పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 80పైసలు పెంపు
వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.50 బాదుడు
మరికొన్ని రోజులు కొనసాగనున్న ధరల పెంపు?
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కారణంగా గత నాలుగున్నర నెలలుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్‌తో పాటుగా వంటగ్యాస్ సిలిండర్ ధరలు మంగళవారం పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసలు చొప్పున పెరగ్గా, వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. పెరిగిన ధరలు మంగళవారంనుంచి అమలులోకి వచ్చాయి. పెరిగిన ధరలతో ఢిల్లీలో పెట్రోల్ ధర ఇప్పుడు లీటరుకు రూ.96.21కు, డీజిల్ ధర లీటరుకు రూ.86.87కు చేరుకుంది. స్థానిక పన్నుల కారణంగా ఆయా రాష్ట్రాల్లో పెరుగదలలో కొద్దిగా మార్పు ఉండే అవకాశముంది. ముంబయిలో పెట్రోల్‌పై లీటరుకు 84పైసలు పెరిగి రూ.110.82కు చేరుకోగా, డీజిల్‌పై లీటరుకు 86 పైసలు పెరిగి రూ.95కు చేరింది.
హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.10పైసలుకు, డీజిల్ రూ. 95.40పైసలుకు చేరింది. మరో వైపు 14 కెజిల వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెరిగింది. దీంతో తెలంగాణలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1002కు చేరింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు గరిష్ఠానికి చేరిన విషయం తెలిసిందే. అయితే రోజురోజుకు చమురు సంస్థలకు నష్టాలు పెరుగుతుండడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం అనివార్యంగా మారినట్లు అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరికొన్ని రోజుల పాటు ఈ ధరల పెరుగుదల కొనసాగే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. 2014 జనవరి తర్వాత వంటగ్యాస్ సిలిండర్ ధరలు ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. అప్పట్లో సిలిండర్ ధర రూ.1241కి చేరుకుంది. అయితే అప్పుడు ప్రభుత్వం సిలిండర్‌పై రూ.600 సబ్సిడీ ఇస్తుండడంతో ఆ భారం వినియోగదారులపై అంతగా కనిపించలేదు. అయితే ఇప్పుడు చాలా నగరాల్లో ప్రభుత్వం వంటగ్యాస్‌పై ఎలాంటి సబ్సిడీ చెల్లించడం లేదు.