Monday, January 27, 2025

అమ్మ-అడవి

- Advertisement -
- Advertisement -

తొలకరి చినుకుల్లో పుట్టానని
మీ తాత విత్తనంలా నవ్వుతూ
చెప్పేవాడని మా అమ్మ చిరునవ్వు
గాల్లోకి విసురుతూ చెప్పేది

ఎప్పుడు తొలకరి తొంగి చూసినా
అమ్మ పుట్టినరోజే అనుకుంటాను
వర్ష ఋతువునా రక్త సంబంధి
అమ్మ ఊయల్లో వేసిపాడిన లాలిపాట
లీలగా గుర్తొస్తుంది

‘బజ్జోరా నా కన్నా!
మీ నాయనా దచ్చినాది ఎళ్లినాడు
బజ్జోరా మా చిన్న మీ తాత ఉత్తరాది
ఎళ్లినాడు ఇంటిలోన భయం లేదు
కన్నపేగు కాపలా’
హాయిగా కన్నుకొరుకు కలవరింత లేమిలేవు
చెట్టు నిదురొయిందిచెట్టు కింద
నీడ నిదరోయింది
చిక్కు లేదు, చీకటి రాదు
పడుకో మా నాన్నా, బతుకే పోరు బాట‘
పాట నా హృదయ సంబంధి

అప్పుడప్పుడు పొయ్యి గెడ్డ ఎలుతురులో
అమ్మ ముఖంలోఇనబింబపు ఆనవాళ్లు కనిపించేవి

చిట్ట చివరి బిడ్డనని ఏడేళ్లు పాలిచ్చి
పడ్డ దూడను చేసింది
పాలు తాగుతున్నప్పుడు
అమ్మ ముఖానికేసి చూస్తే
మేఘాన్ని చూసినట్టు ఇప్పుడిప్పుడే గుర్తొస్తుంది
జీవితంలో కష్టాలను
జుట్టుపట్టి ఆవలికి లాగేయగల విద్య
అమ్మ దగ్గరే నేర్చుకున్న
ఒక్కోసారి అమ్మ సముద్రంలా కనిపించేది

అన్ని ఋతువులనుఅమ్మలోనే చూసుకున్న
అమ్మ కాలంలా సాగుతూనే ఉంది
అమ్మలందరూ అడవులేవాళ్ళ మీదనే
ఋతువులు వెళ్లివస్తుంటాయ్

డాక్టర్ సుంకర గోపాలయ్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News