Monday, December 23, 2024

అసెంబ్లీకి అస్త్రశస్త్రాలు

- Advertisement -
- Advertisement -

15 నుంచి 20 రోజులు అసెంబ్లీ సమావేశాలు

ఇరకాటంలో పెట్టే భారీ ప్రణాళిక

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 6 గ్యారెంటీలపై, మేడిగడ్డ ప్రాజెక్టుపై భారీ ఫోకస్..

అసెంబ్లీకి విలెజెన్స్ నివేదిక

‘ధరణి’పై దద్దరిల్లనున్న సభ

మన తెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కు రాష్ట్ర ప్రభుత్వం అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తోంది. 2024-25వ ఆర్థ్ధిక సంవత్సరానికి అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌కు అన్ని విభాగాల కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు భారీగా కసరత్తులు చేస్తున్నారు. ము ఖ్యంగా ఆర్థ్ధిక, రెవెన్యూశాఖలతో పాటు పారుదల శాఖ అధికారులు, పోలీస్‌శాఖ అధికారులు ఈ బడ్జెట్ సమావేశాలకు భారీ ఎజెండాను సిద్ధం చేస్తున్నారు. సాధారణ పరిపాలన శాఖ, చీఫ్ సెక్రటరీ కార్యాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు మాత్రం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కనీసం 15 రోజుల నుంచి 20 రోజుల పాటు నిర్వహించాలని, అందుకు తగినట్లుగా ప్రశ్నోత్తరాలు, స్వల్పకాలిక చర్చ లు, దీర్ఘకాలిక చర్చలు జరిపించేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధ్దం చేయాలని భావిస్తున్నారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగినన్ని రోజులూ గత ప్రభుత్వ చర్యల మూలంగా రాష్ట్రంలో జరిగిన కష్టనష్టాలను కూడా కూలంకషంగా చర్చించాలని, అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు గత ప్రభుత్వ చర్యలన్నింటినీ వివరించాలనే లక్షంతో ఎజెండాను రూపొందించనున్నామని వివరించారు. అంతేగాక దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బిఆర్‌ఎస్‌ను మరింతగా ఇరకాటంలో పెట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలు వ్యూ హాత్మకంగా అసెంబ్లీ సమావేశాలను ఒక బ్రహ్మాస్త్రంగా పరిగణిస్తున్నారు. బిఆర్‌ఎస్ పార్టీని అన్ని విధాలుగా ఎండగట్టాల నే లక్షంతో దొరికిన ప్రతి అంశాన్నీ చర్చించి ప్రజల ముం దు వాస్తవాలను పెట్టాలని ప్రభుత్వం సకల ఏర్పా ట్లు చేస్తోందని అధికారులు వివరించారు. అందుకు తగినట్లుగా మంత్రిత్వశాఖల వారీగా, ఆయా సబ్జెక్టులపై, అసెంబ్లీలో చర్చకు రానున్న వివాదాస్పదమైన అంశాలపై మంత్రులకు ఇప్పట్నుంచే సమగ్రమైన అవగాహన కల్పించే కార్యక్రమాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే చివరకు ఆదివారాల్లాంటి సెలవు రోజుల్లో కూడా మంత్రులు ఠంఛన్‌గా సెక్రటేరియేట్‌కు చేరుకొని తమతమ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు జరుపుతున్నారని వివరించారు.

ఇప్పటివరకూ మంత్రులకు పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ప్రాథమిక సమాచారం మాత్రమే తెలుసునని, ఇప్పుడు శాఖల వారీగా జరుపుతున్న సమీక్షల్లో ఆయా అంశాలపైన, మంత్రిత్వశాఖల్లోని సాంకేతికపరమైన అంశాలపైన కూడా మంత్రులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. మొత్తంమీద రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మాత్రం మునుపెన్నడూ లేనంతటి వాడీవేడిగా జరగనున్నాయని వివరించారు. దీంతోపాటుగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రముఖంగా ప్రచారం చేసిన ధరణి పోర్టల్, మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిన ఘటన, గత ప్రభుత్వం చేసిన అప్పులు, సాధించిన ప్రగతి… తదితర అంశాలపైన అసెంబ్లీలో ప్రభుత్వ పక్షానికి, ప్రతిపక్షానికి మధ్య మాటల యుద్దం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ అధికారులు వివరించారు. అంతేగాక ధరణి పోర్టల్ చట్టానికి సంబంధించిన సవరణ బిల్లులను కూడా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని, ధరణి పోర్టల్‌లోని లోపాలపై అధ్యయనం చేస్తున్న కమిటీ నివేదిక కూడా ఫిబ్రవరి నెలాఖరులోగా వస్తుందని, ఇప్పటికే ధరణి పోర్టల్‌లో 119 లోపాలున్నట్లుగా గుర్తించిన కమిటీ, ఆ లోపాలను సరిదిద్దేందుకు వీలుగా రెవెన్యూ చట్టంలో మార్పులు చేర్పులు చేసి మరింత బలోపేతంగా చట్టాన్ని తీసుకురావాలని, అందుకు తగినట్లుగా చట్ట సవరణలతో కూడిన రెండు బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని, ఈ మేరకు రెవెన్యూశాఖ అధికారులు తీవ్రస్తాయిలో కసరత్తులు చేస్తున్నారని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. ధరణి పోర్టల్ మూలంగా భూములను కోల్పోయిన రైతులు కాంగ్రెస్ పార్టీ నేతలకు అందించిన ఫిర్యాదులపైన కూడా అసెంబ్లీలో చర్చలు జరుగుతాయని, అందుకు తగినట్లుగా ధరణి బాధితుల ఫిర్యాదుల సారాంశాన్ని కూడా అసెంబ్లీ వేదికగా చేసుకొని రాష్ట్ర ప్రజలకు వివరించనున్నామని ఆ అధికారులు వివరించారు.

