Saturday, December 21, 2024

మిరపలో నల్లతామర

- Advertisement -
- Advertisement -

బెడద నివారణకు వేగంగా చర్యలు తీసుకోవాలి

తెలంగాణలోఆయిల్ పామ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి : కేంద్ర మంత్రి నరేంద్రసింగ్‌కు మంత్రి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి
సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి
డ్రిప్ ఇరిగేషన్ నిబంధనల సడలింపుకి త్వరలో ఉత్తర్వులు

మనతెలంగాణ/హైదరాబాద్ : మిరపలో నల్లతామర బెడదను నివారించేందుకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి మంగళవారం నాడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్,కేంద్ర వ్వవసాయ శాఖ కార్యదర్శి లతో ఢిల్లీలోని వారి కార్యాలయంలో సమావేశమై రాష్ట్ర వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మూడు అంశాలపైన కేంద్ర మంత్రికి నివేదిక ఇచ్చామన్నారు. రాష్ట్రంలో మిర్చి పంటలకు, ఉద్యానవన పంటలకు నల్ల తామర తెగులు తగిలిందని, గత సంవత్సరమే ఈ నల్ల తామర తెగులు పై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేస్తే రాష్ట్రానికి శాస్త్రవేత్తలను పంపారని, శాస్త్రవేత్తలు నివేదిక కూడా ఇచ్చారని తెలిపారు. ఈ తెగులు మొదటి సారి మన దేశంలోకి వచ్చిందని కనుగొన్నారని, అదే విధంగా ఈ తెగులు నివారణకు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏ మందులు కూడా పని చేయవని కూడా తెలుసుకున్నారని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా మిర్చి పండించే దేశాలలో భారత్ మూడో స్థానంలో ఉందని, అందులోనూ అత్యధిక శాతం తెలంగాణలోనే పండిస్తారని తెలిపారు. గత పంట సీజన్లోనే నల్ల తామరతో పాటు ఇతర తెగుళ్లు సోకడంతో వరంగల్, మహబూబా బాద్, హన్మకొండ,భూపాల పల్లి, ఖమ్మం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలోని అధిక శాతం రైతులు తమ పంటలను నేలమట్టం చేయాల్సి వచ్చిందని వివరించారు. మిర్చి సాగుకు పెట్టుబడి హెక్టారుకు రూ.2.5-3 లక్షలు అవసరం అవుతుందని, కానీ తెలంగాణలో చాలా మంది మిర్చి రైతులు భూమిని లీజుకు తీసుకోవడం కోసం ఇప్పటికే అదనంగా రూ.25వేల వరకూ చెల్లిస్తున్నారని, ఈ తెగులు వల్ల ఆ పెట్టుబడి వ్యయం ఇంకా పెరుగుతుందని కేంద్ర మంత్రికి విన్నవించామని తెలిపారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి కొత్త మందును తీసుకు రావడం అనేది కేంద్రం ప్రభుత్వం చేతుల్లో ఉన్నందున రైతులకు వీలైనంత త్వరగా ఆ కొత్త మందును అందుబాటులోకి తెచ్చే ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా కోరామని, అందుకు కేంద్ర మంత్రి స్పందిస్తూ మీ అభ్యర్ఝన మేరకే ఒక నిపుణుల బృందాన్ని మీ రాష్ట్రానికి ఇప్పటికే పంపామని నివారణ చర్యలను కూడా వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.

ఆయిల్‌పామ్ పరిశోధనాకేంద్రం ఏర్పాటు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ ను గుర్తించి ఆయిల్ పామ్ పంట విస్తీర్ణాన్ని భారీ స్థాయిలో పెంచేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఆయిల్ పామ్ రైతులకు అనేక ప్రోత్సాహకాలిస్తుందని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ నేపధ్యంలో ఈ పంట ఉత్పత్తిని మరింత పెంచేందుకు అనువుగా తెలంగాణలో ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరామని, ఈ కేంద్రం కోసం రాష్ట్రంలో ఇప్పటికే 150 ఎకరాల స్థలాన్ని కూడా గుర్తించామని కేంద్ర మంత్రికి వివరించామన్నారు. అందుకు ప్రతిస్పందనగా కేంద్రమంత్రి పరిశోధనాకేంద్రం ఏర్పాటు అంశం తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చారన్నారు. అంతే కాకుండా డ్రిప్ పథకాన్ని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కలిపే రైతులకు అమలు చేస్తుందని , అయితే ఆయిల్ పామ్ పండించే రైతులకు డ్రిప్ పధకం మీద కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను పెట్టిందని వాటిని సడలించాలని కోరగా ఆ విషయానికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే ఇస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

దేశంలోనే అత్యధిక స్థాయిలో పామాయిల్ సాగు విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదన్నారు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే లక్షలాది ఎకరాల సాగు జరుగుతుందన్నారు .దశల వారీగా కాకుండా ఏక కాలంలో డ్రిప్ ఇరిగేషన్ టార్గెట్ ను పూర్తి చేయాలని తాము అనుకుంటున్నామన్నారు. ఒకేసారి సబ్సిడీ ఇవ్వాలని కోరగా అందుకు కేంద్ర మంత్రి అంగీకరించారని తెలిపారు.వెంటనే ఉత్తర్వులు ఇస్తామని చెప్పారన్నారు. దేశవ్యాప్తంగా పంటలమార్పిడిపై త్వరలో ప్రధానమంత్రి సమావేశం నిర్వహించాలనుకుంటున్నారని కేంద్రమంత్రి తెలిపారన్నారు. ఆ సమావేశానికి అన్ని రాష్ట్రాలను ఆహ్వానిస్తామన్నారని,పంటల మార్పిడిపై రైతాంగానికి పెద్ద ఎత్తున సహకారం అందించాల్సి ఉంటుందని తెలంగాణ రాష్ట్రం ఎప్పటి నుంచో చెబుతున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News