Friday, November 15, 2024

కోచింగ్ సెంటర్ల ఫీజుల మోత…

- Advertisement -
- Advertisement -

నోటిఫిషన్ రావడంతో శిక్షణ బాట పట్టిన నిరుద్యోగులు
అదే అవకాశంగా భావించిన భారీగా వసూలు చేస్తున్న కోచింగ్ సెంటర్లు
పేద, మధ్యతరగతి యువతకు గ్రంథాలయాలే దిక్కు

Amount of fees for coaching centers

మన తెలంగాణ,సిటీబ్యూరో: ప్రభుత్వం ఉద్యోగాల తొలి నోటిఫికేషన్ రావడంతో నిరుద్యోగ యువత ఆసారి ఉద్యోగం సాధించాలనే లక్షంతో సమీపంలో ఉన్న కోచింగ్ సెంటర్లకు వెళ్లి శిక్షణ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా 30వేల పోస్టులకు నోటిఫికేషన్ రావడంతో కోచింగ్ సెంటర్ల వద్దకు వెళ్లి గ్రూప్-1, పోలీసు ఉద్యోగాల కోసం శిక్షణ ఫీజుల వివరాల అడిగితే గ్రూపు-1కు రూ. 75వేలు, పోలీసు ఉద్యోగాలకు రూ .25వేలకు పైగా ఉన్నట్లు చెప్పడంతో నిరుద్యోగులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి యువతీ,యువకులు కోచింగ్ వెళ్లాలంటే భయపడుతున్నారు. గతంలో పోలీసు కోచింగ్‌కు వెళ్లితే రూ. 12వేలు వసూలు చేసేవారు. ప్రస్తుతం పెరిగిన అధిక ఫీజుల దెబ్బకు నిరుద్యోగులు గ్రంథాయాలకు వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుతున్నట్లు వెల్లడిస్తున్నారు.

సీనియర్ల ఫ్యాకల్టీలు, స్టడీ మెటిరియల్ వంటి నాణ్యమైనవి తమ సంస్దలో ఉంటాయని నిరుద్యోగులకు భ్రమలు కల్పిస్తూ అక్రమంగా దండుకుంటున్నారని మండిపడుతున్నారు. నగరంలో పలు సంస్దలు ఒక సంస్ద పేరుతో ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని నాలుగైదు బ్రాంచీలు ఏర్పాట్లు చేస్తున్నారని, ఇష్టానుసారంగా ఫీజుల వసూలు చేసే సంస్దలను నియంత్రించే అధికారులు లేకపోవడంతో వారు చెప్పిదే వేదం అన్నట్లుగా మారిందని నిరుద్యోగులు చెబుతున్నారు. మహానగరంలో సుమారుగా 230 వరకు కోచింగ్ సెంటర్లు ఉన్నట్లు, ఆర్టీసీ క్రాస్‌రోడ్, అశోక్‌నగర్, చిక్కడపల్లి, కూకట్‌పల్లి, అమీర్‌పేట, దిల్‌షుక్‌నగర్, ఉప్పల్, తార్నాక, నల్లకుంట, విద్యానగర్ వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తూ నిరుద్యోగులను ఆకట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు 91,142 ఖాళీలుండగా వాటిలో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తుండగా, 30, 453 ఉద్యోగాలకు బుధవారం నోటిఫికేషన్ వెలువడింది.

ఈఉద్యోగాలకు సుమారుగా 10లక్షల మంది పోటీ పడుతున్నారని కోచింగ్ సెంటర్ల నిర్వహకులు భావిస్తున్నారు. గత పది రోజుల నుంచి నగరంలో పలు గ్రంథాలయాలు నిరుద్యోగులతో సందడిగా మారాయి. నగరంలో అప్జల్‌గంజ్‌లో ఉన్న కేంద్ర లైబ్రరీకి రోజుకు వందలాది మంది నిరుద్యోగుల వెళ్లి కావాల్సిన బుక్స్ తీసుకుని గంటల తరబడి చదువుతున్నారు. కోచింగ్ సెంటర్లు ఉన్న ప్రాంతాల్లో రూ. 5 బోజనంకు గిరాకీ పెరిగింది, మధ్యాహ్నం వేళ గంట పాటు క్యూ లైన్ కనిపిస్తుంది. ఈబోజనం పేద, మధ్యతరగతి ప్రజల ఆకలి తీర్చుతుంది.

కోచింగ్ సెంటర్ల అధిక వసూలపై ప్రభుత్వం నిఘా పెట్టాలి: విద్యార్థి సంఘాలు

నగరంలో పలు కోచింగ్ సెంటర్ల నిర్వహకులు సిండికేట్‌గా మారిన ఫీజులు ఇష్టానుసారంగా పెంచుతున్నారని విద్యార్థిసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రూ. 75వేల నుంచి 25వేల వరకు వసూలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పేద విద్యార్థులకు గ్రంథాలయాలే దిక్కుగా మారాయంటున్నారు. అడ్డగోలుగా నిరుద్యోగులను పీడించి వసూలు చేసే కోచింగ్ సెంటర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News