నిజామాబాద్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలో నిర్వహించిన 2 కె రన్ యువత కేరింతలతో ఉత్సాహంగా సాగింది. సోమవారం జిల్లా కేంద్రంలోని పులాంగ్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన మార్గాల మీదుగా పోలీసు పరేడ్ మైదానం వరకు సాగింది. స్వరాష్ట్రంలో తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతి విశిష్టతలతను చాటేలా ఉదయం 7గంటలకే వేలాది సంఖ్యలో అన్నివర్గాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా హాజరై 2కె రన్‌లో భాగస్వాములయ్యారు. జిల్లా క్రీడలు, యువజన సర్వీసులశాఖతో పాటు జిల్లా పోలీసు యంత్రంగం ఆధ్వర్యంలో జరిగిన ఈ పరుగులో ఉద్యోగులు, విద్యార్థులు, యువతీ యువకులు, వృద్ధ్దుల వరకు కదం తొక్కుతూ ఉత్సాహంగా పాల్గొనడం సమైక్యతకు అద్దం పట్టింది. దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా రూపొందించి సమకూర్చిన శ్వేతవర్ణపు టీషర్ట్‌లను ధరించి వేలాది మంది 2 కె రన్‌లో పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు బేలూన్లను గాలిలోకి ఎగురవేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని గుర్తు చేస్తూ మరింత ఉత్సాహంగా ముందుకు సాగేలా ప్రభుత్వం అట్టహాసంగా రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే చేపట్టిన 2కె రన్‌కు యువతీ యువకులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలిరావడం ఎంతో సంతోషకరమని అన్నారు. దశాబ్ధి ఉత్సవాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రగతిలో మరింతగా మమేకమవుదామని పిలుపునిచ్చారు. ఈ 2 కె రన్‌లో జడ్‌పి ఛైర్మన్ దాదన్నగారి విఠల్‌తో పాటు నగర మేయర్ నీతూ కిరణ్, డిసిపీలు మధుసూదన్‌రావు, గిరిరాజా, నుడా ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, నిజామాబాద్ ఎసిపి కిరణ్‌కుమార్ తదితరులంతా 2 కె రన్‌లో భాగస్వాములయ్యారు.
ఈ 2కె రన్‌లో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఇం దిరా, జిజిహెచ్ సూపరిండెంట్ డా. ప్రతిమారాజ్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ముత్తెన్న వీరితోపాటు ఆన్నిశాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు ఎన్‌సిసి క్యాడెట్లు, నర్సింగ్ కళాశాల , ఇతర విద్యాసంస్థల విద్యార్థినీ విద్యార్థులు, వైద్యులు, క్రీడా సంఘాల బాధ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు దశాబ్ధి ఉత్సవ జెండాలను చేతబూని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఫ్రీడం ర్యాలీకి హాజరైన వారితో పోలీసు పరేడ్ మైదానం కిక్కిరిపోయింది.