సరయూ నది ఒడ్డున భారీ వీణ ఏర్పాటు
అయోధ్య: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ 93వ జయంతిని పురస్కరించుకుని అయోధ్యలో సరయు నది ఒడ్డున ఆ మహాగాయని పేరిట నిర్మించిన ఒక కూడలిని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ప్రారంభించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సమక్షంలో లతా మంగేష్కర్ చౌరహాను యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. సరయూ నది ఒడ్డున రూ. 7.9 కోట్ల అంచనా వ్యయంతో ఒక కూడలిని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఈ కూడలి వద్ద 40 అడుగుల పొడవు, 12 మీటర్ల ఎత్తుతో 14 టన్నుల బరువైన ఒక వీణను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పర్యాటకులు, సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకునే విధంగా ఈ కూడలిని తీర్చిదిద్దినట్లు అధికారులు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా భారీ వీణను ఇక్కడ ప్రతిష్టించామని అయోధ్య అభివృద్ధి సంస్థ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ తెలిపారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత రాం సూతర్ ఈ వీణను రూపొందించారని, సరస్వతీ అమ్మవారి చిత్రం కూడా ఈ వీణపై ఉందని ఆయన తెలిపారు.