అమృత్‌సర్‌లో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఒక ఆలయం వెలుపల విస్ఫోటం సంభవించిందని, మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఒక వ్యక్తి ఆలయంపైకి ఒక పేలుడు వస్తువు విసిరాడని, దానితో గోడలో కొంత భాగం, అద్దాలు ధ్వంసమయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనలో ఎవ్వరూ గాయపడలేదు. కానీ, అమృత్‌సర్ ఖండ్వాలా ప్రాంతం వాసులు భయాందోళనలకు గురయ్యారు. గడచిన నాలుగు మాసాల్లో అమృత్‌సర్, గురుదాస్‌పూర్‌లలో పోలీస్ లు లక్షంగా అనేక పేలుడు సంఘటనలు జరిగాయి. కానీ ఒక ఆలయంపై అటువంటి దాడి జరగడం ఇదే మొదటిసారి. కాగా, ఆప్ ప్రభుత్వం కింద ‘క్షీణిస్తున్న’ శాంతి భద్రతలను ఈ సంఘటన ప్రతిబింబిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఠాకూర్ ద్వార్ ఆలయం అర్చకుడు శనివారం తెల్లవారు జామున సుమారు 2 గంటలకు ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ గురుప్రీత్ సింగ్ భుల్లార్ తెలియజేశారు. ఈ ఘటనపై సిసిటివి ఫుటేజ్ ప్రకారం, గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఒక మోటార్‌సైకిల్‌పై ఆలయం వద్దకు వచ్చారు. కొన్ని సెకన్ల పాటు వేచి ఉన్న తరువాత వారిలో ఒకడు ఆలయం వైపు ఏదో పేలుడు వస్తువు విసిరాడు. ఆతరువాత వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు.
పేలుడులో ప్రమేయం ఉన్న వ్యక్తుల ఆచూకీ తీయడానికి పోలీస్ బృందాలు ప్రయత్నిస్తున్నాయని, వారిని త్వరలోనే పట్టుకోగలమని భుల్లార్ చెప్పారు.‘మా బృందాలు వారిని వెంటాడుతున్నాయి. గతంలోని ఘటనలలోని వారి ఆచూకీ తీసినట్లుగానే ఈ ఘటనలో కూడా ఆచూకీ తీస్తాం’ అని ఆయన తెలిపారు. విస్ఫోటంలో వాడిన వస్తువును గుర్తించేందుకు ఒక ఫోరెన్సిక్ బృందం ఆ ప్రదేశంలో నుంచి నమూనాలు సేకరించినట్లు ఆయన తెలియజేశారు. ‘ఈ ఘటనలో పాత్ర ఉన్నవారిని కఠిన చర్యకు గురి కాగలరని నేను హెచ్చరించదలిచాను’ అని భుల్లార్ చెప్పారు. పంజాబ్‌లో కల్లోలం సృష్టించేందుకు ఎప్పటికప్పుడు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ రాష్ట్ర పోలీసులు అటువంటి శక్తులపై సకాలంలో చర్య తీసుకున్నారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పష్టం చేశారు. ‘శాంతి భద్రతల పరంగా పంజాబ్ పూర్తిగా సురక్షితంగా ఉంది’ అని మాన్ విలేకరులతో చెప్పారు. పరస్పర సోదరభావాన్ని, శాంతిని రాష్ట్రంలో పరిరక్షించనున్నట్లు మాన్ చెప్పారు. ఇది ఇలా ఉండగా, ఈ సంఘటన అనంతరం ఆప్ ప్రభుత్వంపై కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీ దళ్ తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించాయి.