది ఆడపిల్లే అని వాళ్ల అమ్మమ్మ నాయనమ్మా తాతలు చెప్పివుంటారు, పెద్ద కోడలు అంటే ఇంటిల్లపాదిని పెద్దలా చూసుకునే బాధ్యత నీదని చిన్నమ్మలూ పెద్దమ్మాలూ చెవునేసి వుంటారు.
నీ వెనక ఇంకా ఇద్దరు చెల్లెళ్లూ, నలుగురు తమ్ముళ్లూ ఉన్నారు. అత్తామామ చెప్పినట్టు ఆలుమగలు సర్దుకొని మసలండి. లేందంటే ఇప్పలం బెట్టే ఇత్తనం, విడగొట్టే మంధర అంటూ అవతలివత లోల్లు కైగడతరు. నీ కాపురం సక్కబడదు, తోబుట్టువులకు లగ్గాలు కావు అని కన్నోళ్లు హితవు పలికి వుంటారు. ఇది ఆడబిడ్డలందరికీ దొరికే ఉపదేశమే. అంతమాత్రాన అందరి సంసారాలు గట్టెక్కుతున్నాయా? అంటే, లేదు.
భాసికం తీయగానే నిరుపేదలవి చెప్పనలవికాని బాధలు. రేకలు బారంగ లేచింది మొదలు మాపు నిద్రపోయే దాకా పనికిపోవడం, పది మందితో కలసిపోవడం, అంగ వెనకబడకుండా మునుమెల్లడం, కట్టే పిడకా తెచ్చుకోవడం, చేదబాయిల నీళ్లు తోడుకురావడం, ఉన్నదేదో పొయి మీద ఉడికించి వార్చి అందరికీ వడ్డించడం, మిగిలింది భుజించి, సందేళ చప్పుడు లేకుండా పెనిమిటిని చేరడం పద్మవ్యూహం లాంటిదే, మరి. దీంట్ల సురక్షితంగా మనగలగాలంటే స్త్రీకుండాల్సింది వ్యక్తిగత సుఖాపేక్ష కంటే కుటుంబ క్షేమ దృక్పథం, ఫ్యామిలీ బాండింగ్. వీటినే అమ్మ పరమ ప్రసాదంగా కట్టుబాటుగా నియమంగా పెట్టుకుంది. సత్యసంధతతో అనుసరించింది.
బంధుత్వాలు పెట్టిపోతల దగ్గర తన తరఫువాళ్లనో రకంగా, నాన్న తరఫువాళ్లనో రకంగా ఎన్నడు చూడలేదు. నాయనమ్మనో రకంగా, వాళ్లమ్మనో రకంగా అర్సుకోలేదు. అప్పైతే తీర్పుకోవచ్చు. తప్పైతే దిద్దుకోలేం అనుకున్న సెల్ఫ్ ఓరియెంటెడ్ వుమెన్ అమ్మ. యవసాయంలో ఎదుగుదల దిగబాటు రెండింటినీ సమానంగా భావించింది. గనుమట్లకు బిచ్చగాడు సచ్చగాడు ఎవరొచ్చినా చేటలో దీవెనార్తి తీసుకునేది. లేదని కసరడం అమ్మనోట మేమెప్పుడూ వినిఎరుగం. మేం ఒక్క పొద్దుంటే ఊరందరికీ పాయసం పరమాన్నమే. వంటైనా పంటైనా భారీ చేయి అమ్మది. చూస్తే ఊళ్లె వేసే నాటకాలు, బాగోతాలు, హరి కథలు, బుర్రకథలు నాన్నతో చూసిందేమో, వినిందేమో. నకిరేకల్లుకు పోయి టాకీసులో ఒక్క సినిమా కూడా చూసి ఎరుగదు. తెలిసిన ఎరుకంతా సమిష్టి శ్రమ గ్రామీణ సంస్కృతి మూలాన్నే అబ్బింది.
