Saturday, December 28, 2024

సరళమైన, సహజమైన కవిత్వం

- Advertisement -
- Advertisement -

తెలుగులో కవిత్వం రాసేవాళ్ల సంఖ్య గత రెండు మూడు దశాబ్దాలలో బాగా పెరిగింది. కొత్తతరం కవులు కొందరు మంచి కవిత్వం రాస్తున్నారనటంలో సందేహం లేదు. ఇక ఐదారు దశాబ్దాలుగా రాస్తూ వచ్చినవారిలో కొందరు రచనారంగం నుండి దాదాపు పూర్తిగా నిష్క్రమించారు. They are basking in the light of their past writings. అలా తప్పుకోనివారిలో ఒకరైన అమ్మంగి వేణుగోపాల్, ముఖచిత్రం అనే ఈ కొత్త కవితా సంపుటితో ఇప్పుడు మళ్లీ మన ముందుకు వస్తున్నారు. ఒకే సాహిత్య ప్రక్రియలో రాసే సాహితీపరులు కొందరుంటే, ప్రక్రియను (genre ను) మారుస్తూ రచనా వ్యాసంగాన్ని కొనసాగించేవాళ్లు కొందరుంటారు. ఈ కవి రెండవ రకానికి చెందినవారనే విషయం చాలా మంది సాహిత్య పాఠకులకు తెలుసు.ఒకప్పటితో పోల్చిచూస్తే వచనకవిత్వం రాయడం, పుస్తకాలుగా అచ్చు వేయడం నేటికాలంలో రోజురోజుకూ మరింతగా పెరుగుతూ వస్తున్నది. ఇది ఆహ్వానించతగిన మార్పే. ఐతే, పూర్వం కళాకారులు తమ కళ ఒక కనీస స్థాయిని చేరుకునేదాకా కృషి చేసి, ఆ తర్వాతనే దాన్ని బయటి ప్రపంచానికి ప్రకటించేవారు. ఆరంగేట్రం, గండా బంధనం అట్లాంటి కృషికి సంబంధించిన మాటలే. తమ నృత్యకళను మొదటిసారిగా ప్రదర్శించడానికి గురువు అనుమతి తీసుకోవటం ఇప్పటికీ జరుగుతున్నదే.

ఆ గురువులు కూడా తన శిష్యురాలు లేదా శిష్యుడు ఆ కనీస స్థాయిని చేరుకున్న నిదర్శనాలు కనపించిన తర్వాతనే అనుమతి ఇచ్చేవారు, ఇస్తున్నారు. సంగీతరంగంలో ఉండిన గండా బంధనం పద్ధతేమో కళా అభ్యాసపు ప్రారంభంతో లంకెను కలిగివుండేది. సంగీతం మీద ఇష్టం, ఆసక్తి ఉన్నవారెవరైనా (ముఖ్యంగా సంపన్నులు) తమ కొడుకును లేదా కూతురును సంగీతంలోకి పంపాలనుకుంటే, ఒక మంచి గురువును ఎంచుకుని, ఆ గురువు చేత సంగీతం నేర్పించేవారు. ఆ విషయాన్ని లోకానికి బహిర్గతం చేసేందుకు ఏర్పాటు చేయబడే కార్యక్రమమే గండా బంధనం. కానీ కవిత్వం, ఇతర కళల విషయంలో ఇట్లాంటి కార్యక్రమాలేవీ ఉండేవి కావు (అక్షరాభ్యాసం చదువుకు సంబంధించింది తప్ప కళాభ్యాసానికి సంబంధించింది కాదు). ఐనా ఎవరికి వారు కృషితో, తయారీ (preparation) తో ఒక భూమికను, పూర్వరంగాన్ని (background ను) ఏర్పాటు చేసుకునేవారు. దీన్నే పునాది (foundation) అన్నాం, అంటున్నాం.

