Friday, December 20, 2024

కన్నడ ‘పాల’లో ‘కషాయం’

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కన్నడనాట తాజాగా అమూల్ పాల ప్రవేశం రాజకీయ పార్టీల మధ్య రాజకీయ వివాదాన్ని రాజేస్తోంది. బెంగళూరు రిటైల్ మార్కెట్లో తమ పాలు, పెరుగు అమ్మకాలనుప్రారంభిస్తున్నట్లు ఈనెల ప్రారంభం లో గుజరాత్‌కు చెందిన అమూల్ సంస్థ ప్రకటించినప్పుడు ఇది ఎక్కడికి దారి తీస్తుందనే విషయాన్ని రాజకీయ పార్టీల కానీ, టీవీ న్యూస్ చానళ్లు కానీ పెద్దగా అంచనా వేయలేకపోయాయి. కొద్ది రోజలు తర్వాత వాళ్లంతా కళ్లు తెరిచే సరికి ఇది కేవలం కర్నాటకపాల సహకారసమాఖ్య(కెఎంఎఫ్), దాని బ్రాండ్ నందినిని, గుజరాత్‌కు చెందిన పాల సహకార సంఘం అమూల్‌లో విలీనం చేసేందుకు మరో అడుగు అనే విషయమై ఊహాగానాలుగా మాత్రంగానే ఉండింది.

అమూల్ బెంగళూరు పాలు, పెరుగు రిటైల్ మార్కెట్లోకి అడుగు పెట్టడం అంటే నందినిని ఫినిష్ చేయడమేనంటూ ఓ వైపు క్షేత్రస్థాయిలో కన్నడ అనుకూల సంఘాలు అమూల్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తుండగా, కాంగ్రెస్, జెడి(ఎస్)కు చెందిన ప్రతిపక్ష రాజకీయ నేతలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు దీన్ని కన్నడ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా మార్చి వేయడంతో అధికార బిజెపి పరిస్థితి కుడితలో పడ్డ ఎలుకలాగా మారిపోయింది. మార్కెట్లో ఎన్నో ఇతర బ్రాండ్‌లు ఉండగా అమూల్‌కు వ్యతిరేకంగా మాత్రమే ఎందుకు ఆందోళనలు చేస్తున్నారన్నప్రశ్నలు టీవీ చానళ్ల చర్చా గోషుల్లో వినిపిస్తుండగా, కెఎంఎఫ్ ఇతర రాష్ట్రాల్లో చేస్తున్నట్లుగా దేశంలోని ఏ ప్రాంతంలోనైనా తమ ఉత్పత్తులను విక్రయించుకే హక్కు అమూల్‌కు ఉందంటూ ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై సహా రాష్ట్ర బిజెపి నేతలు వాదిస్తూ వచ్చారు. అంతేకాదు కెఎంఎఫ్ నందిని బ్రాండ్‌కు అమూల్‌వల్ల ఎంతమాత్రం ప్రమాదం లేదని వారంతా వాదిస్తూ వచ్చారు. మరికొంతమంది బిజెపి నేతలయితే మరో అడుగు ముందకు వేసి ప్రధాని నరేంద్ర మోడీ పట్ల కాంగ్రెస్, జెడి(ఎస్) వ్యతిరేకత కారణంగా అమూల్‌ను వాళ్లంతా వ్యతిరేకిస్తున్నారని కూడా వాదిస్తూ వచ్చారు.

అందరూ మరిచిన కీలక అంశం

అయితే వాళ్లంతా ఒక ముఖ్యమైన విషయాన్ని మరిచిపోయారు. అమూల్, లేదా కెఎంఎఫ్‌లతో ఈ వివాదానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ రెండూ కూడా సహకార సంస్థలుగా తమదైన విజయగాథలను కలిగి ఉన్నాయి. పెద్ద అంశం ఏమిటంటే ఫెడరలిజం (సమాఖ్య స్ఫూర్తి), భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల పరిధిలోని అంశమైన దీన్ని నీరుగార్చడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నం. నందినికి వ్యతిరేకంగా అమూల్‌ను తీసుకు రావడం వెనుక జరుగుతున్న గొడవ, రాజకీయాలు, సోషల్ మీడియా ట్రెండింగ్‌లు.. ఈ వివాదాలన్నిటినీ మించి సమస్య మూలాలను గమనించినట్లయితే ఓ పద్ధతి ప్రకారం చోటు చేసుకున్న పరిణామాలు కనిపిస్తాయి. విజయవంతంగా నడుస్తున్న తమ సహకార సంఘాలను కేంద్ర ప్రభుత్వానికి కోల్పోవడంపై రాష్ట్రప్రభుత్వాల ఆందోళనలకు కారణాలు లేకపోలేదు. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో రాష్ట్రాలు, కేంద్రానికి మధ్య బాధ్యతలు, అధికారాలను స్పష్టంగా పేర్కొనడం జరిగింది.

