Monday, December 23, 2024

అమృత్‌పాల్ సింగ్ ఆటకట్టు

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ : చాలారోజుల పాటు పంజాబ్ పోలీసులకు చక్కర్లు కొట్టించి తిరుగుతున్న ఖలీస్థానీ వాది అమృత్‌పాల్ సింగ్ ఎట్టకేలకు ఆదివారం అరెస్టు అయ్యారు. పంజాబ్‌లోని మోగారోడే గ్రామంలో తెల్లవారుజామున పోలీసుల వలలో చిక్కారు. రోడే ఖలీస్థానీ నేత భింద్రన్‌వాలే స్వగ్రామం. ఇక్కడనే ఇప్పుడు అమృత్ పాల్‌ను పట్టుకున్నారు. దీనితో నెలరోజులకు పైగా స్థానిక అధికార యంత్రాంగానికి కంటినిండా కునుకు లేకుండా చేస్తున్న ఈ తీవ్రవాద మతప్రచారకుడి ఆటకట్టయింది. తనకు తాను మునుపటి ఖలీస్థానీ నేత జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేను అని చెప్పుతూ తిరుగుతున్న అమృత్‌పాల్ తాను అరెస్టు కాలేదని, తానే సరెండర్ అయ్యానని ఇప్పుడు చెపుతున్నా దీనిని పోలీసు అధికారులు తోసిపుచ్చారు. తాముసాగించిన పట్టువదలని వేటలో చిక్కుపడ్డాడని తెలిపారు. భింద్రన్‌వాలే స్వగ్రామం అయిన రోడేలో ఓ గురుద్వారా నుంచి బయటకు రాగానే తెల్లవారుజాము 6.45 ప్రాంతంలో పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు.

ఈ సమయంలో ఆయన సిక్కు సంప్రదాయపు దుస్తులలో నడుమున పొడవాటి కత్తితో ఉన్నారు. ఈ గురుద్వారాలోనే ఆయన గత ఏడాది క్రితం తనకు తాను వారిస్ పంజాబ్ దే అధినేతగా ప్రకటించుకున్నారు. తాను భింద్రన్ వారసుడినని తెలియచేసుకుని తన కార్యకలాపాలు సాగిస్తూ వచ్చారు. 29 సంవత్సరాల అమృత్‌పాల్ సింగ్‌ను ఇప్పుడు కటుతరమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) పరిధిలో అదుపులోకి తీసుకున్న తరువాత నిబంధనల ప్రకారం వెంటనే ప్రత్యేక విమానంలో అసోంలోని దిబ్రూఘర్ జైలుకు భద్రతా ఏర్పాట్ల మధ్య తరలించారు. ఈ జైలులోని ఆయన సన్నిహితులు తొమ్మండుగురిని వేర్వేరు చోట్ల అరెస్టు చేసి ఉంచారు. అరెస్టు తరువాత కొద్ది సేపటికి అమృత్‌పాల్ పేరిట ఆన్‌లైన్‌లో ఓ వీడియో వెలువడింది. ఇందులో తాను సరెండర్ అవుతున్నట్లు ఆయన తెలిపారు. ఇందులోనే ఆయన భింద్రన్‌వాలస్త్రకు సంబంధించిన ఓ స్వల్పకాలిక దృశ్యాన్ని పొందుపర్చారు. 1984లో అమృత్‌సర్‌లోని స్వర్ణాలయం నుంచి భింద్రన్‌వాలేను వెలికి రప్పించుకునేందుకు జరిగిన వివాదాస్పద సైనిక చర్య ప్రస్తావన కూడా ఉంది.

