ఆసిఫాబాద్: కొన్ని సంవత్సరాల తరువాత పెండింగ్‌లో ఉన్న పోడు పట్టాల పంపిణికి ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. ఈ నెల 30 న ముఖ్యమంత్రి కేసిఆర్ చేతుల మీదుగా జిల్లాలోనే పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టనుంది. నూతన కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయం, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం, కుమ్రంభీం విగ్రహం, మాజీ మంత్రి కోట్నక భీంరావు విగ్రహాల ఆవిష్కరణ చేపట్టనున్నారు.
అనంతరం బహిరంగ సభ నిర్వహించి ఆ సభలోనే పోడు పట్టాలను సీఎం కేసిఆర్ చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు. ఈ నెల 24న పోడు భూముల పట్టాల పంపిణీ ఉండగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 30కి వాయిదా పడింది.
రాష్ట్రంలో పోడు సాగు చేసుకునే వారికి జిల్లాల వారిగా సభలు నిర్వహించి ఎక్కడికక్కడ ప్రజా ప్రతినిధులు తమ అధికారుల సమక్షంలో లబ్దిదారులకు పట్టాల పంపిణీ చేయనున్నారు. ఈ క్రమంలో అటవీ భూముల్లో పోడు అధికంగా సాగు చేస్తున్న జిల్లాలు కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మహబుబబాద్, ములుగు, భద్రద్రి కొత్తగూడేం జిల్లాలు ఉన్నాయి. ఈ ఆరు జిల్లాలలో 3 జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండే ఉండడంతో సీఎం కేసిఆర్ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా నుండే పోడు భూముల పట్టాలను పంపిణీ చేయనున్నారు.
ఈ మేరకు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 15519 మంది రైతులకు గాను 45138 ఎకరాలకు పోడు పట్టాల పంపిణీ ఇచ్చేందుకు అధికారులు సర్వం సిద్దం చేస్తున్నారు. ఈ నెల 30 న సీఎం కేసిఆర్ జిల్లాకు రానుండడంతో అధికార యంత్రంగం అన్ని పనుల్లో నిమగ్నం అయ్యారు. ఇటివల మంచిర్యాల జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి 3 కొత్త పథకాలు ప్రారంభించారు.
బిసి కులాలకు లక్ష సహాయం, సోంత జాగ ఉన్న వారికి 3 లక్షల సహాయం, రెండవ విడత గొర్రెల పంపిణి, వీరితో పాటు దివ్యంగులకు మరో వెయ్యి రూపాయలు పెంచనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో కుమ్రంభీం జిల్లా పర్యటనకు వస్తున్న కేసిఆర్ బహిరంగ సభలోంచి పలు ప్రారంభోత్సవాలు చేస్తు గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ చేయనున్నారు.
అలాగే జిల్లాలో గిరిజన యూనివర్సటితో పాటు మరో రెండు, మూడు సంక్షేమ పథకాలు జిల్లా నుండే ప్రారంభిస్తున్నట్లు సమాచారం. సీఎం కేసిఆర్ జిల్లా పర్యటన ఖరారు కావడంతో జిల్లా అధికార యంత్రంగం, జిల్లా పోలీసులు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
5 సంవత్సరాల తరువాత సీఎం కేసిఆర్ జిల్లాకు రానుండడంతో జిల్లా ప్రజలు ఎంతో ఆశగా ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం జిల్లా పర్యటనలో జిల్లాలో మరిన్ని పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.