ఈ రోజుల్లో ఏ పునాదీ లేకుండానే నేరుగా రచన చేయడానికి, లేదా చేసేందుకు ప్రయత్నించడానికి అత్యంత అనువైన ప్రక్రియ వచన కవిత. ఎందుకంటే అది వచన కవిత కాబట్టి! ఛందోబద్ధ పద్యాలు రాయాలంటే భాష మీద, ఛందస్సు మీద పట్టు తప్పనిసరి. గేయాలు రాయాలన్నా లయ మీద, మాత్రా ఛందస్సు మీద తగినంత అవగాహన ఉండాలి. వచన కవిత్వం రాసేందుకు అవసరమైన prerequisites (ముందస్తుగా అవసరమున్న లక్షణాలు లేదా అర్హతలు) ఏవి? భావుకత, ఆర్ద్రత నిండిన హృదయం, కవిత్వాన్ని చదివిన అనుభవం మొదలైనవి తప్పక ఉండాల్సినవే. ఐతే, వీటికోసం పెద్దగా కృషి చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మొదటి రెండు వాటంతట అవే వ్యక్తులలో సహజంగా ఉంటాయి, లేదా ఉండవు. కృషి చేసి వాటిని పొందలేం. ఈ కారణాల వలన, వచన కవిత్వం రాసేందుకు ప్రయత్నించేవాళ్లను ఆపేది ఇవాళ ఏదీ లేదు. అంతమాత్రాన వచన కవిత్వం రాయడం సులభమా? కానే కాదు. నిజానికి అది ఛందోబద్ధ పద్యాలు రాయడంకన్న కష్టమైనది. ఎందుకంటే రాయడం కాదు, రాసి మెప్పించడం ముఖ్యం.

ఇదంతా చెప్పడం సమకాలీన కవిత్వ రంగాన్ని వీక్షించేందుకు మాత్రమే తప్ప వేరొకందుకు కాదు. అమ్మంగి వేణుగోపాల్ గారికి దీనితో ఎట్లాంటి సంబంధం లేదు. ఆయన కవిత్వం రాయడం మొదలు పెట్టింది సుమారు అరవై సంవత్సరాల క్రితం. అప్పటి రోజులకూ ఇప్పటి కాలానికీ మధ్య ఎంతో భేదం ఉంది మరి. నిజానికి, వచన కవిత్వం రాసి మెప్పించినవారిలో అమ్మంగి వేణుగోపాల్ ముందువరుసలో ఉంటారు.ఈ సంపుటిలోని కవితల వస్తువులు చాలా వరకు సామాజికతను కలిగి ఉన్నవే. అమ్మంగి గారి కవిత్వంలో ఆత్మాశ్రయ ధోరణి అరుదు. నిజానికి ఆత్మాశ్రయ ధోరణిలో కవిత్వం రాయటం కొంత వరకు సులభం. మరోవిధంగా చెప్పాలంటే, అది ఒక advantage తో కూడుకుని ఉంటుంది. అందుకే ఏ కవి ఐనా ఇతరుల కారణంగా బాధ పడినప్పుడు, లేదా అవమానానికి గురైనప్పుడు జవాబుగా రాసే ప్రతీకార కవిత్వం (retaliatory poetry) బలంగా వస్తుంది. ఐతే, ఇక్కడ దీనికి భిన్నమైన మరో కోణం కూడా ఉంది: స్వంత విషయాలకు కాకుండా సమాజంలోని అన్యాయాలకు, ప్రజల బాధలకు మొదలైనవాటికి స్పందిస్తూ రాసే కవిత్వం కూడా బలంగా రావచ్చు.

కానీ ఎప్పుడు? తనకు సంబంధించిన విషయాల గురించి స్పందించినంత ఉద్ధృతితోనే ఇతర సంగతులకు స్పందించినప్పుడు మాత్రమే. అంటే కవిత్వం చిక్కగా, బలంగా రావాలంటే వస్తువుతో పూర్తిగా మమేకం (మమైక్యం?) కావడం ముఖ్యం అన్నమాట. In other words, the poet has to identify himself with the subject totally. అందుకే, ఏ సబ్జెక్టులతో ఐతే మనం పూర్తిగా మమేకం కాలేమో, వాటిని కవితా వస్తువులుగా స్వీకరించకపోవడమే ఉత్తమం. స్వీకరిస్తే మనం ఆ ప్రయత్నంలో రాణించకపోవచ్చు. అందరూ ఫలానా వస్తువు(ల) మీద రాస్తున్నారు కాబట్టి మనం కూడా రాయకపోతే ఏం బాగుంటుంది అని మొహమాటానికి పోయామా, బొక్కబోర్లా పడవచ్చు!
ఈ సంపుటిలోని కవితలలో వస్తుపరమైన వైవిధ్యం వుంది. కరోనా గురించి రాసినవే కాక దానితో పరోక్ష సంబంధమున్నవి కలిపి ఏడు కవితలు, చనిపోయినవారి స్మృతిలో రాసినవి నాలుగు ఉన్నాయి. ఈ స్మృతికవితలలో చెప్పబడిన రెండు మరణాలు కోవిడ్ వలన జరిగినవే. గత కొన్ని సంవత్సరాలలో కరోనా మీద కవిత్వం రాయని కవులు దాదాపు సున్న అని చెప్పవచ్చు. ఈ కవికి సైన్సు, యుద్ధం, క్రీడలు కూడా ఇష్టమైన సబ్జెక్టులు.