అమృత్‌పాల్ సరెండర్ అయినట్లు చెప్పడాన్ని పంజాబ్ ఐజిపి సుఖ్‌చైన్ సింగ్ గిల్ ఖండించారు. ఆయన అదే చెపుతాడని, ఈ ఫరారీ వ్యక్తిని తాము తమ బలగాల సాయంతో దిగ్బంధించి పట్టుకున్నామని వివరించారు. అమృత్‌సర్ పోలీసులు, ఇంటలిజెన్స్ విభాగం కలిసి సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ క్రమంలో ఈ అరెస్టు జరిగిందని తెలిపారు. గ్రామాన్ని ముందుగా అన్ని వైపులా చట్టుముట్టి తరువాత ఈ వ్యక్తిని దిగ్బంధించి పట్టుకున్నామని ఐజి తెలిపారు. పోలీసులు గురుద్వారాలోపలికి ప్రవేశించలేదన్నారు. గురుద్వారా పవిత్రత కాపాడటం ప్రధాన అంశం అని, యూనిఫాంలతో పోలీసులు లోపలికి ప్రవేశించరాదనే చాలా సేపు బయటనే పొంచి ఉండి ఆయనను కార్నర్ చేసినట్లు తెలిపారు. తాము ఆయనను చుట్టుముట్టామని, తప్పించుకునే యత్నాలకు దిగరాదని మైక్‌లలో తెలిపామని, దీనితో తమ బలగాలకు దొరికినట్లు చెప్పారు. ఇక ఆదివారం ఉదయమే ఈ ఉగ్ర మత ప్రచారకుడికి వ్యతిరేకంగా ఎన్‌ఎస్‌ఎ వారంట్లు కూడా వెలువడ్డాయి. ఈ క్రమంలో వీటిని అమలు చేసి తదనుగుణంగానే వారంట్లను అమలు చేయడం జరిగిందని, ఇక చట్టం తదుపరి పనిని చేసుకుంటూ పోతుందని ఐజి వివరించారు.

అమృత్‌పాల్ వేటలో ప్రజలను వేధించారు :
అకల్‌తక్త్ మాజీ జాతేదారు జస్బీర్ సింగ్ రోడే
గత నెలరోజులుగా పంజాబ్ పోలీసులు దురాగతాలకు పాల్పడ్డారని, అమృత్‌పాల్ వేట పేరిట సామాన్య ప్రజలను హింసించారని అకల్‌తక్త్ మాజీ అధినేత జస్బీర్ సింగ్ రోడే ఆరోపించారు. తాను ఇటీవలే అమృత్‌పాల్‌ను కలిసినట్లు, సరెండర్‌కు ఆయన సిద్ధమైనట్లు చెప్పారని , తలపాగా ధారణకు ఇక్కడికి వచ్చాడని వివరించారు. అమృత్‌పాల్‌ను అరెస్టు చేయడం కన్నా ప్రజలను వేధించడంపైనే భద్రతా సిబ్బందికి ఆసక్తి ఉందని తాను గమనించానని, తాను సరెండర్ అవుతున్నట్లు, అయితే ఇది అంతం కాదు ఆరంభం అని ఆయన తనతో చెప్పినట్లు జస్బీర్ సింగ్ తెలిపారు. భగవంతుడి న్యాయస్థానంలో తాను నిర్దోషినని కూడా చెప్పినట్లు పేర్కొన్నారు. అమృత్‌పాల్ అరెస్టు విషయంలో కోరి ఉంటే తాను పోలీసులకు పూర్తిగా సహకరించేవాడినని చెప్పారు.
అమృత్‌పాల్ గత ఏడాది దుబయినుంచి వచ్చి వారిస్ పంజాబ్ దే సారధ్య బాధ్యతలను తీసుకుని తనకు తాను ఖలీస్ధానీనేతగా ప్రకటించుకున్నారు.