మా పరోక్షంలో ఏం మాట్లాడేదో ఏమో కాని, ఎన్నడూ మా సమక్షంలో నాన్నను తూలనాడలేదు. వ్యవహారానికీ కార్యాలకూ బయటికి వెళ్తుంటే నాన్న మెలేసే కోర మీసం మాదిరిగానే ఆయన భుజం మీద తెల్లకండువా దర్జాలు పోవాలని కోరుకునేది. నిందలూ, బందెలూ వొద్దు, పిడికెడు పుణ్యం తీసుకరా, అదే పదివేలని నాన్నకు జాగ్రత్తలు సైచేసేది. మా నలుగురినే కాదు, నాన్నతో బుట్టువులందరినీ అమ్మే నాన్మ తాతై పెంపుచేసింది. ఇదంతా నెమరేసుకుంటుంటే అమ్మే ఒక కుటుంబ శాస్త్రమని తెలిసివస్తుంది. ఇక, తొంభైల్లో తలెత్తిన వ్యవసాయ సంక్షోభంలో కష్టించి ఆర్జించిన పదెకరాల భూకమతం సమస్తం, గొడ్డూ గోదా, పూసా పోగూ తెచ్చిన బాకీల కింద కుదువబడినప్పుడు అమ్మ కుంగిపోలేదు. పరుల మాటలకు శరపడలేదు. వశపడనప్పుడు వశిష్టుడైనా నిశ్చేష్టుడే. మనం చేయగలిగిందేముంది. పోనీ. ఆడి తప్పలేదు, మనం పాడి తప్పలేదు అంటూ నాన్ననూ మమ్మల్నీ పురుగుల మందు ముట్టనివ్వలేదు. ప్రాయోపవేశానికి తావివ్వలేదు. కొడుకులని మురిసింది ఊరంతా అప్పులేనని అయినోళ్లేకాదు దారినపోయే దానయ్యలు సైతం కయ్యానికి కాలు దువ్వినప్పుడూ వియ్యమందుకోవడానికి ఇంటికి అన్నదమ్ములూ రానప్పుడూ అమ్మసలు గుండె ధైర్యం చెడలేదు.
మిలిటరీలకు పోతే అటే నట! చిన్నోణ్ని ఎందుకు పంపుతవు ఫౌజులకు అని తిక్కల జనం మొరిగినపుడు కొరివి పెట్టాల్సిన కొడుకును దిగులు మబ్బులతో ఆపలేదు. కార్గిల్ కొండల్లో బాంబు మోతలను తలచుకొని ఏ ఒక్కనాడు శోకంపెట్టలేదు. నాభిల బలముంటే నవగ్రహాలనైనా జయిస్తరు. దేశం కోసం పోరాడుతున్న కొడుకును కన్నందుకు తెగ గర్వపడింది. పాపమే లేకుంటే శాపమే లేదు. ఎల్లకాలం చీకటే ఉండదు. వెన్నెలొచ్చే దాకా జంగు నడవాల్సిందే. మతులు మారినంత తొందర్ల మరకలు మాయవు. కొమ్మలు కాందే నీడలు కాయవు. నీడ ఉన్న చోట్ల నీళ్లున్న తావుల ఎవలైనా చేరతరు. ఎట్టకు తట్టుకుంటే కాలంల కుబేరులైతరు. కొద్దిల ఎనకముందైతదేమొ. అంతే బూతల్లిని నమ్మితే ఎన్నటికీ చెడిపోం. బల్లె సదువు రావాలె. చెల్కల పని రావాలె. మీకేం గాదు. నశీబ్ ల రాసుంటే నాజర్ సాబ్ కావొచ్చంటూ అమ్మ మా ఆశలకూ, ఆశయాలకూ భద్రత చెప్పి కాపుగాసింది. మేం ఇంటిని గోర్కీ అమ్మ నవలలోని ఇల్లులాగా పుస్తకాలతోనూ పార్టీ కార్యకలాపాలతోనూ కళా సామాగ్రితోనూ నింపేసినప్పుడూ అమ్మ సంబరపడిందే తప్ప సంకటం చెప్పలేదు.