Saturday, December 21, 2024

పాక్ టెర్రరిస్టు విడుదల కోసం అమెరికాలో కిడ్నాప్

- Advertisement -
- Advertisement -

An assailant who held four hostages in America for 10 hours

యూదుల ప్రార్థనామందిరంలో ఘటన

క్షేమంగా బయటపడ్డ బందీలు, దుండగుడి హతం

కోలీవిల్లే: అమెరికాలో ఓ దుండగుడు పదిగంటలకుపైగా ఉత్కంఠభరిత పరిస్థితి సృష్టించాడు. శనివారం టెక్సాస్ రాష్ట్రం డల్లాస్‌కు సమీపంలోని కోలీవిల్లేలో ఈ ఘటన జరిగింది. నలుగురు వ్యక్తుల్ని బందీలుగా పట్టుకున్న దుండగుడు చివరికి అమెరికా ఎఫ్‌బిఐ ప్రత్యేక బృందం స్వాత్ చేపట్టిన ఆపరేషన్‌లో హతమయ్యాడు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 1030కి కోలీవిల్లే పట్టణంలోని యూదుల ప్రార్థనామందిరం సినగాగ్‌లోకి చొరపడ్డ సాయుధుడైన దుండగుడు నలుగురు వ్యక్తుల్ని బందీలుగా పట్టుకున్నాడు. బందీల్లో యూదుల మతగురువు రబ్బీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. బందీలను విడుదల చేయడానికి అమెరికా జైలులో ఉన్న పాకిస్థాన్ ఉగ్రవాది ఆఫియాసిద్దిఖీని విడుదల చేయాలని దుండగుడు షరతు విధించాడు. దుండగుడి నుంచి బందీలను కాపాడేందుకు అక్కడికి చేరుకున్న స్వాత్ పోలీసులు అతడితో సంప్రదింపులు జరిపారు. తన దగ్గర తుపాకీతోపాటు పేలుడు పదార్థాలున్నాయని ఓ వీడియో సందేశాన్ని దుండగుడు బయటకు పంపాడు.

శనివారం సాయంత్రం 5 గంటలకు ఓ బందీని దుండగుడు విడుదల చేశాడు. శనివారం రాత్రి 930కి మిగతా బందీలు కూడా బయటకువచ్చారు. అయితే, లోపల ఏంజరిగిందన్నది పోలీసులు వెల్లడించలేదు. బందీల విడుదలకు ముందు పేలుళ్లు,కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానిక మీడియా తెలిపింది. దాంతో, పోలీసుల కాల్పుల్లో దుండగుడు మరణించినట్టుగా భావిస్తున్నారు. ఈ ఆపరేషన్ నిర్వహణను అధ్యక్షుడు జోబైడెన్ ఎప్పటికపుడు సమీక్షించినట్టు అమెరికా అధికారులు తెలిపారు. దుండగుడు ఎలా చనిపోయాడన్న విషయాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. ప్రార్థనలు ఫలించాయి. బందీలంతా క్షేమంగా బయటపడ్డారని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ట్విట్ చేశారు. దుండగుడు తాను సిద్దిఖీ సోదరునిగా చెప్పుకోగా, అది వాస్తవం కాదని ఆమె న్యాయవాది తెలిపారు. దుండగుడి చర్యను సిద్దిఖీ కుటుంబం కూడా ఖండించడం గమనార్హం.

లేడీ అల్‌ఖైదా ఆఫియాసిద్ధిఖీ..

ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్ ఫెడరల్ జైలులో ఆఫియాసిద్దిఖీ ఖైదీగా ఉంటున్నారు. ఆమె పాక్‌కు చెందిన న్యూరోసైంటిస్ట్. అల్‌ఖైదాతో ఆమెకు సంబంధాలున్నాయన్న ఆరోపణలున్నాయి. అమెరికా మీడియా ఆమెను లేడీ ఖైదాగా పేర్కొంటున్నాయి. అఫ్ఘానిస్థాన్‌లో ఎఫ్‌బిఐ ఏజెంట్లు, సైనికులపై కాల్పులకు పాల్పడినందుకు న్యూయార్క్ కోర్టు 2010లో ఆమెకు 86 ఏళ్ల జైలుశిక్ష విధించింది. సిద్దిఖీ అమెరికాలోని ఎంఐటివంటి విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యనభ్యసించారు. 2001లో అమెరికాపై అల్‌ఖైదా దాడుల తర్వాత ఆ దేశ నిఘా సంస్థలు ఆమె కదలికలపై అనుమానాలు వ్యక్తం చేశాయి. 2008లో అమెరికా దళాలు ఆమెను అఫ్ఘానిస్థాన్‌లో అరెస్ట్ చేశాయి. ఆమె దగ్గర డర్టీ బాంబు తయారీకి సంబంధించిన రహస్య పత్రాలు దొరికినట్టు ఆ దేశ నిఘావర్గాలు తెలిపాయి. ఆ బాంబుల్ని అమెరికాలోని రద్దీ ప్రాంతాల్లో పేల్చడం ద్వారా భారీ ప్రాణనష్టం కలిగించాలన్నది ఆమె ప్రణాళికగా ఆరోపించాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News