వీటిని వస్తువుగా చేసుకుని రాసిన కవితలు వీరి పాత కవితా సంపుటులలో కూడా అక్కడక్కడ కనిపిస్తాయి. హాస్యాన్నీ, చమత్కారాన్నీ మేళవించిన కవితలు ఈ ‘ముఖచిత్రం’లో సైతం ఉన్నాయి కొన్ని. ‘బక్రా’ కొంతవరకు అట్లాంటిదే.
విలువలను ఆదర్శాలను బోధించాలని/ గొప్పగొప్ప కొటేషన్లు గుప్పించి/ ఉపన్యాసం తయారు చేసుకున్నాను/ మొదటి వాక్యం వినిపించగానే/ ‘దిగిపో దిగిపో’ అరుపులతో/ హాలు దద్దరిల్లింది/ అంటూ మొదలౌతుంది కవిత. తాను ఒక బక్రా అయ్యానని, ‘దెబ్బతిన్న ఇగోతో స్టేజి దిగి/ ఆ నూరుమందిలో కలిసిపోయాను,’ అని తర్వాతి పంక్తులలో చెప్తాడు కవి. మామూలుగా ఐతే ఈ కవితను ఇక్కడే ముగించవచ్చు. కానీ ఈయన ఈ కింది పంక్తులలో హాస్యాన్ని మేళవించి, sudden reversal of situation తాలూకు చమత్కారాన్ని మెరిపిస్తూ కవితను ఎలా పొడగించారో చూడండి :/ ఇప్పుడు ఎవడో ఒక బక్రాగాడు/ వస్తాడు స్టేజిపైకి/ కుళ్ళిపోయిన టమాటాలతో/ నేను కూడా సిద్ధంగా ఉన్నాను/ ఆంగ్లసాహిత్యంలో enjambment అనే కవిత్వ ఉపకరణం (poetic device) ఒకటి వుంది.

అందులో ఒక కవితా పంక్తిలో ప్రధాన భావం ముగిసినా మరికొన్ని మాటలను, లేదా పదబంధాలను (phrases ను) చేర్చి, పంక్తిని పొడగించడం జరుగుతుంది. పాతకాలపు ఆంగ్లకవులలో టి. ఎస్. ఎలియట్, ఇ. ఇ. కమింగ్స్, విలియం కార్లోస్ విలియమ్స్ తమ కవిత్వంలో ఎంజాంబ్ మెంట్ ను విరివిగా, ప్రభావవంతంగా వాడారు. సమకాలీన కవులలోనేమో లూయీ గ్లూక్ పేరును ఉదాహరింవవచ్చు. కానీ, బక్రా అనే ఈ కవితలోని చివరి నాలుగు పంక్తులు ఎంజాంబ్ మెంట్ కు క్లాసికల్ ఉదాహరణ కావు. Enjambment లో పొడగింపు సాధారణంగా ఒక పంక్తికే, లేదా ఒకటి రెండు పంక్తులకే పరిమితమై ఉంటుంది. ఒక స్టాంజా అంత నిడివిని కలిగిన పొడగింపు చాలా అరుదు. పైగా, బక్రాలోని ఈ నాలుగు పంక్తులు పొడగింపే ఐనా వాటిలో ఉన్నది ప్రధాన భావన కాదని చెప్పలేం. ఇంగ్లిష్ సాహిత్యంలో ఉన్న లెక్కలేనన్ని సాహిత్య ఉపకరణాలను – అవి వందకు పైగానే ఉన్నాయి! – మనం తెలుగులో వాడుతున్నప్పటికీ వాటికి ప్రత్యేకమైన తెలుగు పేర్లను పెట్టుకోలేదు. సాహిత్య అకాడమీలు ఆ పని చేస్తే బాగుంటుంది.

