ముంబయి: ట్రాన్స్‌మిషన్ లైన్‌లో ట్రిప్పింగ్ కారణంగా మంగళవారం ఉదయం ముంబయి మహానగరంతోపాటు శివార్లలో ఉన్న థాణె, కల్యాణ్ నగరాలలో సైతం గంటకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికే దాదాపు 2500 మెగావాట్ల విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న మహారాష్ట్ర అక్కడకక్కడ విద్యుత్ కోతలు అమలుచేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ ముంబయిలోని దాదర్ మాతుంగతోపాటు శివారు ప్రాంతాలైన భందూప్, ములుంద్ తదితర ప్రాంతాలు, పొరుగున ఉన్న థాణె, కల్యాణ్, డోంబివిలి వంటి మెట్రోపాలిటన్ నగరాలలో ఉదయం 10 గంటల నుంచి గంటకుపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కల్యాణ్ సమీపంలోని పడ్ఘా వద్ద నున్న మహారాష్ట్ర రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ కంపెనీ సబ్‌స్టేషన్‌లో ట్రిప్పింగ్ కారణంగా విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడినట్లు ఒక అధికారి తెలిపారు. గంట సేపటి తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు ఆ అధికారి తెలిపారు.