Monday, December 23, 2024

రణరంగంగా అమృత్‌సర్ అజ్నాలా..

- Advertisement -
- Advertisement -

అమృత్‌సర్ : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఖలీస్థాన్ కలకలం చెలరేగి ఈ సిక్కుల పవిత్ర స్థలం రణరంగం అయింది. స్థానిక అజ్నాలా పోలీసుస్టేషన్ వద్ద వారిస్ పంజాబ్ దే అనుచరులు వందలాది మంది కత్తులు, తుపాకులు పట్టుకుని పోలీసు బారికేడ్లను తొలిగించుకుంటూ ముందుకు సాగారు, ఈ దశలో వారిని అడ్డుకునేందుకు యత్నించిన ఆరుగురు పోలీసులు గాయపడ్డారు, వీరిని చికిత్సకు తరలించారు. తనకు తాను ఖలీస్థాన్ నేతగా ప్రకటించుకుని చలామణిలో ఉన్న నేత అమృత్‌పాల్ సింగ్ అత్యంత సన్నిహితుడు లవ్‌ప్రీత్ తూఫాన్‌ను అరెస్టు చేసి అజ్నాలా పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీనితో తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అయింది. హింసాత్మక ఘటనలు జరిగాయి. లవ్‌ప్రీత్‌ను ఠాణా నుంచి విడిపించుకుని పొయ్యేందుకు అమృత్‌పాల్ సింగ్ మద్దతుదార్లు సాయుధులై తరలిరావడం తీవ్ర భయానక స్థితికిదారితీసింది.

ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను తరలించారు. అక్కడనే తిష్ట వేసుకుని ఉన్న నిరసనకారులను అదుపులోకి తెచ్చేందుకు వారిని అక్కడి నుంచి పంపించేందుకు గంటల తరబడి కృషించాల్సి వచ్చింది. తన అనుచరుడిపై రాజకీయ దురుద్ధేశాలతోనే తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేశారని, వీటిని దీనిని గంటలో ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అమృత్ పాల్ సింగ్ హెచ్చరించారు. తాము శాంతియుత పద్థతిలోనే ఖలీస్థాన్ వాదనను విన్పిస్తున్నామని, కొందరు హిందూ దేశం కావాలని కోరుతున్నప్పుడు తాము ఖలీస్థాన్ కావాలని ఎందుకు డిమాండ్ చేయకూడదని ప్రశ్నించారు. సింగ్ ఆయన మద్దతుదార్లు ఐదుగురిపై ఇటీవల కిడ్నాప్, చోరీ, ఘర్షణ, గాయపర్చడం, చట్టవ్యతిరేకంగా గుమికూడటం వంటి అభియోగాలతో కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తిని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. మద్దతుదారుడిని విడిపించుకునేందుకు ఠాణాపై దాడికి సింగ్ వర్గీయులు యత్నించారు.

ఉద్రిక్తతల నడుమనే అమృత్‌పాల్ సింగ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ తీవ్రస్థాయి వ్యాఖ్యలకుదిగాడు, ఖలీస్థాన్ ఉద్యమాన్ని కాదనందుకు అప్పట్లో ఇందిరా గాంధీనే మూల్యం చెల్లించుకోవల్సి వచ్చిందని, తమను మోడీ, అమిత్ షా, భగవంత్ మాన్ ఎవరూ ఆపలేరని అన్నారు. తనపైనా తన మద్దతుదార్లపైనా ఆరోపణలు కేసులు దురుద్ధేశపూరితం అన్నారు. పాకిస్థాన్‌కు సరిహద్దులకు సమీపంలోనే ఉన్న అమృత్‌సర్ శివారు ప్రాంతం అజ్నాలాలో గంటలకొద్ది కొనసాగిన ఉద్రిక్తతలు ఆందోళనకు దారితీశాయి. కేసుకు సంబంధించి అమృత్‌పాల్ ఇతరులను పోలీసులు అరెస్టు చేయాల్సి ఉంది. సింగ్ మాజీ అనుచరుడు వారిందర్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిపై కేసులు నమోదు అయ్యాయి. తనను సింగ్ ఆయన సాయుధ వ్యక్తులు అపహరించుకుని వెళ్లి బాగా కొట్టారని వారిందర్ తన ఫిర్యాదులో తెలిపాడు.

ఇప్పుడు ప్రముఖ ఖలీస్థానీ వాదిగా పేరొందిన అమృత్‌పాల్ సింగ్ ఇంతకు ముందు సామాజిక హక్కుల నేత దీప్ సిద్ధూ ఏర్పాటు చేసిన వారిస్ పంజాబ్ దేకు అధినేతగా ప్రకటించుకున్నాడు. దీప్ సిద్ధూ గత ఏడాది ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. అమృత్‌పాల్ సింగ్ తన తీవ్రస్థాయి వ్యాఖ్యలతో తరచూ వివాదాస్పదుడు అయ్యాడు. ఓ సారి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కూడా ఇందిరా గాంధీ గతి పడుతుందని చెప్పడంపై పంజాబ్ బిజెపి భగ్గుమంది. పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం ఇటువంటి శక్తులను రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రేరేపిపస్తోందని బిజెపి అప్పట్లో నిరసలకు దిగింది,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News