క్రీడా రంగంపై నిర్మలమ్మ కనికరం
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి మంత్రి నిర్మలా సీతారామర్ క్రీడా రంగంపై కనికరం చూపించారు. మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో క్రీడలకు ఈసారి అదనంగా రూ.300 కోట్లను కేటాయించారు. కిందటి ఏడాది టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు అసాధారణ ప్రతిభను కనబరచడంతో క్రీడలకు మరింత ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 202223 బడ్జెట్‌లో క్రీడలకు తగిన ప్రాధాన్యత కల్పించినట్టు వెల్లడించారు. రానున్న పారిస్ ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని క్రీడలకు 300 కోట్ల రూపాయలను అదనంగా కేటాయించారు. క్రీడాభివృద్ధి కోసం ఈ నిధులను వెచ్చిస్తామన్నారు. క్రీడాకారులకు మెరుగైన వసతులు, సదుపాయాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రపంచంలోనే భారత్‌ను క్రీడల్లో అగ్రస్థానంలో నిలిపిందేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
దీని కోసం మరిన్ని నిధులను కేటాయించేందుకు కూడా వెనుకాడబోమని మంత్రి నిర్మల వివరించారు. కిందటిసారి బడ్జెట్‌లో క్రీడా రంగానికి రూ.2757.02 కోట్లు కేటాయించారు. ఈసారి క్రీడలకు ఆర్థిక మంత్రి మొత్తం రూ.3062.60 కోట్ల రూపాయలను కేటాయించడం విశేషం. కాగా ఈసారి ఖేలో ఇండియా కార్యక్రమానికి అదనంగా రూ.316.29 కోట్ల రూపాయలను కేటాయించినట్టు ఆర్థిక మంత్రి వెల్లడించారు. అంతేగాక ప్రతిభావంతులైన క్రీడాకారులకు అందించే ప్రోత్సాహక నిధులను రూ.245 కోట్ల నుంచి రూ.357 కోట్లకు పెంచారు. అయితే కేంద్ర ప్రాధికార సంస్థ (సాయ్)కు కేటాయించే నిధులలో మంత్రి కోత విధించారు. సాయ్‌కు ఈసారి బడ్జెట్‌లో రూ.7.41 కోట్ల రూపాయలను తగ్గించారు.