Friday, November 22, 2024

కెసిఆర్ ఉద్యమ ప్రేరణలో ఓ ఘట్టం!

- Advertisement -
- Advertisement -

An event inspired by the KCR movement

చాలా కాలంగా తెలంగాణ ప్రాంతం పాలకుల నిర్లక్ష్యం, స్వార్ధ విధానాలతో చాలా నష్టపోయింది. తెలంగాణ ఉద్యోగుల్లో, యువతలో పాలకులపై అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా దాగి వుండేది. ఉద్యోగుల్లో ఆంధ్రవారికే అగ్రతాంబూలం. తెలంగాణ ప్రజల పరిరక్షణకై వచ్చిన అన్ని చట్టాలను తుంగలో తొక్కినవేళ తెలంగాణ చరిత్రను అప్పటికే సమగ్రంగా చదివేసిన కెసిఆర్ 1999-2001లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా వుండేవారు. నారా చంద్రబాబు నాయుడు ఆనాటి ముఖ్యమంత్రి. కెసిఆర్ కూడా చంద్రబాబు నాయుడి తెలుగుదేశం పార్టీ సభ్యుడే. అయినా తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని, వివక్షను ఎత్తిచూపుతూ ఆవేదన, ఆగ్రహంతో కూడిన రెండు పేజీల ఉత్తరాన్ని 17.04.2001న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పేరున రాశారు. అప్పట్లో అదో సంచలనం. ఆ లేఖ కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి బీజం వేసింది. విద్యుత్ ఛార్జీల పెంపుపై మొదటగా చాలా ఘాటుగా లేఖ రాశారు. అయినా రెండవ లేఖ కెసిఆర్ జీవితానికి కొత్త బాటలు వేసింది. ఒక్కసారిగా తెలంగాణ ఉద్యోగులకు, నిరుద్యోగులకు కెసిఆర్ దేవుడై కూర్చున్నారు. చంద్రబాబుకు తాను రాసిన లేఖ ‘చెవిటోడి ముందు శంఖం’ అని కెసిఆర్ గ్రహించారు.

తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సహిస్తూ ఇంకా తాను పదవిలో, అధికారపక్షంలో కొనసాగడం ఎంతమాత్రం సహేతుకం కాదని కెసిఆర్ తలపోశాడు. ఈ ఉత్తరం రాసిన నాలుగు రోజులకు అనగా ఏప్రిల్ 21, 2001న కెసిఆర్ సాహసోపేత, సంచలనాత్మక నిర్ణయం తీసుకుంటూ ‘డిప్యూటీ స్పీకర్’ పదవికి, శాసన సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేసి చంద్రబాబుతో యుద్ధానికి శంఖం పూరించాడు. ఆ ఆలోచనల నుండి, హృదయ వేదన నుండి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం జరిగింది. ఆ ఉద్యమం మహోద్యమమై పాలకుల, పార్టీల కళ్లు తెరిపించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. తెలంగాణలో నూతన అధ్యాయం ఆరంభమయింది. తెలంగాణ ఉద్యమ ఆవిర్భావ చరిత్ర ఈ తరం అందరికీ తెలిసిందే.
తెలంగాణ ఉద్యమానికి ఉద్యోగులను సమాయత్తం చేసిన ఆనాటి కెసిఆర్ లేఖ, అందులోని విషయం గుర్తుచేసేందుకే ఈ వ్యాసం రాస్తున్నాను. ‘గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి’ అంటూ ఆ లేఖ ఆరంభించారు. గతంలో రాష్ట్రంలో చెలరేగిన తెలంగాణ, ఆంధ్ర ఉద్యమాల తదనంతర పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రాంత ప్రజలను పరిరక్షించడానికి 1973 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను అమల్లోకి తెచ్చిన విషయం తమకు తెలుసు. తదనంతరం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ యథేచ్ఛగా ఉల్లంఘించబడిన పరిణామక్రమంలో టిఎన్‌జిఒ సంఘంవారు ఉద్యమాలు చేపట్టారు.

