Monday, December 23, 2024

అంశాల స్వామి హఠాన్మరణం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/మర్రిగూడ: ఫ్లోరోసిస్ వి ముక్తి పోరాట సమితి ఉద్యమ నాయకుడు అంశాల స్వామి(37) శనివారం ఉదయం కన్నుమూశారు. రాబోయేతరాలు ఫ్లోరోసిస్ భారిన పడకుండా ఉండేందుకు చిన్న వయస్సులోనే దేశ రాజధానిలో ఢిల్లీలో అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయిని కలిసి ఫ్లోరోసిస్ సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారు. తన జీవితమంతా ఫ్లోరోసిస్ నివారణ కోసమే ఉద్యమించారు.సుమారు మూ డు దశాబ్దాల పాటు అనేక పోరాటాలు చేశా రు.

నల్గొండ జిల్లాకు మిషన్ భగీరథ నీళ్లు, శివన్నగూడెం ప్రాజెక్టు సాధనలోనూ కీలక భూమిక పోషించాడు. శుక్రవారం ఉదయం తన ట్రై సైకిల్‌పై నుంచి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలుకావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామంలో అంశాల సత్యనారాయణ, వెంకటమ్మ దంపతులకు నలుగురు సంతానం. వీరిలో మొదటి సంతానం అంశాల స్వామి. ప్లోరోసిస్‌తో బాధపడుతునే ఆయన జీవితమంతా ఫ్లోరోసిస్ రోగ గ్రస్తుల కోసం ఎంతగానో తాపత్రయపడ్డారు. ఈయన అకాలమరణంతో నల్లగొండ జిల్లాతోపాటు యావత్ తెలంగాణ చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

సిఎం కెసిఆర్ సంతాపం
ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం తన జీవిత కాలం పోరాడిన అంశాల స్వామి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సామాజిక సమస్యగా మారిన ఫ్లోరోసిస్ పేరు గుర్తుకు రాగానే తక్షణమే గుర్తుకు వచ్చిన మరో పేరు అంశాల స్వామి..అని సిఎం గుర్తుకు చేసుకున్నారు. మానవీయ కోణాన్ని తట్టి లేపుతూ తెలంగాణ ఉద్యమంలో అంశాల స్వామి చేసిన పోరాటం ఎందరికో స్పూర్తిదాయకంగా నిలిచిందన్నారు. స్వరాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారా, ఫ్లోరోసిస్ రహిత శుద్ది చేసిన స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే దృఢ సంకల్పానికి, ప్లోరోసిస్ బాధితులైన అంశాల స్వామి వంటి వారే ప్రేరణగా నిలిచారని అని సిఎం తెలిపారు. అంశాల స్వామి మరణం బాధాకరమని విచారం వ్యక్తం చేసారు. వారి కుటుంబసభ్యులకు సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ట్విట్టర్ వేదికగా కెటిఆర్ సంతాపం
ఫ్లోరోసిస్ నివారణ, బాధితుల కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు అంశాల స్వామి అని, ఆయనెంతో మందికి ప్రేరణ అని రాష్ట్ర మంత్రి కెటిఆర్ తన సంతాపాన్ని ప్రకటించారు. కాగా, మూడు నెలల క్రితం స్వామి ఇంటికెళ్లిన కెటిఆర్.. ఆయనతో కలిసి భోజనం చేశారు. స్వయంగా స్వామికి భోజనం ఒడ్డించారు. జీవనోపాధి కోసం ఆయనకు సెలూన్ కూడా ఏర్పాటు చేయించారు. స్వామికి మంత్రి కెటిఆర్ ఇల్లు కట్టించిన విషయం తెలిసిందే. కాగా, సాయంత్రం స్వామి అంత్యక్రియలు గ్రామంలో జరిగాయి. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్వామి పార్థివ దేహానికి నివాళులర్పించి రూ.50వేల ఆర్థిక సాయం అందించారు. అంతిమయాత్రలో స్వామి పాడెను సైతం ఎంఎల్‌ఎ మోశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News