దేవుడు కూడా మాస్క్ పెట్టుకునే ఉన్నాడు అన్నది ఈ సంపుటిలోని ఒక కవితకు శీర్షిక. ఇందులో కూడా కొంత చమత్కారం ఉంది. పైగా ఇది endemic nature of the disease ను (అంటే వ్యాధికి ఉండే విస్తృతి స్వభావాన్ని) సూచిస్తుంది. సాధారణంగా ఏకపదశీర్షికలకన్న ఎక్కువ పదాలున్న శీర్షికలు బాగుంటాయని చెప్పవచ్చు. ఐతే దీనికి మినహాయింపులుంటాయి కొన్ని సందర్భాల్లో. ఆస్పత్రిలో కవి పొందిన అనుభవానికి చక్కని అభివ్యక్తి తోడైంది ఆపరేషన్ అనే కవితలో. ఏమంటున్నాడో చూడండి:/ మణికట్టుమీద/ శరీరంలోకి రహదారిని పరుస్తారు/ రక్తం బొట్టుబొట్టుగా శరీరంలో కలుస్తుంటే /నీ రక్తాన్ని నువ్వే తాగుతున్న భ్రాంతి/ పొడిచి షుగర్ ను కొలిచి/ వడ్రంగిపిట్టగా ఎగిరిపోతుంది గ్లూకోమీటర్/ ఆక్సీజన్ పైపు నిన్నో బెలూన్ను చేస్తుంది/ ప్రశ్న చిన్నదే అన్నది చక్కని కవిత. అది ఒకదానితో ఒకటి పోలివున్న భిన్న సందర్భాలను కవిత్వీకరించి, వాటిని juxtapose చేస్తూ (పక్కపక్కన పెడుతూ) చివర్న ఒక కొసమెరుపులాంటి పంక్తితో ముగుస్తుంది. ఈ కవి రాసిన భరోసా అనే పాత కవితాసంపుటిలో ఇటువంటిదే ఐన ఒక కవిత ఉంది. దానిపేరు నీకూ నాకూ మధ్యన.

తల్లి మీది ప్రేమకు చెందిన భావన మనసును చెమ్మతో నింపేవిధంగా ఆవిష్కరింపబడిన కవిత అమ్మ స్మృతి./ అక్కడ నన్ను తల్చుకుంటున్నావేమో/ అమ్మా/ ఇక్కడ నాకు సరం తప్పింది/ అంటూ మొదలౌతుంది కవిత. సరం తప్పడం తెలంగాణలో బాగా వాడుకలో ఉన్న మాండలిక పదబంధం. దీన్ని నుడికారం అని కూడా అనొచ్చు. ఇదే పదబంధాన్ని ఆంధ్ర ప్రాంతంలో గొంతు పొరబోయింది అంటారు బహుశా. మరేదైనా ప్రత్యామ్నాయం కూడా ఉంటే ఉండవచ్చు. కవిత ముగింపు ఎలా ఉందో చూడండి:/ పీడకలలకు జడిసి ఏడ్చిన / నా పిల్లల నిద్రకు కాపలా కాసిన దానివి/ నాకు పాడిన జోలపాటల్నే వాళ్ళకూ పాడి/ నీవూ నిద్ర పోయావు/ దేవతలే పటంగా మారిన తర్వాత కూడా/ కలల్లో కనిపిస్తున్నావు పలకరిస్తున్నావు/ ప్రేమతో ఓదారుస్తున్నావు/ ఈ జన్మకిది చాలమ్మా చాలు/ ఈ సంపుటిలోని మరొక కవిత పేరు వేట. ఇది కూడా కరోనా గురించి రాసిందే. కోవిడ్ వ్యాధి ఈ కవిని బాగా చలింపజేసింది అనటానికి ఈ పంక్తులను నిదర్శనంగా చూపవచ్చు:
పద్నాలుగు రోజుల టైమ్ బాంబును మోస్తూ/ క్వారంటైన్ లో ఎండుటాకుల మధ్య వెనక్కి నడుస్తూ/ వసంతాన్ని కలగనటం అసాధ్యం/ పద్నాలుగు రోజులు టైమ్ బాంబుకు సమానమయ్యాయి కవికి!