ఉద్యమాలు అవసరం లేదని తాను తప్పకుండా తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిచేస్తానని టిఎన్‌జిఒలకు స్పష్టమైన హామీ ఇచ్చి వివరాల సేకరణకు అధికార్ల సంఘాన్ని నియమించారు నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు. వారు నియమించిన అధికార్ల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్ల ద్వారా నివేదికలు తెప్పించి తెలంగాణ ప్రాంతంలో ప్రెసిడెన్షియల్ ఆర్డరు ఉల్లంఘించబడి 58,952 ఉద్యోగాలలో తెలంగాణేతరుల నియామకం జరిగినట్లు స్పష్టపరిచింది. నివేదికనందుకున్న ఎన్‌టి రామారావు ప్రభుత్వం తెలంగాణ నిరుద్యోగులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతూ జిఒఎఎస్ నెం.610 (30.12.1985) ను జారీ చేయడం జరిగింది. దీని ప్రకారం తెలంగాణలో నియమించబవిన 58,952 మంది తెలంగాణేతర ఉద్యోగులను వారివారి సొంత జిల్లాల్లో గల ఖాళీలలో సర్దుబాటు చేయమని, ఖాళీలు లేని చోట్ల సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేసి భర్తీ చేయమని, అట్టి 58,952 ఉద్యోగాలలో వెంటనే తెలంగాణ వారి నియామకం చేపట్టాలని ఆదేశించారు.

స్థానికేతరుల స్థానంలో తెలంగాణ వారి నియామకాలు 31.03.1986 లోగా జరగాలని కూడా ఆ జివొలో స్పష్టీకరించారు. తెలంగాణ ప్రాంత నిరుద్యోగ యువత దురదృష్టం వల్ల ఆ జివొ 610 అమలు పరచబడలేదు. ఆ జివొ 610 జారీ చేయించిన సర్గీయ ఎన్‌టి రామారావు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులే కాక మనకు పూజ్యనీయులు, ఆదర్శప్రాయులు. వారి వారసులమని సగర్వంగా మనమంతా ఈనాడు చెప్పుకుంటున్నాము. వారు విడుదల చేసిన జివొను యథాతథంగా చిత్తశుద్ధితో అమలు పరచవలసిన కర్తవ్యాన్ని మీకు గుర్తు చేయడానికై ఈ లేఖ మీకు రాస్తున్నాను. ఒక ప్రాంతం వివక్షకు లోనైతే తమకు జరిగిన అన్యాయాన్ని సవరించడానికి జారీ చేయబడిన జివొలు కూడా అన్యాయానికి గురిఅయి నీరుకారిపోతుంటే ఆ ప్రాంత ప్రజలలో ఎటువంటి భావోద్వేగాలు చెలరేగుతాయో ఆనాటి జై ఆంధ్ర ఉద్యమంలో చురుకైన కార్యకర్తగా పని చేసిన మీరు అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం సకల చర్యలు చేపడుతుందని ఘంటాపథంగా ప్రకటిస్తున్న మీరు ఈ జివొ తక్షణ అమలుకు ఆదేశాలు ఇవ్వడానికి వెనుకాడరని నేను భావిస్తున్నాను. స్వర్ణీయ ఎన్‌టి రామారావు ఎడల మనం ప్రదర్శించవలసిన భక్తిప్రపత్తుల దృష్ట్యా చూసినా, దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్లాడుతున్న తెలంగాణ నిరుద్యోగ యువత ఆర్తిని ఓదార్చే కోణంలో చూసినా ఈ జివొ అమలుకు తక్షణ ఆదేశాలు జారీ చేయడం తమరి విహిత కర్తవ్యం. అదేశాలు తక్షణం జారీ చేయగలరని ఆశిస్తున్నాను.

