కర్ణాటక నుండి తిరుపతికి వెళుతున్న ఆర్టిసి బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయిన ఘటన చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో చోటుచేసుకుంది.
తిరుపతి: కర్ణాటక నుండి ప్రయాణికులతో తిరుపతి వస్తున్న ఆర్టిసి బస్సు చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురయ్యింది. బస్సు చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. దీంతో బస్సులోని 22మంది ప్రయాణిసులు తీవ్రంగా గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి క్షతగాత్రులు, ఆర్టిసి ఉన్నతాధికారులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం ఉదయం మదనపల్లె డిపోకు చెందిన ఆర్టిసి బస్సు బళ్లారి నుండి తిరుపతికి ప్రయాణికులతో బయలుదేరింది. అయితే బస్సు చిత్తూరు జిల్లా భాకరాపేట ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా డ్రైవర్ గుండె పోటుకు గురయ్యాడు. దీంతో బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది.
ప్రమాదాన్ని గమనించిన ఇతర వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను తిరుపతి రుయా హాస్పిటల్ కు తరలించారు. మొత్తం 22మందికి గాయాలవగా అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. గుండెపోటుకు గురవడంతో పాటు ప్రమాదం కారణంగా గాయపడ్డ బస్సు డ్రైవర్ గంగాధరంను కూడా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి బస్సు డ్రైవర్ గుండె పోటే కారణమా లేక ఇతర కారణాలేమయినా వున్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.