Monday, December 23, 2024

అధికారులకు నిప్పు

- Advertisement -
- Advertisement -

ఎస్‌ఐని కాపాడబోయి మంటలంటుకొని స్వల్పగాయాలతో తప్పించుకున్న ఎంపిఒ

ఎనిమిది ఇళ్లకు గల రహదారికి అడ్డంగా వెదురు కర్రలు కట్టిన గంగాధర్
సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితులు
విచారణకు ఆదేశించిన కలెక్టర్
అధికారులు వస్తున్నారని తెలుసుకొని పవర్ స్ప్రేయర్‌లో పెట్రోల్ పోసి వారిపై చల్లిన నిందితుడు
మంటలు అంటుకోవడంతో చొక్క తీసేసి పరుగులు తీసిన ఎంపివో

మన తెలంగాణ/బీర్‌పూర్: జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం తుంగూర్ గ్రామంలో రహదారిని ఆక్రమించుకుని ఎనిమిది ఇళ్ల కు రహదారి సౌకర్యం లేకుండా ఓ వ్యక్తి ఇబ్బందులు కలిగిస్తున్నాడనే ఫిర్యాదుపై విచారణకు వెళ్లిన పోలీసు, మండల పరిషత్ అధికారులపై పెట్రోల్ స్ప్రే చేసి నిప్పంటించిన ఘటన మంగళవారం ఇక్కడ కలకలం సృష్టించింది. పోలీసులు, అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి.. తుంగూర్ గ్రామానికి చెందిన చుక్క గంగాధర్ రహదారిని ఆక్రమించుకుని, దారికి అడ్డంగా వెదురు కర్రలు కట్టి, వెనుక ఉన్న ఎనిమిది ఇండ్లకు దారి లేకుండా చేసి ఇబ్బందులు సృష్టించడంతో బాధితులంతా కలిసి సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులను విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంగళవారం బీర్‌పూర్ ఎస్‌ఐ, ఎంపిడిఓ, ఎంపిఓ రామకృష్ణరాజు కలిసి ఆక్రమించిన రహదారి ప్రాంతాన్ని పరిశీలించి విచారణ నిమిత్తం వెళ్లారు.

అయితే అప్పటికే అధికారులు విచారణకు వస్తున్నారని తెలుసుకున్న గంగాధర్ పవర్ స్ప్రేయర్‌లో పెట్రోల్ పోసి దాంతో విచారణకు వచ్చిన అధికారులపై పెట్రోల్‌ను స్ప్రే చేశాడు. ఆకస్మాత్తుగా జరిగిన ఘటనతో ఎస్‌ఐ గంగాధర్‌ను అడ్డుకునేందుకు యత్నించినా ఫలితంగా లేకపోవడంతో ఆయన అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఎస్‌ఐపై దాడిని అడ్డుకోబోయిన ఎంపిఓ రామకృష్ణరాజుపై పెట్రోల్ స్ప్రే చేసి నిప్పంటించాడు. దాంతో ఒక్కసారిగా మంటలు లేవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకునేందుకు ఎంపిఓ పరుగులు తీస్తునే ఒంటిపై ఉన్న చొక్కాను తొలగించాడు. స్థానికులు ఆయనపై నీళ్లు చల్లి మంటలను ఆర్పివేశారు.

దాంతో అదృష్టవశాత్తు స్వల్పగాయాలతో ఎంపిఓ బయటపడ్డాడు. క్షతగాత్రున్ని వెంటనే చికిత్స నిమిత్తం జగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని డిఎస్‌పి ప్రకాష్, సిఐ కృష్ణ పరిశీలించి వివరాలు సేకరించారు. తుంగూరులో జరిగిన ఘటన విషయం తెలుసుకున్న ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ వెంటనే జిల్లా ఆస్పత్రికి చేరుకుని గాయాలపాలైన ఎంపిఓను పరామర్శించి సంబంధిత అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఐని రక్షించబోయి తాను గాయపడినట్లు ఎంపిఓ రామకృష్ణంరాజు ఎంఎల్‌ఎకు వివరించగా వెంటనే ఎస్‌ఐకి ఫోన్‌చేసి ధైర్యంగా ఉండాలనిచెప్పి, అధికారులతో మాట్లాడుతానని ఎంఎల్‌ఎ భరోసా ఇచ్చారు.

దాడిని ఖండిస్తున్నా: ఎంఎల్‌ఎ సంజయ్‌కుమార్

రహదారిని ఆక్రమించుకుని చుట్టుప్రక్కల ఇళ్ల వారికి ఇబ్బందులు కలిగించడమే కాకుండా, సమస్యల పరిష్కారానికి వెళ్లిన అధికారులపై పెట్రోల్ పోసి నిప్పంటించడం దారుణమని, ఈ సంఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఎంఎల్‌ఎ సంజయ్‌కుమార్ తెలిపారు. ఏవైనా సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చట్టప్రకారం పరిష్కరించుకోవాలే తప్ప, అధికారులను భయభ్రాంతులకు గురిచేసి దాడులకు పాల్పడడం సరికాదన్నారు. ఈ విషయమై కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులతో ఎంఎల్‌ఎ ఫోన్‌లో మాట్లాడారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News