అంతేగాక రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిన ఘటనపైన మాత్రం అసెంబ్లీలో వాదప్రతి వాదనలతో మార్మోగిపోనుందని, ఆ ప్రాజెక్టుపైన వాస్తవాలను దాచిపెట్టినట్లుగా వచ్చిన ఆరోపణలు, కేంద్ర ప్రభుత్వ డ్యాంసేఫ్టీ విభాగం ఇచ్చిన నివేదిక, రాష్ట్ర విజిలెన్స్ శాఖ ఇవ్వబోయే నివేదిక, కాంట్రాక్టర్‌తో అప్పటి అధికారుల లాలూచీలు, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఇచ్చిన వాంగ్మూలాలు… ఇలా ఒక్కటేమిటీ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణాలైన సమస్త అంశాలన్నీ అసెంబ్లీలో చర్చకు వస్తాయని, అంతేగాక మేడిగ్డ ప్రాజెక్టుపై ప్రభుత్వం అసెంబ్లీలో ఒక ప్రకటన కూడా చేస్తుందని, అందుకు తగినట్లుగా భారీగా కసరత్తులు జరుగుతున్నాయని వివరించారు. అంతేగాక మేడిగడ్డ ప్రాజెక్టు ఘటనపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు డిమాండ్ చేయడమే కాకుండా చివరకు హైకోర్టు కూడా జోక్యం చేసుకొని సిబిఐని వివరణ కోరిందని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తుకు ఎందుకివ్వడం లేదనే అంశాలను కూడా అసెంబ్లీలో వివరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ అధికారులు వివరించారు.

గత ప్రభుత్వం చేసిన అప్పులు, అప్పు చేసిన తెచ్చిన నిధులను ఎలా ఖర్చు పెట్టారో, ఖర్చు చేసిన నిధుల మూలంగా ఎలాంటి ప్రయోజనం జరిగిందోననే అంశాలపైన కూడా చర్చలు జరిపిన తర్వాత ఒక అధికారిక ప్రకటనను కూడా జారీ చేసేందుకు వీలుగా ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పేపర్ల లీకేజీలు, ఆ లీకేజీల వెనుకనున్న దోషులు, లీకేజీలపై జరిగిన దర్యాప్తులపైన కూడా ఒక నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనికితోడు లక్షలాది మంది నిరుద్యోగులుకు చల్లని తీపి కబురు చెప్పే విధంగా అసెంబ్లీలో ప్రత్యేక ప్రకటన ఉంటుందని, ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి ఏయే శాఖల్లో ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో వాటన్నింటినీ భర్తీ చేయడానికి జాబ్ నోటిఫికేషన్ల షెడ్యూలును కూడా ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వివరించారు.

ప్రతిపక్ష పార్టీలు చేసిన విమర్శలన్నింటికీ కూడా అసెంబ్లీ వేదికగా ఘాటైన సమాధానాలు చెప్పాలని కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అస్త్రశస్త్రాలు సిద్దంచేస్తోందని తెలిపారు. ఇక ఆరు గ్యారెంటీల అమలు చేసిన వైనాన్ని, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా అమలు చేసిన నిజాయితీ కలిగిన రాజకీయ పార్టీగా, ప్రజలకిచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోయినట్లుగానే ఆరు గ్యారెంటీలపైన కూడా ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకొన్న పార్టీగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందనే మెసేజ్‌ను పంపించేందుకు వీలుగా ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News