ఈ లేఖలో తెలంగాణ ఉద్యోగులకు, నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని పదునైన మాటలతో ఎత్తిచూపారు. ఒక్కసారిగా యావత్ తెలంగాణ రాష్ట్రం ఈ ఉత్తరం చదివి పిడికిళ్లు బిగించింది. ఒకవైపు తెలంగాణ పట్ల ఎన్‌టి రామారావుకున్న ప్రేమ, వాత్సల్యాల్ని గుర్తు చేస్తూ అలాంటి వ్యక్తి ఆశయాలకు విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును కూడా ఆ లేఖలో ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో ఒక్కసారిగా చంద్రబాబు పట్ల ఏహ్యభావం ఏర్పడేలా చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపుపై కెసిఆర్ చంద్రబాబుకు రాసిన లేఖ తెలంగాణలోని ప్రతి వ్యక్తి హృదయంలో కదలిక తీసుకొస్తే ఆ తరువాత 610 జివొపై రాసిన ఈ లేఖ కూడా జనంపై చాలా ప్రభావం చూపింది. కెసిఆర్ మాటల్లో అయితే చంద్రబాబు విద్యుత్ ఛార్జీల పెంపే తెలంగాణ ఉద్యమానికి జీవాన్నిచ్చింది అంటారు. నిజమే కావచ్చు ఉద్యోగులల్ని, నిరుద్యోగ యువతను సమైక్య పరిచేందుకు ఈ లేఖ కూడా అంతే తోడ్పడిందని చెప్పవచ్చు.

అంతకు ముందు ఉద్యోగులు, నిరుద్యోగులు డోలాయమానంలో వుండేవారు. ఈ లేఖతో చంద్రబాబు దిక్కుతోచని స్థితిలోపడ్డారు. ఈ రెండు లేఖలు పరిశీలిస్తే చంద్రబాబు వ్యవహార శైలి, తప్పిదమే తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టుకకు కారణమైంది. ఆయన చేసిన పనుల వల్లే తెలంగాణ గడ్డపై ఒక్కసారిగా ఉద్యమ గర్జన వినిపించింది. ఈ లేఖ చంద్రబాబు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమ సారథి అన్న విషయం కూడా తొలిసారిగా రాష్ట్ర ప్రజలకు తేటతెల్లమయింది. తన మంత్రివర్గం నుండి కెసిఆర్‌ను తొలగించి ఆయన స్థానంలో సిబిఐ మాజీ డైరెక్టర్ విజయ రామారావును మంత్రిని చేయడం చంద్రబాబు చేసిన పెద్ద తప్పు, దురదృష్టం. అది తెలంగాణ ప్రజల అదృష్టం కూడా. తెలంగాణ రాష్ట్ర చరిత్రకు కెసిఆర్ ముఖచిత్రమైతే అందులో చంద్రబాబే ప్రధాన విలన్‌గా మిగిలాడు. తర్వాత కాలంలో చంద్రబాబు కూడా చివరికి తెలంగాణకు జై కొట్టడం వేరే విషయం. తెలంగాణ ప్రజల్ని జాగృతి పరచడానికి చంద్రబాబే పరోక్షంగా తోడ్పడ్డాడు. ఓ మహా నాయుకుడిగా, తెలంగాణ రాష్ట్ర సారథిగా కెసిఆర్‌ను మార్చేందుకు కూడా చంద్రబాబు ధోరణే తోడ్పడింది. 19992001 మధ్య డిప్యూటీ స్పీకర్‌గా కెసిఆర్‌ను చంద్రబాబు ఎంపిక చేయడంతో కెసిఆర్‌కు తెలంగాణ రాష్ట్ర సమగ్ర స్వరూపాన్ని క్షుణ్ణంగా చదివేందుకు, పరిశోధనకు చక్కని అవకాశం లభించింది. ఆ ఫలితమే కెసిఆర్ తెలంగాణ పోరాటానికి నడుం కట్టడం ఎవరు ఒప్పుకున్నా కాదన్నా ఇది చరిత్ర. ఇందులో అసత్యాలకు చోటు లేదు. కలిసి వచ్చిన అవకాశం కెసిఆర్‌ను మేధావిని చేసి, ఉద్యమం వైపు పరుగులు తీయించింది. ఈ రోజుని తెలంగాణ ఉద్యోగులు, నిరుద్యోగ యువత మరువరాదు.

డా. సమ్మెట విజయ్ కుమార్- 8886381999

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News