పంజాబీ యువతను మాదకద్రవ్యాల బారి నుంచి కాపాడటం, వారి ఆత్మస్థయిర్య పరిరక్షణ తమ ప్రధాన ఉద్ధేశాలని ప్రకటించుకున్న పాల్ అచిరకాలంలోనే అత్యధిక సంఖ్యలో అనుచరులను సంపాదించుకున్నారు. ఆయన తప్పించుకున్న దశలో పలువురు సన్నిహితులను అదుపులోకి తీసుకోవడం , రెండు మూడు రోజుల క్రితమే అమృత్‌పాల్ భార్య, బ్రిటన్‌కు చెందిన యువతి రణదీప్ కౌర్ లండన్‌కు వెళ్లకుండా అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకోవడం వంటి పరిణామాల తరువాత అమృత్‌పాల్ అరెస్టు జరిగింది. అమృత్‌పాల్‌ను అరెస్టు చేసి వెంటనే భటిండాలోని భారతీయ వాయుసేన స్థావరానికి తరలించారు. అక్కడి నుంచి విమానంలో అసోంకు పంపించారు. దిబ్రూఘర్‌కు ఆయన చేరినట్లు పోలీసులు ధృవీకరించుకున్నారు.

రాత్రంతా నిద్రపోని
పంజాబ్ సిఎం భగవంత్
అమృత్‌పాల్ సింగ్ అరెస్టు తరువాత కొద్ది సేపటికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తరఫున ఓ వీడియో సందేశం వెలువడింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు, సామరస్యం పట్ల భంగకరంగా వ్యవహరించే వారు ఎంతటివారైన వదిలేది లేదని, చట్టప్రకారం వారిని శిక్షించడం జరుగుతుందని ఇందులో తెలిపారు. అమాయక సాధారణ పౌరుల పట్ల అరాచకాలకు దిగితే సహించేది లేదన్నారు. శనివారం రాత్రి నుంచే మాన్ ఈ ఖలీస్థానీవాది పట్టివేత విషయంపై వరుసగా పోలీసు ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వచ్చారు. పరిస్థితిని సమన్వయం చేసుకుంటూ ఉన్నారు. తాను రాత్రంతా నిద్రపోలేదన్నారు. ప్రస్తుత క్రమంలో భద్రతాబలగాలకు ప్రజల నుంచి పూర్తి సహకారం అందిందని ఇందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానని తెలిపారు. స్వార్థశక్తుల దుష్రచారాలకు ప్రజలు ప్రత్యేకించి యువత లొంగిపోరాదని, ఇటువంటి శక్తులను దూరంగా ఉంచాలని కోరారు. దేశానికి వ్యతిరేకంగా ప్రచారంచేస్తూపబ్బం గడుపుకునే వారు ప్రజలను పక్కదోవ పట్టిస్తూ ఉంటారన్నారు. సారవంతమైన సామరస్యపు నేలగా పంజాబ్‌కు మంచి పేరుంది.

ఇక్కడ ఏదైనా పండుతుంది. అయితే విద్వేషపు గింజలు మొలకెత్తరాదు. మొలకెత్తనిచ్చేది లేదన్నారు. రక్తపాతం కాకూడదనే ఆలోచనతోనే అమృత్‌పాల్‌ను అత్యంత జాగ్రత్తగా పట్టుకున్నట్లు, ఈ క్రమంలోనే ఈ జాప్యం జరిగినట్లు సిఎం వివరించారు. అమృత్‌పాల్ ఉనికి గురించి తమకు శనివారం సరైన సమాచారం అందిందని, దీనితో వెంటనే తాను పోలీసు ఉన్నతాధికారులతో కలిసి నిద్రకు కూడా ఉపక్రమించలేదని, ప్రతి 15 నిమిషాలకోసారి వారితో మాట్లాడినట్లు తెలిపారు. అరెస్టు ప్రక్రియ పూర్తిగా శాంతియుతంగా జరగాలని తాను ఆదేశించినట్లు చెప్పారు. ఆపరేషన్ అమృత్‌పాల్ అనుకున్న విధంగా పూర్తయిందని, అవాంఛనీయ ఘటనలేమి జరగలేదని , పంజాబ్ పూర్తి స్థాయిలో మరింత అభివృద్ధి చెందేందుకు నిరంతరం తాము పాటుపడుతూనే ఉంటామని, కంట్లో నలుసులను ఏరివేస్తూ వెలుగు దిశకు సాగుతామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News