Sunday, December 22, 2024

ఒక ఎన్నిక… ముగ్గురికి అగ్ని పరీక్ష

- Advertisement -
- Advertisement -

వేడెక్కిన లోక్‌సభ ఎన్నికల వాతావరణం

ఆరు గ్యారెంటీలే అస్త్రంగా అన్నిపక్షాల పోరుబాట

అమలుకోసం బిఆర్‌ఎస్ పట్టు.. హామీలపైనే కాంగ్రెస్ ధీమా

బిజెపి ఆశలన్నీ అయోధ్యమీదే

ఎత్తులు, పైఎత్తుల్లో అధినేతలు ముగ్గురికీ కీలకమే

(మిట్టపల్లి శ్రీనివాస్)
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడం అధికార కాంగ్రెస్, విపక్ష బిఆర్‌ఎస్, బిజెపి అధినేతలకు అగ్నిపరీక్షగా మారనున్నది. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డిల ప్రతిష్ఠకు ఈ ఎన్నిక లు పరీక్షగా మారాయి. దీనితో మునుపెన్న డూ లేనివిధంగా లోక్‌సభలోని 17 స్థానాల్లో మెజారిటీ స్థానాల గెలుపు కోసం రాష్ట్రంలో అప్పుడే రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఐదు నెలలకే లోక్‌సభ ఎన్నికలు జరగనుండడంతో అధికార కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత రేవం త్ రెడ్డికి ఎన్నికలు ప్రధాన సవాలుగా నిలిచా యి. విపక్ష బిఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు వైఫల్యమే ప్రధాన ప్రచార అజెండాగా రంగంలోకి దిగగా అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెండు హామీలు అమలు చేసి లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపే మరి కొన్ని హామీలు అమలు చేసి అసెంబ్లీ ఎన్నికల వేవ్ ను కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్లు, స్వల్ప సీట్ల తేడాతో అధికారం కోల్పోయిన బిఆర్‌ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో మెజారిటీ సాధించడం అత్యంత కీలకంగా మారింది. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత కెసిఆర్ ఈ ఎన్నికల్లో కూడా గతంలో మాదిరిగా మెజారిటీ సా ధించడం ద్వారా పార్టీ లీడర్లు కేడర్‌లో ఆత్మస్థైర్యాన్ని నింపాలని ఎన్నికల ఎత్తుగడల్లో తలమునకలయ్యారు. మరణశయ్యపై ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరి ఇచ్చి ఉత్తేజం తెచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ సత్తాకు ఎన్నికలు పరీక్షగా మారబోతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో క్రమంగా అధికార ప్రభ కోల్పోతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు ఈసారి వచ్చే ఫలితాలు కూడా కీలకం కాబోతున్నాయి. వచ్చే ఏప్రిల్‌లో జరుగుతాయని భావిస్తున్న లోక్‌సభ ఎన్నికల్లో గతంలో మాదిరిగా మెజార్టీ స్థానాలు సాధించడానికి భారత రాష్ట్ర సమితి అందరి కంటే ముందు సన్నాహాలు ప్రారంభించింది. మొత్తం లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సీనియర్ నేతలతో సమావేశాలు అప్పుడే ముగించేసింది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కూడా సమావేశాలు నిర్వహించేందుకు ఆ పార్టీ సమాయత్తమైంది.ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా క్షేత్రంలో యుద్ధభేరి మోగించడానికి ఈ నెల చివరి వారాన్ని ఎంచుకున్నారు.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి ఆయన సెంటిమెంట్ ప్రకారం ప్రచారం నిర్వహించబోతున్నారు. బిజెపి నుంచి కొత్తగా రాష్ట్రానికి నియమితులైన చంద్రశేఖర్ ఎన్నికల వ్యూహాలను, ఎత్తుగడలకు తెర తీసి తెర వెనుక సన్నాహాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్‌సభ ఎన్నికల్లో కూడా త్రిముఖ పోటీ జరగబోతున్నది. ఇప్పటి దాకా మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరనేది ఇంకా తేలలేదు. బిఆర్‌ఎస్ పార్టీ నుంచి కెసిఆర్ ఇంకా అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకొని జనంలోకి రాలేదు. కానీ ఆయన పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బాగా దెబ్బతిన్న ఉత్తర తెలంగాణ జిల్లాలకు కేంద్రంగా ఉన్న కరీంనగర్ నుంచి రణభేరి మోగిస్తారని ఆ పార్టీ ప్రకటించింది. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో బిఆర్‌ఎస్ కు 8 స్థానాలు, కాంగ్రెస్‌కు మూడు, బిజెపికి నాలుగు, ఎంఐఎంకు ఒక స్థానం దక్కింది. ఇందులో కాంగ్రెస్ నుంచి ప్రస్తుతం లోక్‌సభలో ప్రాతినిధ్యం జీరోగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి ఎంపిలుగా గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమారరెడ్డిలు ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉండడంతో వారు ఎంపి పదవులకు రాజీనామా చేయగా, మల్కాజ్‌గిరి నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎంపి పదవికి రాజీనామా చేయడంతో లోక్‌సభలో రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌కు ప్రస్తుతం ప్రాతినిధ్యం లేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల రాజకీయ ఆలోచనకు, లోక్‌సభ ఎన్నికల్లో ఆలోచనకు తేడా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం సమస్యలు, నాయకత్వం ఆధారంగా ఓటర్లు ఓటు వేస్తారు. అదే లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయి అంశాలు, నాయకత్వం ప్రధానంగా ఓటర్లను ప్రభావితం చేస్తాయి. తెలంగాణ తెచ్చి పదేళ్లు పరిపాలన చేసి రాష్ట్రాన్ని దేశానికి మోడల్ చేసినా ఓటర్లు బిఆర్‌ఎస్‌పై ఆగ్రహం ప్రదర్శించారు. దీంతో ఆ పార్టీ కేడర్ లీడర్లలో ఆత్మస్థైర్యం చేజారకుండా ఉండాలంటే లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించి తన సత్తా మరోసారి నిరూపించాలని బిఆర్‌ఎస్ పట్టుదలగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల కన్నా ఎక్కువ కృషి చేస్తూ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తును మరింతగా పదిలపర్చుకోవాలంటే ఈ ఎన్నికల్లో కూడా మెజారిటీ సాధించాలి. అసెంబ్లీ మాదిరిగా లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించకపోతే ఆయన ఇంటాబయట విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఆయన ఈ ఎన్నికల్లో పార్టీని విజయపథం వైపు నడిపించేందుకు ఏకంగా సోనియా గాంధీనే తెలంగాణ నుంచి పోటీ చేయించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె రాష్ట్రం నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం మిగతా నియోజకవర్గాల్లో ఉంటుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

