మనతెలంగాణ/ హైదరాబాద్ : నిజాంకు వ్యతిరేకంగా లక్షలాది మంది పోరాడిన పోరాటాన్ని, చరిత్రను కాంగ్రెస్ పార్టీ సమాధి చేసే ప్రయత్నం చేసిందని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం రాష్ట్ర విమోచన దినోత్సవ సందర్బంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జెండా ఎగరవేసి తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు కిషన్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాతికేళ్లుగా బిజెపి శాఖ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకం ఎగురవేయడం జరుగుతున్నదన్నారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన ఉత్సవాలు జరపకుండా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ చర్య ద్వారా నిజాంను ఓడించి హైదరాబాద్ గడ్డపై మూడు రంగుల జెండా ఎగరవేశారని వెల్లడించారు. కార్యక్రమంలో బిజెపి ముఖ్యనేతలు పాల్గొన్నారు.