వివిధ అంశాలను కేంద్రం, రాష్ట్రాలు, ఉమ్మడి జాబితాలకు చెందిన అంశాలుగా వర్గ్గీకరించడం ద్వారా ఈ పని చేశారు. బ్యాంకింగ్, రైల్వేలు, రక్షణ, విదేశీ వ్యవహారాలు, విమానయానం, కమ్యూనికేషన్లు, ఐటి లాంటి వంద అంశాలు కేంద్రం జాబితాలో ఉండగా ప్రజల శాంతిభద్రతలు(పోలీసు), ప్రజారోగ్యం, వ్యవసాయం, వాణిజ్యం (ఇందులో సహకార సంఘాలు కూడా ఒక భాగం)లాంటివి రాష్ట్రాల జాబితా కిందికి వస్తాయి. అంటే దీన్ని బట్టి సహకార సంఘాలు రాష్ట్రాలకు సంబంధించిన అంశంమని స్పష్టంగా తెలుస్తోంది. అంతమాత్రాన అ రంగంపై నియంత్రణ లేదని కానీ, స్క్రూటినీ జరగడం లేదని కానీ అర్థం కాదు. సహకార సంఘాలపై రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బిఐ) ఓ కన్నేసి ఉంటుంది. ఇదే కాకుండా ప్రతి రాష్ట్రంలో కూడా సహకార సంఘాల రిజిస్ట్రార్ ఉంటారు కూడా. దేశంలో సహకార స్ఫూర్తి సూత్రాలను పరిరక్షించడానికి ఈ అధికారాలు, బాధ్యతల పంపిణీ తోడ్పడుతుంది.

మోడీ సర్కార్ దురుద్దేశాలు
అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం 2021 జులైలో తొలిసారిగా సహకార మంత్రిత్వ శాఖను సృష్టించి అమిత్‌షాను ఆ శాఖకు మంత్రిగా చేసినప్పటినుంచి రాష్ట్రాలనుంచి సహకార సంఘాలను లాక్కోవడానికి కేంద్రప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపైన అనుమానాలు, అలాగే సమాఖ్య స్ఫూర్తి మూల సూత్రాన్ని ఉల్లంఘించడానికి జరుగుతున్న ప్రయత్నాలపైన ఆందోళనలు మొదలైనాయి. ఆ శాఖ మంత్రిపదవిచేపట్టినప్పటినుంచి 2023 మార్చి దాకా అమిత్ షా చేసిన ప్రకటనలను గమనిస్తే రాష్ట్రప్రభుత్వాల పరిధిని దాటి నేరుగా కేంద్రప్రభుత్వఅధికారాల పరిధిలోకి వచ్చే మల్టీ స్టేట్ సహకార సొసైటీలను ఏర్పాటు చేసే దిశగా కేంద్రప్రభుత్వం ఓ పద్ధతి ప్రకారం ముందుకు సాగుతోందని స్పష్టమవుతుంది. షా మాటల్లో చెప్పాలంటే ఈ మల్టీ స్టేట్ సహకార సంఘాలను డెయిరీ( పాల ఉత్పత్తులు) సహా వివిధ ఉత్పత్తుల ఎగుమతి కేంద్రాలు( ఎక్స్‌పోర్ట్ హౌసెస్ ఆఫ్ ప్రాడక్ట్స్)గా చేయాలని మోడీ ప్రభుత్వం అనుకొంటోంది.