సోనియా గాంధీని పార్టీ బలంగా ఉన్న దక్షిణ తెలంగాణ జిల్లాల నుంచి పోటీ చేయించాలని ఆయన భావిస్తున్నారు. బిఆర్‌ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో సత్తాను చాటి గ్రామీణ జిల్లాలో ఓట్లు, సీట్లు సాధించలేక అధికారానికి దూరమైంది. దీంతో ఆ పార్టీ ఇప్పుడు రూరల్ జిల్లాలపై దృష్టి పెట్టింది. ఇక బిజెపి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అసెంబ్లీలో, లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు, ఓట్లు సాధించింది. ప్రస్తుతం దేశమంతటా మోడీ హవా నడుస్తుండడం, అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రభావం ప్రతి కుటుంబంపై పడడంతో ఆ గాలి ఆధారంగా మెజార్టీ స్థానాలపై దృష్టి పెట్టి గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో పడింది. ఆ పార్టీ నుంచి జాతీయ స్థాయిలో అతిరథులను పోటీలో దించాలని చర్చలు చేస్తున్నది. మూడు ప్రధాన పార్టీలు లోక్‌సభ నియోజకవర్గాల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా గత ఎన్నికల్లో సాధించిన ఫలితాల ఆధారంగా అభ్యర్థుల ఖరారు చేసి ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నాయి. బిఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు వైఫల్యంపై ప్రధాన ప్రచారం చేస్తున్నది.
కాంగ్రెస్ హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని చెబుతూ అధికార బిఆర్‌ఎస్ అవినీతిని ఒక్కొక్కటిగా బయటపెడుతూ ఎన్నికల్లో కూడా ప్రజల విశ్వాసాన్ని సాధించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నది. బిజెపి హిందూత్వం ఎజెండాతో పాటుగా కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది బిజెపినే కనుక ఇక్కడ బిజెపి అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ధి పరుగులు పట్టే అవకాశం ఉందని ప్రచార సభల్లో చెబుతున్నది. ఇక రాజకీయ ఎత్తులకు పైఎత్తుల విషయానికొస్తే కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బాగా దెబ్బతిన్న హైదరాబాద్‌లో లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలంటే ఎంఐఎం మద్దతు అవసరం కావడంతో ఆ పార్టీతో మైత్రికి ప్రయత్నాలు చేస్తున్నది.

ఎంఐఎం నేతలు కూడా క్రమంగా బిఆర్‌ఎస్‌కు దూరమై కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లుగా పరిణామాలు సూచిస్తున్నాయి. మూడు పార్టీలూ తమది ఒంటరి పోరాటం అని బయటకు చెబుతున్నా లోపాయికారీ అవగాహనలకు ప్రయత్నాలు చేయడం విశేషంగా చెప్పవచ్చు. బిఆర్‌ఎస్ పార్టీకి మొదటి నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆయువు పట్టుగా వున్నాయి. కాని గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఇక్కడ బాగా దెబ్బతినడంతో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ తన కార్యస్థలాన్ని ఉత్తర తెలంగాణ జిల్లాలకు కేంద్రంగా వున్న కరీంనగర్‌కు మార్చబోతున్నారని అక్కడే వుండి లోక్‌సభ ఎన్నికల యుద్ధం సాగిస్తారని ఆ పార్టీ ముఖ్యుడు వినోద్ కుమార్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. తుంటి శస్త్ర చికిత్స తర్వాత ఇప్పటి దాకా ఇంటికే పరిమితమైన కెసిఆర్ కరీంనగర్ నుంచే కార్యాచరణను ప్రారంభిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News