న్యూస్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీని కొత్త జాతిపితగా అభివర్ణించి మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత్యా ఫడ్నవీస్ వివాదంలో చిక్కుకున్నారు. బుధవారం నాగపూర్ విధాన సభలో ఎంవిఎనాయకులు ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడగా మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పడోలె, కాంగ్రెస్ నాయకుడు యశోమతి ఠాకూర్, ఇతర నాయకులు అమృతా ఫడ్నవీస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నాగపూర్‌లో జరిగిన రచయితల సంఘం సభలో పాల్గొన్న అమృతా ఫడ్నవీస్ ఆ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీని జాతిపితగా సంబోధించారు.
మరి జాతిపితగా దేశప్రజలందరూ పిలుచుకునే మహాత్మా గాంధీ మాటేమిటని ఆమెను ప్రశ్నించగా మహాత్మా గాంధీ జాతిపితని, మోడీ నవ భారత పిత అంటూ ఆమె అభివర్ణించారు. దేశానికి ఇద్దరు పితలు ఉన్నారని, ఒకరు నాటి తరానికి చెందినవారైతే మరొకరు నేటి తరానికి చెందిన వారని మరాఠీలో ఆమె బదులిచ్చారు. నరేంద్ర మోడీని ఆకాశానికెత్తేయడం అమృతా ఫడ్నవీస్‌కు కొత్తేమీ కాదు. 2019లో ప్రధాని మోడీకి ట్విటర్ వేదికగా ఒక సందేశాన్ని పంపుతూ… జాతిపిత నరేంద్ర మోడీజీకి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఆమె పేర్కొన్నారు.