ఎండుటాకుల మధ్య నడుస్తూ …. ఇది moderately good poetic expression (ఓ మోస్తరు కవితాభివ్యక్తి). కానీ ఇక్కడ ఎండుటాకుల మధ్య ‘వెనక్కి నడవటం’ అభివ్యక్తికి మరింత పుష్టినిచ్చింది. అంటే double emphasis (రెట్టింపు ఊనిక) ఇవ్వబడిందన్న మాట. ఇట్లాంటి అందమైన, బలమైన, విశిష్టమైన అభివ్యక్తిని కలిగి ఉండటం కవిత్వానికి అవసరం. కవిని, కవి కానివాడినుండి వేరు చేసేది కూడా అదే. ‘దేవునితో సెల్ఫీ’ కూడా కరోనాతో సంబంధమున్న కవితే. ఫోటోగ్రాఫర్ ఐన కె. గోవింద్ మీద రాసిన స్మృతికవిత ఇది. చివరి రెండు పంక్తులలో, ‘మనసుతో మోసపూరిత ఒప్పందం చేసుకుంటే తప్ప/ నిన్ను మేం మరచిపోలేం’ అంటాడు కవి. వేదనలోని తీవ్రతను ప్రతిబింబించాయి ఈ పంక్తులు.
రూపకాలంకారం (metaphor) కవిత్వస్పర్శను ఇనుమడింపజేస్తుందనడానికి ఈ పంక్తులు ఉదాహరణలు. ఈ ఆధునిక కాలంలో కవిత్వంలో అలంకారాల అవసరం లేదని నమ్మే కవులున్నారు కొందరు. కానీ అప్పుడు కవితలో సాంద్రత లోపించదా? ఒకవేళ అలంకారాలను మానుకుంటే, ఇతర పొయెటిక్ డివైసెస్ ఐనా ఉండాలి కదా పొయెమ్ లో? ఒక కవితలో గాఢత ఉందంటే, అందులో అలంకారాలో ఇతర ఉపకరణాలో ఉన్నాయనే కదా అర్థం? ఏ కవిత్వ ఉపకరణం లేకుండా చిక్కని కవిత్వం రాయడం సాధ్యమేనా? ఇది చర్చింపతగిన అంశం.

ఈ కవి ఇంతకు ముందు మినీ కవితలను విరివిగా రాయకపోయినా ఈ సంపుటిలో మాత్రం చక్కని ఐదు మినీ కవితలు రాశారు. వాటిలో కొన్నింటిని పరిశీలించండి: దోమ/ దోమ నన్ను ప్రేమించింది/ అది ముద్దు పెట్టుకోగానే/ నేను బెడ్డుమీద వాలిపోతాను/ ఇక్కడ బెడ్డుమీద వాలిపోతాను అంటే హాయిగా నిద్ర పోతాను అని కాదు అర్థం. మలేరియాకో చికున్ గున్యా (chikungunya) కో గురై హాస్పిటల్ బెడ్డుమీద వాలిపోతాను, అని అర్థం చేసుకోవాలి. మరో మినీ కవిత:
లెక్క/ యాభైమైళ్ళ స్పీడుతో/ రెండు గంటల్లో ఇంటికి పోతావు/ నూరుమైళ్ళ స్పీడుతో అయితే/ గంటలో పోతేపోతావు/ ఇక్కడ పోతేపోతావు అంటే, వెళ్తావు అనే కాకుండా చనిపోతావు అనే అర్థం కూడా వస్తుంది. చక్కని చమత్కారం. మరో మినీ కవిత:
కవిత/ రాతిలో/ పువ్వును చెక్కేది శిల్పకళ/ రాతిపువ్వును/ పరిమళ భరితం చేసేది గొప్ప కవిత/ ఇది మంచి కవితాత్మక ఊహ. ‘బ్యాలెన్స్ ఇరవై’ కూడా ప్రశ్న చిన్నదే లాంటి కవిత. ఇందులో జీవితపు నిడివి గురించిన చింతనలున్నాయి. అటక ఎంత నాస్టాల్జియాను కలిగించే సబ్జెక్టో మనందరికీ తెలిసిందే. మన పెద్దవాళ్ల, లేదా మన చిన్నప్పటి ఎన్నో వస్తువులు ఉంటాయి దానిమీద. వాటి విలువ రూపాయలలో తక్కువే ఐనా, వాటిని చూసినప్పుడు మనం పొందే ఆనందం, అనుభూతి ఎంతమాత్రం చిన్నవి కావు. ‘మూత ఇరిగిన సందూకలో/ ఒక పుస్తక ప్రదర్శనశాల ఉంది,’ అంటారు కవి. ఇది మనలో కొంతమందికి అనుభవంలోకి వచ్చేదే. అన్నీ చెప్పింతర్వాత చివర్న,/ తరతరాల కుటుంబ చరిత్రను/ కడుపులో దాచుకున్న కాలనాళిక/ ఈ అటక

అంటూ ముగిస్తారు కవి. అటక స్వభావాన్ని, దానిలోని gist ను (సారాంశాన్ని) ఈ మూడు పంక్తుల ద్వారా చెప్పి ముచ్చటగా ముక్తాయించారు.
పద్యకవిత్వం, భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం … వీటిలోని భాష సరళమైంది కాదు. విప్లవ కవిత్వం, ఇప్పుడు వస్తున్న వచన కవిత్వం సరళమైన భాషకు ప్రాధాన్యమిచ్చాయి, ఇస్తున్నాయి. ఐతే ఈ రెండింటి మధ్య ఉన్న భేదాన్ని గమనించాలి. మహాప్రస్థానం లాంటి పుస్తకాల్లో చాలా చోట్ల ప్రౌఢమైన భాష చోటు చేసుకుంది మరి! మొత్తానికి ఈ కాలపు కవిత్వంలో సరళమైన భాషకు పెద్దపీట వేయడం జరుగుతున్నది.
ఆడంబరమైన భాషకు ఆమడ దూరంలో ఉండే కవులలో అమ్మంగి వేణుగోపాల్ ఒకరు. వీరి పాత కవిత్వ పుస్తకాలను పరిశీలిస్తే ఈ సంగతి ధ్రువపడుతుంది. ఈ సంపుటిలో ప్రతిబింబిస్తున్నది కూడా అదే. ఇందులో సంస్కృత పదాలు చాలా అరుదుగా దర్శనమిస్తాయి. తెలుగు సమాసాలు ఎక్కడైనా కనిపిస్తే కనిపించవచ్చు గానీ, సంస్కృత సమాసాలు మాత్రం మరింత తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. కానీ, మహోత్సవం అనే కవిత దీనికి మినహాయింపుగా వుంది. ఈ పంక్తులను పరిశీలించండి:/ కవి పండిత వైతాళిక విద్యార్థి పరివేష్టిత/ తెలంగాణ ప్రాంగణాన కోకిలల తోట ఇది.
ప్రాంతాలను దాటి చీకటి చీల్చిన విద్యావిద్యుత్తు/ ఎన్నో చరిత్ర ఘట్టాలకు సాక్షి పరిణత పరిషత్తు/ ఐతే, ఇది తెలంగాణ సారస్వత పరిషత్తుకు 75 సంవత్సరాలు

నిండిన సందర్భంగా రాయబడిన కవిత కనుక, ఇటువంటి భాషను ఆశ్రయించాల్సివచ్చింది కవికి. కవితా వస్తువుకు నప్పే విధంగా ఉంది కాబట్టి, దీన్ని సందర్భోచితమైన రచనావిధానంగా భావించాలి. ఇతర కవితలలో ఇట్లాంటి భాష కనిపించలేదు. కవి అంతరంగం లోని నిగూఢ అభిప్రాయం కారణంగా ఇట్లాంటి సహజమైన భాష దానంతట అదే బయటికి వచ్చిందో, లేక ఆయన ప్రయత్నపూర్వకంగానే ఆ విధంగా రాశారో కచ్చితంగా చెప్పలేం. కవులు చాలా వరకు, తాము ఏర్పరచుకుని అవలంబించే భాషనే తమ కవిత్వంలో పొందుపరుస్తారు, అప్రయత్నంగా. అంటే, ‘ఈ కవితలో ఈ రకమైన భాషను వాడాలి నేను,’ అని ముందుగానే నిర్ణయించుకోవడం జరగదేమో.

(అమ్మంగి వేణుగోపాల్ గారి కొత్త కవితా సంపుటి, ‘ముఖచిత్రం’కు ఎలనాగ రాసిన ముందుమాటలో కొంత భాగం)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News