అమూల్ మరో అయిదు డెయిరీ సహకార సంఘాలతో విలీనం అవుతుందని అమిత్ షా 2022 అక్టోబర్‌లో గౌహతిలో ప్రకటించినప్పటినుంచి కేంద్రప్రభుత్వ ఉద్దేశాలపై ఆందోళనలు మొదలైనాయి. అమిత్‌షా చెప్పిన ‘విలీనం’ మాటకు ఎన్నో అర్థాలున్నాయి. అలాంటప్పుడు అమూల్ నందినిని ందినిని చేయడంపై అనుమానించినందుకు కర్నాటక రైతులు, ఇతర భాగస్వాములను నిందించడం సబబేనా? ఇది జరిగిన కొన్ని వారాలకే కర్నాటకలో అమూల్, కెఎంఎఫ్ సహకరించుకునేలా ఒత్తిడి తీసుకు వచ్చారు. ఇది ఈ రెండు సహకార సంఘాలు విలీనమయ్యే అవకాశాలున్నాయనే అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది. అలాంటి అవకాశం లేదని ముఖ్యమంత్రి బొమ్మై స్పష్టంగా చెప్పినప్పటికీ అనుమానాలు మాత్రం తగ్గలేదు.‘ కర్నాటకలోని ప్రతిగ్రామంలో ఒక ప్రాథమిక డెయిరీని ఏర్పాటు చేసే దిశగా అమూల్, కెఎంఎఫ్ కలిసి పని చేస్తాయి. కెఎంఎఫ్‌కు అమూల్‌నుంచి అవసరమైన సాంకేతిక మద్దతు, సహకారం అంతా లభిస్తుంది’ అని అమిత్ షా గత డిసెంబర్‌లో కర్నాటకలో చెప్పారు.

డెయిరీ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి రెండు లక్షల గ్రామీణ డెయిరీలను మల్టీ స్టేట్ సహకార ఎగుమతి సొసైటీలకు అనుసంధానం చేస్తామని గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మార్చి 18న అమిత్‌షా చేసిన ప్రకటన నేపథ్యంలో దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. అమూల్‌తో సహకారానికి కెఎంఎఫ్‌పై అమిత్ షా ఒత్తిడి తెచ్చిన కొద్ది నెలలకే గుజరాత్‌లోని ఈ సహకార సంఘం బెంగళూరు రిటైల్ మార్కెట్లో తమ పాలు, పెరుగు అమ్మకాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ప్రజలు రోజువారీ వినియోగించే వస్తువుల విషయంలో సహకార సంఘాలు ఒకదాని మార్కెట్‌తో మరోటి పోటీ పడకూడదన్న ‘అలిఖిత నిబంధన’కు స్వస్తి చెప్పింది. అంటే సహకారంనుంచి నేరుగా పోటీకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రెండు సహకార సంఘాలు పరస్పరం ఒకదానితో మరోటి కలిసి పని చేయాలని ఒక కేంద్రమంత్రి ఒత్తిడి తీసుకు రావడం అనేది కేంద్ర ప్రభుత్వం తన హద్దులను అధిగమించి అన్ని నిబంధనలను తుంగలోకి తొక్కి రాష్ట్రానికి సంబంధించిన అంశంలో జోక్యం చేసుకోవడానికి, కొత్త సంస్థలను, రాజకీయాలను తీసుకు రావడానికి ఓ స్పష్టమైన ఉఆదాహరణ అనేచెప్పాలి.

కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు సంబంధించిన అంశాల్లోకి చొరబడడం ఇది మొదటి సారి కాదు. వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం ఉమ్మడి ఎంట్రన్స్ పరీక్ష అయిన నీట్‌ను ప్రవేశపెట్టడం అలాంటి వాటిలో ఒకటి. రాష్ట్రాల అంశమైన ప్రజారోగ్యం పరిధిలోకి ఇది వస్తుందని, ఇది సహకార సమాఖ్య సూత్రాలకు ఇది విరుద్ధమంటూ తమిళనాడు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్నాటకకు చెందిన బెళగావి పిఎల్‌డిబ్యాంకునుంచి ఎన్‌సిపి చీఫ్ శరద్‌పవార్ మొత్తం రాజకీయ కెరీర్ దాకా సహకార సంఘాలు రాజకీయాలను, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడాన్ని గమనించినట్లయితే కేంద్రప్రభుత్వం మల్టీస్టేట్ సహకార సంఘాలపై ఎందుకు ఆసక్తి చూపిస్తుందనేది ఎవరికైనా అర్థమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News